ఇదేమిట్రా బాబూ అనడిగాం అనుకొండి… ఏం..? పైసా లాజిక్కు లేకుండా రాజమౌళి మెంటల్‌ల ఏది మెరిస్తే దాన్ని తీసేస్తే, 1200 కోట్లు ఇచ్చి కిరీటాలు పెడితే… అదే క్రియేటివిటీ మేం వాడితే మమ్మల్ని తిడతారా అంటాడేమో ఆ సీరియల్ దర్శకుడు… ఎవరా దర్శకుడు..? ఏమిటా సీరియల్ అంటారా..? అది జీటీవీ వాడి సీరియల్… పేరు ఏమిటంటే..? ప్రేమ ఎంత మధురం..? ఎప్పుడైనా ఓ పావు ఎపిసోడ్ గతి తప్పి, మతి తప్పి చూడటం తటస్థిస్తే చాలు… కొంతసేపు అసలు బుర్ర పనిచేయకుండా పోతుంది… అంత పవర్‌ఫుల్ ప్రేమ… నిజానికి ప్రేమ ఎంత పైత్యం అని పేరు మార్చుకుంటే కాస్త నామౌచిత్యం ఉండునేమో…
ఆ కథ, దర్శకుడి వికారం, కథారచయిత చిత్తప్రకోపం, కథన దరిద్రం, కేరక్టరైజేషన్ దారుణాలు… వంటివి మనం ఇక్కడ చెప్పుకోలేం… పొరపాటున చెప్పుకుంటే బిగ్‌బాస్ ఓటీటీలో నటరాజ మాస్టర్, యాంకర్ శివ వేషాలు చూసి బుర్ర గిర్రుమన్న నాగార్జున కథ అవుతుంది మనకు కూడా… కాకపోతే ఈ దరిద్రపు తెలుగు సీరియళ్ల కథలు, కథనాలు, పోకడలు ఎలా ఉన్నాయో తెలియడానికి ఓ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి… చెప్పుకోకపోతే ఆ సీరియళ్ల యాడ్స్ కోసం మనం ఖర్చుపెడుతున్న వందల కోట్లకు అన్యాయం చేసినవాళ్లం అయిపోతాం… రౌరవాది నరకాల్లోకి కూరుకుపోతాం…
ఓ దిక్కుమాలిన సీన్ ప్రోమోలో కనిపించింది… నిజమేనా అని తెగ హాశ్చర్యపోయి కాసేపు సీరియల్‌ను ప్రాణాలకు తెగించి, భరించి చూస్తే, ఆ సీన్ రేపు రాబోతుందని అర్థమైంది… సో, రేపు ఈ సీరియల్ చూడబడే ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చూసినంత భ్రమాత్మక థ్రిల్లింతను పొందెదరు అన్నమాట… అదేమిటయ్యా అంటే..? సూటిగా చెప్పుకుందాం, సంక్షిప్తంగానే… మనది తెలుగు టీవీ సీరియల్ కాదు కదా…
Ads
ఈ సీరియల్‌లో ఓ హీరోయిన్ కలదు… పేరు రాజనందిని… ఆమెను తన చెల్లి రాగసుధ చంపును… ఎందుకో ప్రస్తుతానికి సదరు సీరియల్ రచయితకు, దర్శకుడికి, చివరకు ఆ టీవీ వాడికి కూడా తెలియదు… చంపేసి మాయమయ్యాక 20 ఏళ్ల తరువాత హఠాత్తుగా మళ్లీ వచ్చును… హీరో ఆర్యవర్ధన్‌ను చంపడానికి తెగ ప్రయత్నిస్తూ ఉండును… అదీ ఎందుకో ఎవడికీ తెలియదు… తెలిస్తే తెలుగు టీవీ సీరియల్ ఎలా అవుతుంది..?
సదరు మరణించబడిన అక్క అనురాధ అనే పేరుతో మళ్లీ జన్మ ఎత్తి, అదే ముదురు హీరోను పెళ్లాడును… నేను గత జన్మలో ఫలానా రాజనందినిని, మళ్లీ జన్మ ఎత్తాను అనే సోయి ఆమె కలిగి ఉండును… కానీ దర్శకుడి బుర్రలో లైట్ వెలిగినప్పుడు మాత్రమే సదరు అక్క రాజనందిని ఆత్మ ఈమె అనురాధ అనే పునర్జన్మిని ఆవహిస్తూ ఉండును… ఆ చిత్రవిచిత్ర హావభావములతో ప్రేక్షకుడిని చంపి పాతరేస్తూ ఉండును…
మొదట్లో అక్క రాజనందిని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం అనే టార్గెట్‌తో ప్రవేశపెట్టబడిన ఈ రాగసుధ అనే చెల్లె పాత్ర నిజానికి అసలు విలన్ తనే అని మెల్లిమెల్లిగా చెబుతూ ఉంటాడు దర్శకుడు… తీరా ఆమె ఇప్పుడు హీరోను చంపడానికి ప్రయత్నించును… అప్పుడు హఠాత్తుగా మరణించిన అక్క ఆత్మ హీరోయిన్‌లోకి ప్రవేశించి, అడ్డుకునును… చంపడానికి ప్రయత్నించే రాగసుధను గొరగొర కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ పోతుంటుంది… ఆమె అరుస్తున్నా సరే, ఆ ఇంట్లో ఎవడూ లేవడు… ఎవడికీ వినబడదు, ఆ పక్కనే నిలబడ్డి ఎడ్డిమొహం హీరోకు అస్సలు వినబడదు… ఇక్కడ ట్విస్ట్…
ఇక తప్పించుకోలేనని అర్థమై ఈ రాగసుధ తన నడుముకు కట్టబడిన బెల్టుబాంబును పేల్చేసుకునును… అది భీకరంగా పేలును… అప్పుడు అందరికీ మెలకువ వచ్చును… ఇదండీ కథ… మొన్న రాజీవ్ గాంధీ వర్థంతి వార్తలు బాగా చదివినట్టున్నాడు ఈ సీరియల్ రచయిత… వెంటనే రాజీవ్ హంతకుల్లో మానవబాంబు థాను తనను ఆవహించినట్టుంది… సేమ్, అదే 12 వోల్ట్ బ్యాటరీ… సేమ్, నడుముకు కట్టుకున్న బెల్టు బాంబు… సీరియల్ అంటేనే మన ఇష్టమొచ్చినట్టు రాసుకోవచ్చు కదా… ఆమె చచ్చిపోయిందా..? ఆమె కూడా ఆత్మగా మారి, మరో జన్మ ఎత్తుతుందా..? మళ్లీ హీరో వెంట పడుతుందా..? నో, నో, పేలుడు నుంచి తప్పించుకుంటుందా..? ఎహెపో… రాసుకున్నవాడికి రాసుకున్నంత మహదేవా అని… బొచ్చెడు క్రియేటివిటీని కుమ్మి పారేయొచ్చు ఇక…
సరే, రాసిపారేశాడు… బాంబును పేల్చిపారేశాడు… చివరకు సీరియళ్లను ఆత్మాహుతి దళాలు, బెల్టు బాంబుల దశకు ఎదిగేలా చేశాడు ఈ నయా రాజమౌళి ఎవరో గానీ… ఓసారి తాజా టీఆర్పీలు చూస్తే పాపం ఈ సీరియల్ నిర్మాత మీద జాలేసింది… ఒకప్పుడు కాస్త మంచిగానే ఉండేవి రేటింగ్స్… ఈ తలతిక్క కథనంతో రాను రాను అది కాస్తా 3.50 నుంచి 4.50 మధ్య కొట్టుకుంటూ ఉంది ఇప్పుడు… ఐనాసరే, సీరియల్ నిర్మాత కసి తీరలేదు… తీరదు… జీటీవీ సీరియళ్లు అంటేనే చిలకజోస్యాలు, సోదెమ్మలు, అఘోరా పూజారులు… మూఢత్వాన్ని బలంగా ప్రచారం చేసేవి… మొత్తం సీరియళ్లు కలిపి చూస్తే రోజుకు ఓ హత్యాప్రయత్నం తప్పక ఉంటుంది…
ఆల్‌రెడీ ఇదే సీరియల్‌లో… బంతి బాంబులు గట్రా కొత్త కొత్త పేలుళ్ల కుట్రలకు, అనేక హత్యాప్రయత్నాలకు రచయిత చాలా కష్టపడ్డాడు… ఇప్పుడిక థాను అవతారం ఎత్తాడు… గుడ్ ప్రోగ్రెస్… జగన్ గానీ, కేసీయార్ గానీ అర్జెంటుగా నంది అవార్డులో, సింహ అవార్డులో… పోనీ, ఇంకేదో జంతువుల పేర్లతో టీవీ అవార్డుల్ని ప్రకటించేసి… ఎంకరేజ్ చేయాలని నిర్ణయిస్తే… ప్రేమ ఎంత మధురం సీరియల్‌కు బోలెడన్ని అవార్డులు ఖాయం… ఏమో… అన్నీ దానికే ఇచ్చేసి, చేతులు దులుపుకున్నా హాశ్చర్యపోవాల్సిన పనిలేదు…!! ఏమాటకామాట… హీరోహీరోయిన్లు తెగ విసిగించేస్తున్నారు గానీ… ఈ రాగసుధ పాత్ర చేసిన నటి గౌరీరాజ్ మాత్రం బాగా నటిస్తోంది…! హఠాత్తుగా చంపేశారేమిట్రా బాబూ…!!
Share this Article