.
సూపర్ స్టార్ హీరోగా , మహేష్ బాబు బాలనటుడిగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో” గూఢచారి 117″ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో….
సినిమా రిలీజ్ ఇంకో మూడు రోజులుందనగా ఆరోజు రాత్రి నిర్మాత “డోకల మురళి” గారొచ్చి డైరెక్టర్ గారితో ” డిస్ట్రిబ్యూటర్స్ పాటలు చూసి హ్యాపీ ఫీలయ్యారు. మహేష్‌బాబు పైన సెకెండ్‌హాఫ్ లో ఇంకో సోలో బ్రేక్ డాన్స్ పాట పెడితే సినిమాకి ఇంకా హెల్ప్ అవుతుంది. టైం లేదుకనుక మొదటి వారం అయ్యేలోపునైనా జాయిన్ చెయ్యగలిగితే బాగుంటుంది అంటున్నారు సర్” అన్నారు.
“వారం రోజుల తరువాతెందుకు ఇప్పుడే పాట తీసి ప్రింట్స్‌లో జాయిన్ చేద్దాం” అన్నారు డైరెక్టర్ గారు.
ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యమవుతుంది అని అందరూ కంగారు పడుతుంటే “ప్రయత్నం చేసి, అవ్వలేదనుకుంటే ఓకే గానీ అసలు ప్రయత్నమే చెయ్యకుండా అవ్వదనుకోవటం అసమర్ధుల లక్షణం ” అంటూ…
Ads
ఆరాత్రి 10 గంటలకు మ్యూజిక్ డైరెక్టర్ “చక్రవర్తి” గారికి ఫోన్ చేసి విషయం చెప్పి “మీరేం చేస్తారో సార్ రేపు ఉదయం 9 గంటలకల్లా ఓ ట్యూన్ కావాలి సర్ “అన్నారు . వేటూరి గారితోనూ అదే చెప్పారు.
మరుసటిరోజు ఉదయం అర్ధగంటలో చక్రవర్తి గారు ట్యూన్ ఇవ్వటం, పదేపదిహేను నిమిషాల్లో వేటూరి గారు పాటంతా డిక్టేట్ చెయ్యటం, ఒంటి గంటలోపు పాట రికార్డ్ అయిపోయి 3 గంటలకు శైలజ గారొచ్చి పాడేయటం, 4 గంటలకు పాట కేసెట్ డాన్స్ మాస్టర్ కి పంపేయటం, అన్నీ శరవేగంగా జరిగిపోయాయి.
కాస్ట్యూమర్స్ రెండు గంటల్లో రెడీమెడ్ దుస్తులు కొనుక్కొచ్చేశారు.
రాత్రి 7 గంటలకు వాహినీ స్టూడియోలో రోడ్స్ పైన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది.
మాస్టర్ అప్పటికప్పుడే కంపోజ్ చేసిన డాన్స్ ని అద్భుతంగా ఒకే టేక్‌లో చేసేసేవాడు మహేష్‌బాబు.
ఎక్స్‌పోజ్ చేసిన ఫిల్మ్ క్యాన్స్ అయ్యింది అయినట్లు అప్పటికప్పుడు ల్యాబ్‌కి పంపిస్తే, వెంటనే వాళ్ళు ప్రింట్ వేసి ఎడిటింగ్ రూంకి పంపిస్తే , అయినంతవరకూ పోర్షన్ అక్కడ ఎడిట్ చేసేవారు.
అదే ప్రోసెస్ లో తరువాతిరోజు రాత్రి కూడా తెల్లవారేవరకూ షూట్ చేసి, ఎడిట్ చేసి, ప్రింట్స్ వేయించి, తెల్లవారు ఝామున సెన్సార్ ఆఫీసర్ కి చూపించి అంగీకారం తీసుకుని, డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ తీసుకెళ్ళే సమయానికి కొత్త పాట ప్రింట్స్‌లో జాయిన్ చేయటం చకచకా జరిగిపోయింది.
రిలీజయ్యాక ఆ పాటకి ధియేటర్స్ విజిల్స్‌తో హోరెత్తాయి.
ఆ పాట నిజంగానే సెకెండ్ హాఫ్ కి బలమైంది.
సినిమా శతదినోత్సవం జరుపుకుంది.
మా అందరిలా గురువు గారు (కోడి రామకృష్ణ) కూడా, అంత తక్కువ సమయంలో సాధ్యం కాదులే అనుకొని వొదిలేయలేదు. అందుకే ఆయన శతాధిక చిత్రాల దర్శకుడయ్యారు.
“ఏ విషయంలోనైనా సరే …. అమ్మో, గమ్యం ఎంతో దూరం కదా అనుకుంటే భయమే కలుగుతుంది.
ధైర్యంగా అడుగులేయటం మొదలెడితే గమ్యం చేరటానికి సమయం పట్టినా కనీసం దూరమైనా తగ్గుతుంటుంది కదా” ____ దేవీప్రసాద్.
Share this Article