కంగువా అనే తమిళ డబ్బింగ్ సినిమాలో శ్రీమణి ఓ పాట రాశాడు… ఆది జ్వాల అని మొదలవుతుంది… అసలు డబ్బింగ్ పాటల్లో నాణ్యత చూడకూడదు… ఏవో ఆ ట్యూన్లలో కొన్ని తెలుగు పదాలు ఇరికించి వదిలేస్తారు… తమిళ నిర్మాతలు కూడా తమిళ భాషలో పాటలు, సంగీతం, సాహిత్యం గురించి ఏమైనా పట్టించుకుంటారేమో గానీ వేరే భాషల్లో ఏం రాస్తున్నారో కూడా పెద్దగా పట్టించుకోరు…
ఈ పాట కాస్త నయం… దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ మంచి ట్యూన్ పట్టాడు… అనురాగ్ కులకర్ణి కూడా ఆ భావానికి తగినట్టు పాడాడు… గుడ్… అదేదో పీరియాడికల్ డ్రామా అయి ఉంటుంది… ఏదో ఆదిమజాతికి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి… కానీ తీరా పాటలోకి వెళ్తే… అక్కడక్కడా ఆశ్చర్యం…
ఈ మట్టి ముట్టే ముందే ఇక్కడ పుట్టింది మేమే… అంకెలు పుట్టకముందే లెక్కలు కనిపెట్టింది మేమే… అని చరణం… తను ఏం చెప్పదలుచుకున్నాడో జుత్తు పీక్కున్నా అర్థం కాలేదు… దీనికి అతిశయోక్తి అలంకారానికి భిన్నంగా ఇంకేమైనా అధివాస్తవిక అలంకారం వంటివేమైనా ఉన్నాయేమో తెలియదు… కవి హృదయం అస్సలు తెలియదు…
Ads
మట్టి ముట్టే ముందే అంటే… ముట్టి పుట్టకముందే పుట్టిందా ఆ జాతి..? అంకెలు పుట్టకముందే లెక్కలు కనిపెట్టడం ఏమిటి..? ఈ సాహిత్యానికి అర్థమేమిటి..? పైగా అదేదో చంద్రబోస్‌కు అలవాటైన రీతిలో… ఆది జ్వాల, అనంత జ్వాల వీర జ్వాల, వైర జ్వాల, జీవ జ్వాల, ప్రాణ జ్వాల అంటూ రకరకాల జ్వాలల్ని, ఏవో తోచిన పదాలన్నింటికీ రైమ్ కుదిరేట్టు జ్వాలను అంటించాడు రచయిత… దైవ జ్వాల వోకే, దావాగ్ని జ్వాల ఏమిటి..? దావాగ్ని అంటేనే జ్వాల కదా…
రెండో చరణం కాస్త బెటర్… సుడిగాలులు, వడగాలులు, పిడుగాగని జడవానల్లో కూడా వణికించి నిలబడినోళ్లం అని ఓ జాతి కీర్తన… పర్లేదు… బడబాగ్నుల ఒడిలో పెరిగినవాళ్లం, జఠరాగ్నుల జడిలోపల నలిగినవాళ్లం, పంచాగ్నులతో పోరాడి గెలిచినవాళ్లం అంటూ ప్రకృతి విపత్తుల నుంచి తమను తాము రక్షించుకుని, ఉనికిని కాపాడుకున్న తీరును చెప్పడం కూడా బాగుంది… ఎగిసిపడే అగ్గిజలం అంటాడు ఓచోట… లావాను ఉద్దేశించే అయితే మంచి పదప్రయోగం…
అగ్గి సెఖ, వాయు సెఖ, నీటి సెఖ, రాతి సెఖ అని ఆమె ఏదో పాడుతోంది… కొంపదీసి సెగను అలా పలుకుతోందా..? రచయిత ఏదో అలా రాసేశాడా… పాపం ఆ స్వరం…
సినిమా పేరు కంగునా అన్నట్టుగా కనిపిస్తోంది… నిజానికి అది కంగువ… తమిళ నిర్మాతలకు అలవాటే కదా… తెలుగులోకి కూడా అలాగే వలిమై, రాయన్, బిగిల్ వంటి టైటిళ్లు యథాతథంగా విసిరేస్తారు మన మీదకు… ఎంచక్కా ఆది జ్వాల అనో అనంత జ్వాల అనో పెట్టుకోవచ్చుగా… కంగువా అంటే అర్థమదే… ఐనా మన అభిప్రాయాల్ని వాళ్లెప్పుడు పట్టించుకున్నారని… ఆ ధోరణి కూడా అగ్గి సెఖ, వాయు సెఖ టైపే కదా…!!
Share this Article