అది అసలే ఈనాడు కదా… దాని కడుపులో కత్తులకు అన్నీ గుర్తుంటయ్… సందర్భం ఏదైనా సరే, పాతవి తవ్వుకుని మరీ స్పందిస్తుంది… కృష్ణ మరణవార్తలు, జ్ఞాపకాల కవరేజీ చూస్తే మళ్లీ ఇదే గుర్తొచ్చింది… ఈనాడుకు ఇంకా కృష్ణ మీద నాటి శతృభావన పోనట్టు అనిపించింది… అందుకే ఆ కవరేజీని ఏదో మమ అనిపించేసినట్టు కనిపించింది…
సింపుల్… ఈనాడుకు అప్పట్లో ఎన్టీయార్, ఇప్పుడు చంద్రబాబు… వాళ్లకు వ్యతిరేకులు ఈనాడుకూ వ్యతిరేకులు… ఒక్కసారి ఆనాటి సంగతులు సంక్షిప్తంగా చెప్పుకుందాం… అది చెబితే తప్ప ఈనాడు కవరేజీ దౌర్భాగ్యం సరిగ్గా అర్థం కాదు… అది 1984… నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, రాష్ట్రమంతటా ఎన్టీయార్‌కు అనుకూలంగా ఉద్యమాలు, చివరకు నాదెండ్ల దిగిపోయాడు… ఎన్టీయార్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాడు… అదీ సందర్భం…
అప్పట్లో కృష్ణ కాంగ్రెస్‌వాది… పైగా ఎన్టీయార్ అంటే పడదు… అది చాలా అంశాల్లో ఉన్నదే… అందుకని కృష్ణ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూల ప్రచారం చేశాడు… కృష్ణకు రచయిత మహారథి ప్రసంగాలు రాసిచ్చేవాడు, జనం బాగానే వచ్చేవాళ్లు… కృష్ణకు ఉన్న డేరింగ్, డేషింగ్ అనే ముద్ర పెద్ద ఎత్తున జనం వచ్చేలా చేసేది… ఎన్టీయార్‌కు ఈనాడులో వార్తావిభాగం ఎండీ మోటూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రిపోర్టర్లే ప్రసంగాల అంశాలు రాసిచ్చేవాళ్లు… వాటిని పట్టుకుని ఎన్టీయార్ తనదైన శైలిలో ప్రసంగించేవాడు…
Ads
నంద్యాలలో కృష్ణ మీటింగు జరిగింది… జనం విరగబడ్డారు… కృష్ణ తెలుగుదేశాన్ని, ఎన్టీయార్ పోకడల్ని దుమ్ముదులిపేశాడు… ప్రసంగం తరువాత తిరిగి వెళ్తున్నప్పుడు కృష్ణ మీదకు కొందరు రాళ్లు విసిరారు… కంటికి గాయం, హాస్పిటల్ తీసుకెళ్లి మరీ చికిత్స చేయించారు… తరువాత ఎక్కడో మాట్లాడుతూ కృష్ణ ‘ఈ దాడికి తెలుగుదేశానిదే బాధ్యత, ఈనాడు పాత్ర కూడా ఉండవచ్చు’ అన్నాడు… అవును మరి, అప్పట్లో తెలుగుదేశం, ఈనాడు వేర్వేరు కావు కదా…
నా సభకు 3 లక్షల మంది వస్తే ఈనాడు 1550 మంది వచ్చారని (అసలు ఆ లెక్కేమిటో…) రాసింది… ఈనాడు సాగించే కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం జర్నలిజానికే పెద్ద మచ్చ అని కృష్ణ విలేకరుల సమావేశంలోనే ఇచ్చిపడేశాడు… తను అంతే, దాచుకోడు, భయపడడు… మరుసటిరోజు ఈనాడు కృష్ణ వ్యాఖ్యల్ని ఖండించింది… అబ్బే, మేం దౌర్జన్యాల్ని సహించబోం అని ఓ క్లారిటీ ఇచ్చింది… ఆ క్లిప్పింగ్ ఇదుగో…
దాదాపు 15 ఏళ్లపాటు రామోజీరావు సినిమా పత్రిక సితారలో కృష్ణ వార్తలు, ఫోటోలపై నిషేధం… పోతేపోనీ అని వదిలేశాడు కృష్ణ… ఇది గతం… తరువాత కృష్ణ రాజకీయాల నుంచి దూరం జరిగాడు… పాతికేళ్ల క్రితం ఎన్టీయార్ కూడా మరణించాడు… ఎన్టీయార్ బతికి ఉన్నప్పుడే ఈనాడుకు దూరమయ్యాడు… అదంతా వేరే కథ… రామోజీరావు మనమరాలి పెళ్లికి కూడా కృష్ణ హాజరైనట్టు గుర్తు… కానీ ఈనాడు కడుపులో కత్తులు ఏదీ మరిచిపోవు…
సాధారణంగా ఏ విశేష సందర్భం వచ్చినా సరే, ఈనాడులోని సాధనసంపత్తి మొత్తం కదులుతుంది… కృష్ణ మరణం ఓ పత్రికగా ఈనాడు విశేష కవరేజీ ఇవ్వాల్సిన విషాద సందర్భమే… కానీ ఏదో మొక్కుబడిగా రెండు పేజీల్ని మరీ మొక్కుబడి వార్తలు, ఫోటోలతో నింపేసింది… సందేహం ఉన్నవాళ్లు ఆంధ్రజ్యోతి నాలుగు పేజీల ప్రత్యేక కవరేజీతో పోల్చి చూడొచ్చు… ఈనాడు రాయలేక కాదు, రాయాలనే ఇంట్రస్టు లేక… మమ అనిపించింది… అలా వదిలేసింది… రాసినట్టూ ఉండదు, రాయకుండా ఉండదు…
ఎస్, ఆంధ్రజ్యోతి కృష్ణ స్మృతుల మీద మంచి కవరేజీ ఇచ్చింది… ఫోటోలు, బిట్స్, ప్రముఖుల పరామర్శలు, స్పందనలు, తన జీవితవిశేషాలు సహా దాదాపు ప్రతి అంశాన్ని కవర్ చేసింది… సిబ్బంది కొరత పీడిస్తున్నా సరే, ఆంధ్రజ్యోతి కృష్ణకు నాలుగు పేజీల ఘన నివాళి అర్పించింది… విశేషమే…
సాక్షి ఎప్పటిలాగే చేతులు ఎత్తేసింది… అక్కడ రాయడానికి ఎవరూ మిగిలినట్టు లేదు… కృష్ణ, తన తమ్ముడు ఎప్పుడూ వైఎస్ మనుషులే, మొదట్లో వైసీపీయే… యాంటీ తెలుగుదేశం… ఐనాసరే, ఆ సోయి కూడా లేదు సాక్షికి… పేలవమైన కవరేజీ… ఫాఫం సాక్షి… నమస్తే అంటారా..? డప్పు కథనాలు రాసీ రాసీ అసలు మిగతా వార్తలు ఎలా రాయాలో ఏనాడో మరిచిపోయింది… మిగతా చిన్నాచితకా పత్రికలకు అంత సీన్ లేదు… విడిగా వేరే చెప్పుకోనక్కర్లేదు..!!
Share this Article