ఫో… ఫోవే… ఆ హిందీ ఇండస్ట్రీకే వెళ్లిఫో… ఇక్కడేం పని నీకు..? హిందీ వాళ్లు మంచివాళ్లంటున్నావు కదా… అందుకే హిందీ అందరూ నేర్చుకోవాలని చెబుతున్నావు కదా… అసలు నీకేమైనా తమిళం మీద ప్రేముందా..? నీ మాతృభాష మీద అభిమానముందా..? ఎందుకీ పిచ్చి వ్యాఖ్యలు..? ఇప్పుడు నిన్నెవడు స్పందించమన్నాడు..?…. ఇలా సుహాసిని మీద తమిళ నెటిజన్లు ఫుల్లు అగ్గిఫైరయిపోతున్నారు… మామూలు అంశాల్లోనే మంచీమర్యాద చూపించరు కదా ట్రోలర్స్, ఇక సున్నితమైన హిందీ అంశం మీద సుహాసిని దొరికితే విడిచిపెడతారా..? అయితే పెద్దగా వివాదాల్లో వేలుపెట్టని సుహాసిని ఎందుకలా మాట్లాడింది.? అసలు ఏమిటీ ఇష్యూ..?
అనుకోకుండా కన్నడ హీరో సుదీప్ మీ హిందీ సినిమాల పనైపోయినట్టే, మీ బాలీవుడ్ కోటల్ని కొల్లగొడతాం మేము… అని ప్యూర్ సినిమాల కోణంలో ఓ వ్యాఖ్య విసిరాడు… నిజంగానే పుష్ప, బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు ముంబై పెద్దల ఇగోను దెబ్బతీస్తున్నయ్… సుదీప్ వ్యాఖ్యలతో ఎక్కడో మండిన అజయ్ దేవగణ్ హిందీ జాతీయ భాష, అందుకే హిందీలోకి డబ్ చేస్తున్నారు అని ఏదో కూశాడు… సుదీప్ కౌంటర్‌గా ‘మరి మీరు మా భాషల్లో డబ్ చేయండి, సక్సెస్ కొట్టండి’ అని సవాల్ విసిరాడు, ఈలోపు రాజకీయ నాయకులు ఎంటరయ్యారు… అగ్గి మెల్లిమెల్లిగా తగ్గిపోయింది…
అప్పుడప్పుడూ ఈ భాషా వివాదాలు రగులుతూనే ఉంటయ్, నార్త్ పెద్దలు హిందీని రుద్దే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు… మనం ప్రతిఘటిస్తూనే ఉంటాం… ఈ రచ్చ చల్లారే వేళకు సుహాసిని ఎంటరైంది… ‘‘హిందీ భాష మంచిది, హిందీవాళ్లు మంచివాళ్లు, మనమూ హిందీ నేర్చుకుంటే తప్పేమిటి’’ అని కామెంట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో రిపోర్టయింది… అప్పట్నుంచీ సోషల్ మీడియా ఆమె మీద విరుచుకుపడుతోంది…
Ads
నిజానికి ఆమె ఏమన్నది..? ‘‘ఒక భాషకన్నా మనం ఇతరత్రా కొన్ని భాషలు నేర్చుకుని ఉండాలి… హిందీ భాష మంచిదే, అన్ని భాషలూ మంచివే… హిందీవాళ్లు కూడా మంచివాళ్లే… మా ఇంట్లో కూడా వంటవాళ్లు హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు… భాషలన్నీ మంచివే… వాళ్లతో మాట్లాడాలంటే మనకు వాళ్ల భాష వచ్చి ఉంటే తప్పేముంది..? తమిళులతో తమిళంతో మాట్లాడితే వాళ్లు హేపీగా ఫీల్ అవుతారు కదా… ఇదీ అలాగే…’’ స్థూలంగా ఆమె వ్యాఖ్యల సారాంశం అది…
నిజానికి ఆమె ఓ హిందీ అభిమానిగా ఏం మాట్లాడలేదు… హిందీని గానీ, ఇంకో భాషను గానీ నేర్చుకుంటే మంచిదే కదా అనే ఓ స్థూల సానుకూల భావనతో చేసిన జనరల్ కామెంట్స్… ఆమె తమిళాన్ని తూలనాడింది లేదు, కావాలని హిందీని నెత్తినపెట్టుకున్నదీ లేదు… కానీ సోషల్ మీడియా తనకు కావల్సిన కొన్ని పాయింట్లే పట్టుకుని, ప్రచారం చేసి, సుహాసిని మెడలో ఓ వివాదాన్ని వేశాయి…
అది అసలే తమిళనాడు… హిందీ అంటేనే అగ్గిమండే భావనలు ఎక్కువ అక్కడ… హిందీ వ్యతిరేక ఉద్యమాలకు అడ్డా ఆ రాష్ట్రం… పైగా తమిళం అంటే పిచ్చి ప్రేమ… అక్కడ బతికే హిందీవాళ్లకే భయంభయంగా ఉంటుంది ఎప్పుడూ… ఈ నేపథ్యంలో ఒకవైపు సినిమా వాళ్ల నడుమ హిందీ, నాన్ హిందీ గొడవలు, రచ్చ జరుగుతున్నవేళ ఆమె అనుకోకుండా, అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఆమెకు చుట్టుకున్నాయి… ప్చ్, మణిరత్నాన్ని, సుహాసినిని బాగా ప్రేమించేవాళ్లు సైతం ఒక్కసారిగా ఆమె మీద ద్వేషవర్షాన్ని గుమ్మరిస్తున్నారు…!
Share this Article