Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రైల్ పలారం..! నో ఆయిల్, నో ఫ్రై, నో మసాలాస్… సింపుల్, టేస్టీ, హెల్దీ…!

August 9, 2022 by M S R

రైల్ పలారం… తెలంగాణ వంటల్లో సర్వప్ప, సకినాలు, గట్క, కారపు అప్పాలు గట్రా పాపులర్ అయ్యాయి గానీ ఈ రైల్ పలారం చాలామంది తెలంగాణవాళ్లకే తెలియదు… నిజానికి ఇది చాలా పాత రెసిపీయే… ఎంతోకాలంగా తెలంగాణ అమ్మలు ప్రేమగా చేసి వడ్డిస్తున్నదే… కాకపోతే కాస్త టైమ్ ఎక్కువ తీసుకుంటుంది… కొంచెం కష్టపడాలి… గణేష్ చతుర్థికి కుడుములు, ఉండ్రాళ్లు చేసుకుంటాం కదా… అలాంటివే చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, మనకు ఇష్టం వచ్చిన రీతిలో పోపు పెట్టుకుని, మనకు నచ్చిన పప్పో, కొబ్బరో జతచేసుకోవాలి…

నో ఆయిల్… ఆవిరి మీద ఉడుకుతాయి… నో ఫ్రై… జస్ట్, పోపు… నో గరం మసాలాస్… పెద్ద పెద్ద ఖరీదైన ఇంగ్రెడియెంట్స్ ఏమీ ఉండవు… బియ్యపు పిండి, పప్పు… కాకపోతే తొలిసారే పర్‌ఫెక్ట్‌గా రాకపోవచ్చు… నిన్న ఫేస్బుక్ కవర్ ఫోటోగా పెడితే చాలామంది ఆసక్తిగా రెసిపీ తయారీ గురించి అడిగారు… సో, మన సూపర్ చెఫ్ Jyothi Valaboju…  ను అడుగుదాం… జ్యోతి గారూ, ఈ రైలు పలారం ఎలా చేసుకోవాలో ఓసారి మా పాఠకులకు చెబుతారా..?

అలాగేనండీ… ఇదుగో, చదవండి, చేసుకొండి, ఆత్మారాముడికి ఓ కొత్త వెరయిటీని రుచి చూపించండి…

Ads



పాతకాలంలో… అంటే కొన్నేళ్ల క్రితం… అంటే మా అమ్మావాళ్లు చిన్నగా ఉన్నప్పుడన్నమాట… ఆ సమయంలో ఎక్కువగా దూరప్రయాణాలు అంటే రైళ్లోనే… ఓ తిరుపతికో , కాశీకో వెళ్లాలంటే రెండు మూడు రోజుల ప్రయాణం. దారిలో తినడానికి ఏమీ దొరకవు.. ఇప్పట్లా స్టేషన్లలో తినుబండారాలు దొరికేవీ కావు. దుకాణాలు ఉండేవి కావు. అంతా ఇంటి నుండే చేసి పాకింగ్ చేసుకుని వెళ్లేవాళ్లు. అప్పాలు, లడ్లు, మురుకులు లాంటి చిరుతిళ్లు, రొట్టెలు, ఉల్లెగారెలు (మసాలా పూరీలు) లాంటివి చేసి తీసుకెళ్లేవాళ్లు. హోటళ్లలో తినడం కూడా తక్కువే.
సో, చాలామంది వంట సామాను కూడా తీసుకెళ్లేవారు. చాలా యాత్రాస్థలాల్లో వంట చేసుకోవాడికి అవకాశముండేది. దేవస్థానం వారి సత్రాలలో వంట చేసుకునేందుకు వీలు ఉండేది. వంట చేసుకోవడానికి గిన్నెలు, పొయ్యిలు (పంపు స్టవ్వు లేదా బత్తీల స్టవ్వులు), అద్దెకిచ్చేవారు. సరుకులు ఇంటి నుండి తీసుకొచ్చినా, అయిపోతే కొనుక్కోవచ్చు. ఒకరిద్దరు కాదాయే. కుటుంబం మొత్తం వెళితే బయట తినడం అసాధ్యం కదా. జరంత పప్పు, పచ్చిపులుసు, అన్నం చేస్తే చాలు. కడుపు నిండిపోయేది.
ఇక విషయానికొస్తే… రైలు స్టేషన్లలో తినడానికి దొరకవని చెప్పా కదా. అలాటప్పుడు నాష్టా లేదా స్నాక్స్ లా పనికొచ్చే పలారం ఒకటుంది. ఇది చేసుకుని టిఫిన్ డబ్బా లేదా స్టీల్ డబ్బాలో పెట్టుకిన వెళితే రెండు రోజులు నిలవ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అడిగినప్పుడు కాగితం మీద వేసిస్తే చాలు. ఇలా నిలవ ఉండేవి, రైలు ప్రయాణాలకోసం ఎక్కువగా చేసేవారేమో… అందుకే వాటిని రైలు పలారం అంటారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు కాని రైలు ప్రయాణం కోసం కాదు. టిఫిన్ లా ఇంట్లోనే చేసుకుంటున్నారు.
నిలవ చేసుకునే అవసరం లేదు. కావలసినప్పుడు ఎంత అవసరమైతే అంత చేసుకోవచ్చు. శనగపిండితో చేసే వంటలు కడుపు జాడిస్తాయి. అందుకే రైలు ప్రయాణాల్లో శనగపిండికి బదులుగా బియ్యం పిండితో చేసుకునేది కాబట్టి , నూనెలో దేవేది (వేయించేది) కాదు కాబట్టి రుచికి రుచి… ఆరోగ్యానికి ఆరోగ్యం…
రైలు పలారం…
బియ్యం పిండిని ఒకటికి ఒకటి కొలతలో నీళ్లతో మరిగించి, కాస్త ఉప్పేసి, బియ్యం పిండి వేసి కలిపి దింపేయాలి. ఇలా ఉప్పిన పిండిని కాస్త చల్లారాక చేత్తో బాగా పిసికి చిన్న వేపకాయలంత ఉండలు చేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత మనకు నచ్చినట్టుగా పోపేసుకోవాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి , తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు వేసి వేగిన తర్వాత ఈ ఉండలు వేసి బాగా వేయించాలి. ఇందులో తగినంత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కొద్ది సేపు వేయించి దింపేయాలి.

పెసరపప్పు నానబెట్టి కచ్చాపచ్చాగా రుబ్బి పోపులో వేసి వేయించాలి. బాగా వేగి, తడి ఆరిపోయిన తర్వాత నూరిన లేక తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఆవిరి మీద ఉడికించిన ఉండలు, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద లేదా అల్లం తరుగు వేసుకోవచ్చు. చివరలో సన్నగా తరిగిన కొత్తిమిర వేసి, నిమ్మకాయ పిండి దింపేయాలి. మనిష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. సన్నగా తరిగిన క్యారట్ , కొబ్బరి తురుము ఇలా ఏధైనా వేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినొచ్చు. నూనె కూడా తక్కువే పడుతుంది.. పిల్లల కోసం ఈ పిండిలో ఉడికించిన పాలకూర, క్యారట్, బీట్రూట్ పేస్ట్ కలిపితే రంగులు వస్తాయి. ఇష్టంగా తింటారు…



ఇక్కడ చూపించే వీడియో మన స్టార్ చెఫ్ తుమ్మ సంజయ్‌దే… ఆరేడేళ్లయినట్టుంది… కొంత డిఫరెంటుగా ఉంటుంది… కాకపోతే సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో, బేసిక్స్ ఏమిటో చూసి, నేర్చుకోవడానికి ఇది ఉపయోగకరం… ఎలాగూ మనకు ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకుంటాం కదా… మీకు పెద్దగా వేరే వీడియోలు దొరకవు… ఇదే బెటర్… అవునూ, చెప్పనేలేదు కదూ… పలారం అంటే టిఫిన్ లేదా స్నాక్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
  • ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
  • ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions