మామూలుగా కార్పొరేట్ కంపెనీల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది..? చౌక ఉత్పత్తి వ్యయం, ఎక్కువ ఉత్పత్తి, మంచి మార్కెటింగ్, బెటర్ లాభాల మీద ఉంటుంది కదా… మరి అచ్చం కార్పొరేట్ కంపెనీల్లాగే నడిచే మీడియా వ్యాపారంలో ఎలాంటి పోటీ ఉంటుంది..? సేమ్.., బెటర్ సర్క్యులేషన్, మంచి వార్తలు, గుడ్ ప్రజెంటేషన్ వంటి అంశాల్లో పోటీ పడతాయా..? హహహ… కాదు, అసలే కాదు… మీరు తప్పులో కాలేశారు… పత్రికలు… ప్రత్యేకించి తెలుగు పత్రికల నడుమ పోటీ అలా ఉండదు… అలాంటివి అసలు ఇష్యూసే కావు… వాటి మీద ఎవరికీ ఆసక్తి ఉండదు… ఎదుటోడు మన మీద, మన పార్టీ మీద ఏం రాశాడు, తెల్లవారే మనం ఏం కౌంటర్ రాయాలి… ఇదే యావ, ఇదే రంది… సాక్షి-జ్యోతి, సాక్షి-ఈనాడు, జ్యోతి-నమస్తే, నమస్తే-వెలుగు… ఎవరూ తక్కువ కాదు… అందరూ దాదాపుగా ఏదో ఒక పార్టీకి అనుబంధమే కదా… పైగా నమస్తే, సాక్షి అయితే రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల సొంత పత్రికలు… డప్పు తప్పదు, ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే చెండాడక తప్పదు అన్నట్టుగా మారిపోయినయ్… సాక్షి వర్సెస్ ఈనాడు, జ్యోతి పత్రికల నడుమ ఆగర్భ శతృత్వం తెలిసిందే కదా… పైగా కులం పోరు… కాషాయం కట్టిన వెలుగు నమస్తే గొంతులో ఎప్పుడూ కషాయమే… అయితే..?
గతంలో ఏవైనా ప్రత్యేక కథనాలు వస్తే… అవి తమ పార్టీలకు నెగెటివ్‌గా ఉంటే… తమ ప్రభుత్వాల ఇమేజీకి భంగకరం అనిపిస్తే… తెల్లవారే వాటికి కౌంటర్లు రాయించేవారు… ఇప్పుడూ అంతే… సాక్షి అయితే ఆమధ్య ఏదో ఈనాడు స్టోరీ మీద కౌంటర్ రాయించి ఏకంగా బ్యానర్ కొట్టింది… అదుగో ఆ స్థాయికి పోయింది ఈ కథలు, కౌంటర్ల యవ్వారం… ఇప్పుడు అది మరింత పెరిగి, పెరిగి… చివరకు సంపాదకీయ పేజీల్లో వచ్చే ఆర్టికల్స్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది… అంటే కాలమిస్టులు ఎవరు వ్యతిరేకంగా రాసినా, వాటి మీద వెంటనే కౌంటర్లు మన సంపాదకీయ పేజీల్లో రాయించాలన్నమాట… అంటే, ఒక్క అక్షరం మీదపడినా సహించేది లేదు… కౌంటర్ పడాల్సిందే… కడిగేయాల్సిందే… ఉదాహరణకు…
Ads
మొన్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్ ఓ ఆర్టికల్ రాశాడు… అదీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల మీద… కోదండరాం, నాగేశ్వర్ ఓటమి పట్ల హర్ట్ అయినట్టున్నాడు… వోట్లేసిన ఈ పట్టభద్రులకు ఏం పుట్టింది అన్నట్టుగా ఉంది ఆ ఆర్టికల్… పట్టభద్రులయితే మాత్రం కొమ్ములుంటాయా అనేది శీర్షిక… నిజానికి పట్టభద్రులు వాళ్లకు నచ్చినవాళ్లకు వోట్లేసే స్వేచ్ఛ ఉందిగా… వాళ్ల వోటు వాళ్ల ఇష్టం… ఏ పార్టీకి వోటేస్తే బెటర్ అనేది వాళ్ల చాయిస్… దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… మనం ఇప్పుడు ఆ ఆర్టికల్ కంటెంటు మీద చర్చలోకి వెళ్లడం లేదు… ఆయన తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు… కొందరు ఏకీభవించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు… దాన్ని ఆ పత్రిక యాజమాన్య అభిప్రాయంగా చూడాల్సిన పని కూడా లేదు… ఐనాసరే, నమస్తే తెలంగాణకు అస్సలు నచ్చలేదు… కాలమిస్టు అయినా సరే, మన మీద అక్షరాల్ని చల్లితే ఊరుకునేది లేదు అన్నట్టుగా తెల్లవారే ‘పట్టభద్రులకు కొమ్ములున్నాయి’ అని ఓ ఆర్టికల్ అర్జెంటుగా రాయించేసి, అచ్చేసింది… ఎప్పటికప్పుడు లెక్క సెటిల్ చేసేయడమే… ఇదీ ఆ కౌంటర్ ఆర్టికల్….
ఈ కంటెంటు ఏమిటీ అంటారా..? ప్రత్యేకంగా చెప్పేదేముంది..? ఆంధ్రజ్యోతిలో వచ్చిన సంపాదకుడి ఆర్టికల్‌కు ఖండన… నిజానికి ఆమధ్య సీపీఎం పత్రికలు కూడా ఏదో ఆర్టికల్ మీద ఇలాగే స్పందించి, తమ సంపాదకీయ పేజీల్లో కౌంటర్ వ్యాసాలు రాయించినట్టు గుర్తుంది… అంటే, ఈ ధోరణికి ఎవరూ మినహాయింపు కాదు… ఇక్కడ ఓ ప్రశ్న… ఓ కాలమిస్టుకు తన అభిప్రాయాల్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా లేదా..? కాలమిస్టులు తమ రాజకీయ ధోరణులను బట్టి ఎన్నికల ఫలితాల్ని గానీ, పథకాలను గానీ, ప్రభుత్వ నిర్ణయాలను గానీ విశ్లేషిస్తారు… విమర్శిస్తారు… అది పాత్రికేయ సహజం… దాన్ని కూడా సహించేది లేదు, కడిగి పారేస్తాం అంటే ఎలా..? పత్రికల నడుమ, వాటి ప్రత్యేక కథనాల నడుమ, ఉద్దేశపూర్వక వార్తల నడుమ కౌంటర్లు, ఎన్కౌంటర్ల యుద్ధం జరుగుతూ ఉంది… అది ఆగదు… ఆపే సీన్ లేదు… ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్లవి… కనీసం సంపాదకీయ పేజీల్లోని వ్యాసాల పట్లనైనా ‘‘పాత్రికేయ సంయమనం’’ అక్కర్లేదా..? ప్రతి అక్షరం చుట్టూ ఇంతగా మొహరింపు అవసరమా..?! ప్రత్యక్షరమూ ప్రత్యక్ష ప్రతిపక్షమేనా..?!
Share this Article