READ THIS: మూఢ నమ్మకాల పర్యవసానాలు ఎలా ఉంటాయో పూర్తిగా చదివి తెలుసుకోండి. నానమ్మను బలిచ్చాడొకడు.. చచ్చి బతికొస్తారంటున్నారు మరొకరు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నన్‌కట్టి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రుక్మణి గోస్వామి తన మనవడు గుల్షన్ గోస్వామితో కలిసి ఉంటోంది. వారింటికి దగ్గర్లోనే శివాలయం ఉంది. శివుడిపై విపరీతమైన భక్తి కలిగిన గుల్షన్ రోజూ అక్కడికి వెళ్లి పూజలు చేసేవాడు. ఆలయంలోనే గంటలకొద్దీ గడిపేవాడు.
శనివారం ఉన్నట్టుండి ఇంట్లోని కత్తి తీసుకొని తన నానమ్మపై దాడి చేశాడు. ఆమెను నరికి, ఆ రక్తాన్ని తీసుకెళ్లి శివాలయంలోని శివలింగంపై పోశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ కత్తితో తన గొంతు కోసుకున్నాడు. గమనించిన స్థానికులు అతణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. శివుడికి ప్రాణాలను అర్పిస్తే పుణ్యమని, దానివల్ల పునర్జన్మ ఉండదన్న ఆలోచనతోనే గుల్షన్ ఈ పని చేశాడని ఊరివాళ్లు అనుకుంటున్నారు.
Ads
* * *
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సక్తి జిల్లా టాన్డల్డీ గ్రామంలోని ఓ తాళం వేసిన ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఊరివాళ్లు అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే వారు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి, అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. వికాస్ గోండ్, విక్కీ గౌండ్ అనే ఇద్దరు అన్నదమ్ములు చచ్చిపడి ఉండగా, ఆ శవాల చుట్టూ వారి కుటుంబసభ్యులు, మరికొందరు కలిసి తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఉజ్జయినికి చెందిన ఓ స్వామీజీ ఫొటో పెట్టుకుని ఆయన్ను ప్రార్థిస్తున్నారు. చనిపోయివారు తిరిగి బతుకుతారని, వారి ఆత్మలు తిరిగి దేహంలోకి వస్తాయని అంటున్నారు. వెంటనే పోలీసులు వారి కుటుంబసభ్యులను ఆసుపత్రికి తరలించారు.
వారంతా ఏదో ట్రాన్స్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఎవరూ ఏమీ చెప్పే స్థితిలో లేరు. ‘మా ఇంటి మీదకు ఏదో దుష్టశక్తి ఆవహించింది. అదే మా అన్నలను చంపింది’ అని మృతుల చెల్లెలు కలవరించడం మాత్రం వైద్యులు గుర్తించారు. చనిపోయినవారి దేహాల్లో విషపు ఆనవాళ్లున్నాయని, వాళ్లు విషం తీసుకున్నారా, లేక ఎవరైనా తాగించారా అనేది తెలియదని పోలీసులు అంటున్నారు.
* * *
ఇవి అప్పుడెప్పుడో జరిగిన ఘటనలు కాదు. సరిగ్గా రెండ్రోజుల క్రితం జరిగినవి. టెక్నాలజీ, ఇంటర్‌నెట్, రవాణా సాధనాలు ఇంత పెరిగినా మూఢత్వం మాత్రం పోవడం లేదు. ఇంకా ఇలా బయటకు రాని గుప్తనిధుల వేటలు, వశీకరణ యాగాలు, చేతబడుల ఆలోచనలు.. బోలెడన్ని ఉన్నాయి. ‘అవన్నీ నిజంగా ఉన్నాయి. నీకు అనుభవం అయితే తెలుస్తుందిలే బ్రో’ అని అనుకునే చదువుకున్న ప్రతి ప్రబుద్ధుడూ ఓ పెద్ద మూర్ఖశిఖామణే. కాళ్లకు నల్లదారాలు, చేతికి తాయెత్తులు కట్టుకున్నటువంటి ప్రతి చదువుకున్న పహిల్వాన్/పహిల్వాన్‌రాలూ ఈ మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నవాళ్లే.
మీ కాళ్ల వంక చూస్కోండి. నల్లదారం ఉందా? అయితే రేపోమాపో మీ చుట్టూ క్షుద్రపూజలు జరుగుతాయని గుర్తుంచుకోండి. ‘పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ’ టైపు సోదిని చెప్పుకుంటూ, ఒప్పుకుంటూ మీ అంధకార లోకంలో మీరు బతికేయండి. అయినా కాళ్లకు నల్లదారం కడితే నెగెటివ్ ఎనర్జీ పోవడం, శనిదేవుడు మనకు దూరంగా ఉండటం ఏమిటి? అదేం లాజిక్? – విశీ (వి.సాయివంశీ)
అరవై డెబ్బయ్ యూట్యూబ్ చానెళ్లు నడిపిస్తున్న ఓ దిక్కుమాలిన టీవీ… ఇలాంటి సీరియళ్లతోనే పబ్బం గడుపుకుంటున్న టీవీ సీరియళ్లు… మూఢ విశ్వాసాలను పెంచే దొంగ స్వాములకు ఈ పోస్టు అంకితం… ముచ్చట)
Share this Article