ప్రాంక్ కాల్స్, ప్రాంక్ వీడియోస్, తప్పుడు తోవ పట్టించే ప్రోమోలు… అన్నీ వినోదాన్ని పంచుతాయి, సేఫ్‌గా ల్యాండవుతాయి అనేమీ లేదు… కొన్నిసార్లు ఎదురుతంతాయి… ఏం చేయాలో అర్థం కాదు… ఫాఫం, సీనియర్ యాంకర్ సుమదీ అదే స్థితి… యూట్యూబ్ స్టోరీల థంబ్ నెయిల్స్‌లాాగా టీవీల ప్రోమోలు కూడా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేవి… కొందరు నిజంగానే నమ్మేస్తారు…
దీనివల్ల సదరు యాంకర్లు, యాక్టర్ల ఇజ్జత్ పోతుంటుంది… క్రెడిబులిటీ పోతుంటుంది… ఆ సోయి వాళ్లకు ఉండదు… ఏం..? సుమ ఏమైనా అతీతమా..? అందరికన్నా ఓ నాలుగాకులు ఎక్కువే చదివింది… ప్రస్తుతం టీవీల్లో పెద్దగా కనిపించని ఆ ఆంటీయే కాస్త నయం… విషయం ఏమిటంటే… సుమ ఇక యాంకరింగ్‌కు విరామం ఇవ్వనుందనే ప్రచారం రెండుమూడు రోజులుగా బాగా సాగుతోంది…
దీనికి కారణం ఎవరో కాదు, సుమే… వేరీజ్ ది పార్టీ అంటూ రీసెంటుగా న్యూఇయర్ కోసం ఓ షో చేశారు… అందులో సుమ కన్నీళ్లు పెట్టుకుంటూ, తెలుగువాళ్లు నన్ను ఇంత అభిమానిస్తారని అనుకోలేదు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అనే రేంజులో ఎమోషన్ కనబరిచింది… ఇప్పుడు విరామం తప్పడం లేదంటూ ముక్తాయించింది… ఢాం… ప్రోమో బాగానే పేలింది… నెగెటివ్‌గా, పాజిటివ్‌గా…
Ads
రకరకాల కామెంట్లు… మీమ్స్, పోస్టులతో నెట్ హోరెత్తిపోయింది… సుమకు వాచిపోయింది… సుమ ఇక యాంకరింగు చేయదు అన్నంతగా ప్రచారం తెలుగువాళ్లలో వ్యాపించి పోయింది… ఇప్పుడు సుమ వచ్చి, నో, నో, ఇదంతా ప్రోమో కోసమే సుమా… అపార్థం చేసుకోతగదు అని చెప్పినా జనం నమ్మే సిట్యుయేషన్ లేదు… కానీ నిజంగానే సుమ ఆ ప్రయత్నం చేసింది…
నేనెందుకు ఆ షోలో ఎమోషనల్ అయ్యానో షో చివరలో తెలుస్తుంది, నేను ఎటూ వెళ్లడం లేదు, హాయిగా ఉండండి, హేపీగా ఉండండి, నేను పుట్టిందే బుల్లితెర కోసం, ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం… అంటూ కథలు పడింది ఓ వీడియోలో… కానీ హఠాత్తుగా మళ్లీ ఏమైందో ఏమో ఆ వీడియోను డిలిట్ చేసిపారేసింది… కానీ నెటిజన్లను తక్కువ అంచనా వేసింది… ఆ వీడియో ఉన్న పోస్టును స్క్రీన్ షాట్ తీసి, పబ్లిష్ చేసి, మళ్లీ ఆట మొదలు పెట్టారు…
అసలు నేను వెళ్లిపోతున్నా అని ఏడవడం దేనికి..? అబ్బే, అది నిజం కాదు, నమ్మకండి అని మళ్లీ ఆ ఏడుపుకు కౌంటర్ దేనికి..? పోనీ, చెప్పావు, మళ్లీ ఆ వీడియో డిలిట్ దేనికి..? ప్రేక్షకులతో ఆడుకుంటున్నావా అంటూ మళ్లీ ఓ మోస్తరు ట్రోలింగ్… సుమ అయితేనేం..? నెటిజన్లు ఏమీ మినహాయింపు ఇవ్వరు కదా… అవునూ, ఇంతకూ ఆ వీడియో ఎందుకు పెట్టినట్టు..? ఎందుకు తీసిపారేసినట్టు..? చివరకు సుమ కూడా ఇలా తయారైందేమిటి…!?
Share this Article