పాతవి విఠలాచార్య సినిమాల్ని ఈతరం పెద్దగా చూడకపోవచ్చు… యూట్యూబులో బోలెడు ఉన్నాయి… మాయలు, మంత్రాలు, జంతువులు మనుషులైపోతూ, మనుషులు రకరకాల జంతువులు అయిపోతూ… మాయల ఫకీర్లు, రాజకుమారులు, రాజకుమార్తెలు, రాజ్యాలు, కుట్రలు, దేవుళ్లు, అబ్రకదబ్ర హాంఫట్ గట్రా మస్తుంటయ్… జంతువులు ఫైటింగులు చేస్తయ్, ఎక్కడో ఉన్న హీరో లేదా హీరోయిన్ పిలవగానే పరుగెత్తుకు వస్తయ్, విలన్ల భరతం పడతయ్…
అప్పట్లో ఆ సినిమాలు ఫుల్లు హిట్లు… ఏదో సినిమాకు సంబంధించి హీరోతో గొడవ వస్తే, కథలో తను కుక్కగా మారిపోయినట్టు చూపించి, క్లైమాక్స్ దాకా అలాగే నడిపించాడని ఓ జోక్ కూడా ప్రచారంలో ఉంది… ఇదంతా ఎందుకంటే..? జీతెలుగులో వచ్చే త్రినయని సీరియల్ మీద భలే ట్రోలింగు నడుస్తోంది… అవును, భలే ట్రోలింగు… విఠలాచార్య బతికి ఉంటే, త్రినయని సీరియల్ చూసి సిగ్గుపడేవాడు, ఈ రేంజ్ సీన్లు తనకు చేతకానందుకు…
రీసెంటుగా ఓ సీన్… అందులో పాము కారెక్కి, స్టీరింగ్ తిప్పుతూ ఉంటుంది తలతో… పక్కన గాయత్రి అనే పాప కూర్చుని ఉంటుంది… ఎదురుగా ఉన్న తిలోత్తమ అనే విలన్‌కు ఆ కారుతో డ్యాష్ ఇవ్వాలి… ఈ సీన్ మీద ట్రోలింగు… మమ్మల్ని మరీ ఎదవలుగా చూస్తున్నావురోయ్ అంటూ విమర్శలు… ఆన్ ఆఫ్ సరే, స్టీరింగు సరే, క్లచ్ ఎవడు తొక్కాడు, యాక్సిలరేటర్ ఎవడు నొక్కాడు హహహ అని వెక్కిరింపులు గట్రా… నిజానికి ఈ సీన్ చాలానయం…
Ads
అంతకుముందు ఒక సీన్‌లో అయితే హీరోయిన్‌కు ఎవరో విషమిస్తే పాము వచ్చి వెనక్కి పీల్చేసుకుంటుంది… అసలు మొత్తం సీరియల్ నిండా ఆ సీన్లే… హీరోను చంపేసి నీటిలో పారేస్తే ఏకంగా నంది పరుగెత్తుకొచ్చి బయటకు లాగుతుంది… హీరోయిన్ ఏదో పూజ చేసి, పాట పాడి బతికించుకుంటుంది… అంతెందుకు..? సాక్షాత్తూ పార్వతీదేవి ఓ చిన్నపిల్లగా మారి ఈ ఇంటికి తరచూ వచ్చేస్తుంటుంది… తన అనుచరులు మనుషుల రూపంలో ఆ ఇంట్లోనే తిష్టవేస్తారు… హీరోయిన్ ఓ సీసాలో తన పాలు నింపి ఇస్తే, పాము వేరేచోటకు దాన్ని నోటితో పట్టుకుని వెళ్తుంది… చెబుతూ పోతే ఎన్నో… నిజానికి జీతెలుగులోని సీరియళ్లన్నీ దాదాపు ఇదే స్టయిల్… సోదెమ్మలు, శివసత్తులు, మంత్రగాళ్లు ఏవో చెబుతారు, పాత్రలు పాటిస్తాయి… కథలు అలా నడుస్తుంటయ్…
ఈ ట్రోలింగ్ సరే, కానీ ఆ సీరియళ్లనే జనం చూస్తున్నారు మరి… త్రినయని జీతెలుగు సీరియళ్లలో నంబర్ వన్… అన్నట్టు, మరో ఆణిముత్యం గురించీ చెప్పుకోవాలి… ప్రేమ ఎంత మధురం..? మన తెలుగు సీరియళ్ల దరిద్రపు పోకడలకు సరైన ఉదాహరణ… మన పాత తెలుగు సినిమాల్లో హీరో తన బుగ్గ మీద ఓ పెద్ద పులిపిరి వంటి స్టిక్కర్ పెట్టుకుంటాడు, అంతే, ఇక ఎవడూ తనను గుర్తించరు, అది తీసేయగానే అందరూ హీరో అని గుర్తుపట్టేస్తారు, దీని మీద బోలెడు స్పూఫులు, జోకులు తెలుసు కదా…
ఈ సీరియల్‌లో కూడా ఇంతే… ఎవరో సోదెమ్మ ఏదో కూస్తే, కాదు, కూసేలా చేస్తే… సాక్షాత్తూ హీరోయిన్ అంతకుముందే పుట్టిన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పారిపోతుంది… అదే ఊళ్లో ఉంటూ భర్తకు దూరంగా మెలుగుతుంది.,. ఓసారి హీరో కూడా అదే ఇంట్లో చేరితే ఈమె జస్ట్, అలా తల మీద కొంగు కప్పుకుని ఇదే మా ఆచారం అంటుంది, అంతే, హీరో ఆమెను రోజుల తరబడీ గుర్తుపట్టడు… ఆ గొంతు గట్రా కూడా పట్టుకోలేడు… ఎడ్డిమొహం వేసి తిరుగుతుంటాడు… వాళ్లకు ఈ సీరియల్ దర్శకుడు పెళ్లి కూడా చేస్తాడు… చెబుతూ పోతే ఒడవదు, తెగదు…
ఇవన్నీ సరే, ఎంతోకాలం టాప్ రేటింగులో ఉన్న కార్తీకదీపం సంగతి తెలుసు కదా… స్వతహాగా డాక్టరైన హీరో పిల్లలు తనకు పుట్టలేదనీ, అక్రమ సంతానం అనీ నమ్మి ఏళ్లపాటు సీరియల్ నడిపిస్తాడు… ఇప్పుడు మళ్లీ వస్తోంది ఆ సీరియల్, ఇంకా రెట్టించిన ఆ పాత దరిద్రాన్ని మోస్తూ… చెబుతూ పోతే తెలుగు సీరియళ్లు, తెలుగు సినిమాల క్రియేటర్స్‌కు ప్రేక్షకులు ఎర్రి ఎదవలుగా కనిపిస్తారు… కాకపోతే రెండూ వేర్వేరు మార్గాల్లో..!!
Share this Article