ముహూర్తం తరుముకొస్తూ ఉన్నట్టుంది… కేటీయార్కు ప్రజాస్వామిక పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది… లోలోపల ఏం జరుగుతున్నదో సహజంగానే ఎవరికీ తెలియదు… కానీ కేటీయార్ అకస్మాత్తుగా అందుబాటులోకి లేకుండా పోయాడు… మరో రెండు మూడు రోజుల వరకూ సారు గారు దొరకరు అని చెబుతున్నారట… ఈనెల 16న యాదాద్రి ప్రారంభ ముహూర్తం కావచ్చునట… 17న కేసీయార్ జన్మదిన వేడుకలు… ప్రత్యేక యాగాలు, పూజలు, బహిరంగసభల స్థాయి హోమాలు… 18న ఏదో జరగబోతోంది… ఏమిటది..? అటువైపేనా పరిణామాలు కదులుతున్నవి… అందరూ సిద్దంగా ఉండండి… ప్రత్యేకించి వారసుడి పట్టాభిషేకాన్ని జస్టిఫై చేయడానికి, గొంతెత్తి కీర్తించడానికి వందిమాగధగణం, మీడియా, కేడర్, విధేయ అధికారగణం కమాన్, బీరెడీ… బంగారు తెలంగాణ దిశలో మరో కీలక మలుపుగా ముద్రపడాల్సిందే…
మరి ఓ అలంకృత గజరాజుకు మాల ఇచ్చి, వారసుడి మెడలో వేయించలేం కదా… ఏదో ఓ యాగం చేయించి, అర్చకుల చేత కిరీటం పెట్టించలేం కదా… రాజ్యాంగవిహితమైన ఓ ప్రొసీజర్ ఉంటుంది… పార్టీ చేత, ఎమ్మెల్యేల చేత మమ అనిపించేసి… చప్పట్లు కొట్టించేసి… గవర్నరమ్మ చేత ప్రమాణ స్వీకార తంతు నిర్వహింపజేసి… అప్పుడు కదా కేటీయార్ కిరీటధారియై భాసిల్లేది… అప్పుడు కదా కేసీయార్ వానప్రస్థాశ్రమానికి కదిలేది… ఈనెల 7న, అంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు… తెలంగాణ భవన్లో కేసీయార్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది…. అత్యంత అరుదుగా సాగే ఈ విస్తృత కార్యవర్గ సమావేశం, ఏమిటిప్పుడు హఠాత్తుగా ఏర్పాటు చేయబడింది..? ఇంకెందుకు..? అదేనా..? కేటీయార్కు జై కొట్టేందుకేనా..? దీనికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరు అవుతారట… పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని సమాచారం ఇస్తున్నారు… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా మారిపోబోతున్నాడా..? దీని తరువాత పార్టీ ఎమ్మెల్యేల భేటీ ఉండబోతోందా..? అందులో కేటీయార్ను తమ నాయకుడిగా ఎన్నుకోబోతున్నారా..? ఇదీ రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్న చర్చ… నిజంగానే కేటీయార్ పట్టాభిషేక తంతుకు అధికారిక ప్రొసీజర్ స్టార్టయినట్టేనా..? చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో… ప్రజాస్వామిక పాలనలో… ఒక పాలకుడు తన వారసుడికి పట్టాభిషేకం జరిపించే తంతు చూడబోతున్నామా..?!
Ads
Share this Article