బతుకమ్మ లేదా బోనాలు… మరేదో పండుగ… ప్రత్యేకంగా పాటలు రాయించి, షూట్ చేయించి, యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తున్నదే… ఎక్కువ శాతం అవి తెలంగాణ పాటలే… ఎవరో ఏదో రాస్తారు, పండుగ తీరూతెన్నూ వదిలేసి, వీళ్లకు ఇష్టమొచ్చినట్టు తెలుగు సినిమా టైప్ కల్చర్‌ను తెలంగాణా పండుగ కల్చర్‌గా చూపించడమే వీటిపైన ఉన్న ప్రధానమైన ఫిర్యాదు… అలాగని మొత్తం పాటలు అలా ఉంటాయని కాదు… కొందరి పాటలు…
సరే, ఏదో ఒకటి… తెలంగాణ పాటలకు పట్టం కడుతున్నారులే అనుకుంటాం కదా… కాస్త జాగ్రత్తగా తీయండ్రా బాబూ అన్నా వినిపించుకోరు… పాటలో బీట్ ఉందా లేదా, డాన్సులు చేయడానికి అనువుగా ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు… ఇలా పండుగ స్పెషల్స్ మంగ్లి స్పెషాలిటీ… ఆమె పాటలకు విపరీతమైన ఫాలోయింగ్, వ్యూయర్స్… ఆమె పాడటమే కాదు, ఎక్కువ శాతం పాటల్లో తనే స్టెప్పులు కలుపుతుంది…
ఈ స్టెప్పుల సంగతికి వస్తే… ప్రస్తుతం నాగదుర్గ టాప్… ఆ అమ్మాయి కదలికలు, ఈజ్, మొహంలో భావవ్యక్తీకరణ బాగుంటున్నయ్… ఉరుముల రమ్మంటినే పాటకు ప్రధాన డాన్సర్ తనే… యూట్యూబ్ శ్రీలీల అనిపించుకుంటోంది… ఇప్పుడు ఓ ఔత్సాహిక నిర్మాత బోనాల మీద స్పెషల్ పాట చేయించాడు… ఈ బోనాల పాటలో కూడా తను కనిపిస్తున్నట్టున్నాడు… యూట్యూబ్‌లో ఈ తెలంగాణ పండుగల స్పెషల్ పాటలకు ఆదరణ ఎక్కువ కదా… అయితే…
Ads
ఈ పాట కోసం ఏకంగా నటి, ఈటీవీ జడ్జి ఇంద్రజను తీసుకొచ్చారు… డాన్స్ చేయించారు… ఆమె స్వతహాగా డాన్సరే కాబట్టి వీళ్లు చెప్పిన స్టెప్పులు వేసింది… వోకే… కానీ పాట రాయించుకోవడంలో, చిత్రీకరించడంలో కనీస జాగ్రత్తలు లేకుండా పోయాయి… వీళ్లే కాదు, చాలామంది ఇలాగే తయారవుతున్నారు… ఏకంగా పాట స్టార్టింగే కాళిని చూపించి, శివుడి బిడ్డ అనేశాడు రచయిత… శక్తి ఎప్పుడు శివుడి బిడ్డ అయ్యిందో అర్థం గాక ప్రేక్షకులు బిత్తర మొహం వేయాలి…
ఒకే పాటలో మైసమ్మ అంటాడు, పోచమ్మ అంటాడు… పెద్దమ్మ అంటాడు… రేణుక ఎల్లమ్మ అంటాడు… అన్నింటికీ మించి ఫిర్యాదు ఏమిటంటే… ఈమధ్య వచ్చిన ధమాకా సినిమాలో జింతాక జింతాక అనే ఓ ఫాస్ట్ బీట్ మాస్ పాట ఉంది తెలుసు కదా… సేమ్, దాన్ని తీసుకుని ఈ బోనాలు పాట ట్యూన్ కట్టేశారు… కాపీ కొట్టేశారు… జింతాక బదులు దండక డం డం… ఏదో మేళం అంటాడు, నిజానికి కంటెంట్ గందరగోళం… ఇంద్రజ ఎత్తుకున్న బోనం పైన దీపం లేదు… ఏదో అమ్మవారి విగ్రహం పెట్టేశారు… జీతెలుగు చానెల్‌లో త్రినయని సీరియల్‌లో ఇలాగే చూసినట్టు గుర్తు…
ఎక్కడో చెరువు పక్కన ఓ పెద్ద విగ్రహం పెట్టి, రంగుల జెండాలు కట్టి, బోలెడుమంది ఎక్సట్రా డాన్సర్లను పెట్టి బాగానే ఖర్చు పెట్టారు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాట హిట్టయ్యేది… ఈ ఒక్క పాట గురించి చెప్పుకోవడం లేదు మనం… దీన్ని ఓ ఉదాహరణగా చెబుతున్నాం… తీయండి, పండుగల స్పెషల్స్ ఇంకా తీయండి… మన చెత్త వెగటు సినిమా పాటలకన్నా చాలా చాలా బెటర్… కాకపోతే కాస్త క్వాలిటీ మెయింటెయిన్ చేయండి, అంతే… ఆమధ్య సల్మాన్ ఖాన్ సినిమా ఏదో వచ్చింది, అందులో వెంకటేష్ కూడా ఉన్నాడు… బతుకమ్మ పాటను, కల్చర్‌ను ఖూనీ చేశారు… ఈ ప్రైవేటు వీడియోల్లో అలాగే చేసి, పెద్దమ్మ కోపాన్ని మూటగట్టుకోకండి…!
Share this Article