చదివేస్తే ఉన్న మతి పోయింది…. ఈ వాక్యం ఈనాడుకు అక్షరాలా సరిపోతుంది… రోజురోజుకూ అదే నిరూపించుకుంటోంది… రాజకీయ నాయకుల మీటింగులు, ప్రకటనలు రాసీ రాసీ… క్షుద్ర అనువాదాల యజ్ఞంలో మతులు పోగొట్టుకుని… మంచి రచనశైలిని చేజేతులా బొందపెట్టుకుంటోంది ఈనాడు… ఉదాహరణకు ఈ వార్త… ఫీల్డ్ నుంచి వచ్చిందే పరమ నాసిరకం కాపీ… దాన్ని యథాతథంగా అచ్చేశారు… కనీసం దీన్ని మార్చాలని గానీ, మంచి మానవాసక్తి కథనంగా మార్చాలని గానీ ఆలోచించలేదు… నిజానికి కాస్త మెలో డ్రామా, ఇంట్రస్టింగు పాయింట్స్ ఉన్న ప్రమాదాలో, క్రైం వార్తలో ఉంటే… ఫీల్డ్ నుంచి సరైన కాపీ రాకపోతే… డెస్కులోనే సబ్ ఎడిటర్లు ఆ వార్తలను రీరైట్ చేస్తారు… చేయాలి… చిత్రికపట్టాలి… దానికోసమే సబ్ఎడిటర్లు… కానీ రాను రాను ఈనాడులో సబ్ఎడిటర్ అంటే పేజీల్లో వార్తల్ని నింపేసే పేజీనేషన్ ఆర్టిస్టు అని అర్థం మార్చేసినట్టున్నారు… అలాగే ఉంది స్థితి…
ఈ వార్త చూడండి… నిజానికి చదివించే వార్త… ఒకామె ఎక్కడి నుంచో కడుపు చేత్తో పట్టుకుని, కూలీ పనుల కోసం వచ్చింది… ఎక్కడ వసతి దొరికితే అక్కడ పడుకోవడమే… తాత్కాలికంగా వేసిన ఓ టెంటులో ఆమె పడుకుని ఉన్నప్పుడు ఓ పాము వచ్చి కాటేసింది… ఆమె భయంతో పామును పట్టుకుని విసిరికొట్టింది… అది కాస్తా ఆ పక్కనే పడుకున్న మరో కూలీ మీద పడి, అతడినీ కాటేసింది… ఆ యువతి మరణించింది… ఆ మరో కూలీ చావుబతుకుల్లో ఉన్నాడు… ఇదీ విషాదం… విషయం స్ట్రెయిటుగా, నాలుగు మంచి పదాల్లో, సరళంగా చెప్పకుండా… నానా యాతన పడ్డారు… సరే, మీ దిక్కుమాలిన శైలి అనుకుందాం… కానీ ఇక్కడ ఆమె రొమ్ము ప్రస్తావన దేనికి..? స్తనంపై కాటు అని హెడ్డింగ్ దేనికి..? బిడ్డకు పాలిస్తుండగా అని రాయడం వరకూ వోకే… ఇదంతా ఎలా ఉందంటే..? రొమ్ము మీద కాటేయడానికే నిర్ణయించుకున్న పాము, ఎప్పుడైతే ఆమె పాలివ్వడానికి పూనుకుందో, ఇక అప్పటిదాకా పొంచి ఉన్న పాము ఆమె స్తనం మీద కాటేసింది అని చెబుతున్నట్టుగా ఉంది… ‘‘ఆదమరిచి నిద్రిస్తున్నారు… పాపకు ఆకలైందేమో లేచి ఏడుస్తోంది… బిడ్డను పొదివిపట్టుకుని, తన స్తనం నోటికి అందించింది… ఏడాదిన్నర వయస్సున్న పాప అమ్మపాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆకలి తీర్చుకుంటోంది… అక్కడే పొంచి ఉండి ఓ పాము శ్రుతి రొమ్ముపై కాటేసింది…’’ ఈ విషాద గాథను ఈ అనుభూతి పైత్యం పాము విషంలాగే కాటేసింది… అసలు వార్త స్టార్ట్ కావడమే… బిడ్డకు పాలిస్తుండగా రొమ్ముపై కాటేయడంతో తల్లి మరణించింది అంటూ మొదలైంది… పైగా ఎవరో గ్రామ రెవిన్యూ అధికారి చెప్పిన మేరకు అంటూ రెండో వాక్యం… ఇక్కడ తన హోదా, పేరు, ప్రస్తావన శుద్ధ దండుగ కాదా… ఎంతసేపూ రొమ్ము, స్తనం, పాల మీదే వార్త దృష్టే వార్తలో…!!
Ads
Share this Article