మీడియా, సెలబ్రిటీలు… డబ్బు కోసం దేనికైనా తెగిస్తారు… ఎంత పేరున్న మీడియా అయినా సరే, ఎంత పేరున్న సెలబ్రిటీ అయినా సరే… ప్రత్యేకించి మన తెలుగులో అంతే… ఈనాడులో వచ్చిన ఈ యాడ్ దానికే నిదర్శనం… రోజూ తెల్లారిలేస్తే మస్తు నీతులు చెబుతుంది కదా ఈనాడు… మరి వాణిజ్య ప్రకటనల్లో ఆ నైతికతను ఎందుకు పాటించదు..?
మిగతా పత్రికలను వదిలేయండి కాసేపు… వాటికి ఏ నీతులూ వర్తించవు… కానీ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికగా ఈనాడుకు ఓ బాధ్యతంటూ ఏడవాలి కదా… తను ఆదర్శంగా ఉండాలి కదా… అబ్బే., డబ్బు డబ్బు డబ్బు… కార్పొరేట్ విద్యాసంస్థల యాడ్స్ దగ్గర నుంచి ఇదుగో ఈ విస్కీ యాడ్స్ దాకా…
నో, నో, మద్యం తాగితే తప్పులేదు, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయమే మద్యం మీద ఆధారపడి ఉంది… మద్యం యాడ్స్ ఇస్తే తప్పేమిటీ అంటారా..? మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్ పత్రికల్లో పబ్లిష్ చేయడానికి లేదు… అంతెందుకు..? డాక్టర్లు, హాస్పిటల్స్ యాడ్స్ కూడా ఇవ్వకూడదు… పెద్ద పెద్ద కార్పొరేట్ యాడ్స్ కూడా వేస్తూనే ఉంటాయి మన పత్రికలు… ప్రత్యేకించి సంతానోత్పత్తి సంస్థలవి… (ఓ రీతీరివాజు లేని టీవీల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు…)
Ads
చిన్నగా కనీకనిపించని రీతిలో ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ అని కనిపిస్తుంది బ్రాండ్ నేమ్ కింద… అంటే, ఉత్పత్తి పేరు ఏదైనా చేసేది విస్కీ బ్రాండ్ క్యాంపెయిన్ మాత్రమే… అంటే విస్కీ అమ్మకాల కోసమే… అంటే మద్యం విక్రయ ప్రచారాల నిషేధాన్ని ఒకరకంగా ఉల్లంఘిస్తున్నట్టే… ఇదే కాదు, గుట్కాకు పాన్ మసాలాల యాడ్స్, సిగరెట్లకు అగర్‌బత్తీల యాడ్స్ ఎట్సెట్రా… అసలు ఆయా బ్రాండ్లు ఈ చిల్లర ఉత్పత్తులు తీసుకురావు, మార్కెట్‌లో పెట్టవు… జస్ట్, ఇలాంటి యాడ్స్ కోసమే… వీటినే సరోగేట్ యాడ్స్ అంటారు…
ఆమధ్య గుర్తుందా..? ఏదో గుట్కా సరోగేట్ యాడ్‌లో నటించినందుకు అమితాబ్ బచ్చన్ తరువాత సిగ్గుపడి, చెంపలేసుకుని, ఆ డబ్బు వాపస్ ఇచ్చేసి, ఆ యాడ్స్‌ను వాపస్ తీసుకున్నాడు… సమాజం పట్ల ఓ బాధ్యత అది… కంపెనీలకు, మీడియాకు శరం లేకపోయినా తను వ్యక్తిగతంగా బాధ్యతను ఫీలయ్యాడు… తరువాత అక్షయ్ కుమార్ కూడా చెంపలేసుకున్నట్టు వార్తలొచ్చాయి కానీ యాడ్స్ యథాతథంగా చలామణీలోకి వచ్చినట్టు గుర్తు…
మన తెలుగులో అంటారా..? ఇలాంటి బ్రాండ్లకు మహేశ్ బాబే హీరో… సర్వానర్థ దాయకాలు కూల్ డ్రింక్స్… వాటి యాడ్స్ చేసేవాడు… ఇప్పుడు తను బ్రాండ్ మారితే పుష్ప పట్టుకున్నట్టున్నాడు… ఏదో గుట్కా సరోగేట్ యాడ్ కూడా చేసినట్టున్నాడు… సమాజం, బాధ్యత, నైతికత, తొక్కా, తోలు… ఇలాంటి వ్యర్థ పదాలు వాడకండి… వాళ్లకు అసలే చిరాకు ఎక్కువ…!!
Share this Article