నిన్న మనం ఓ పాట గురించి మాట్లాడుకున్నాం… ఊత్తుకాడు వెంకటసుబ్బ అయ్యర్ రాసిన అలై పొంగెరా గీతాన్ని వేటూరి అబ్బురంగా అనువదించిన తీరు గురించి… గాదిలి పదాన్ని కాదిలి అనే గాయకులు పాడటం, దానికి కారణం గట్రా చెప్పుకున్నాం కదా… ఇంత పాపులర్ గీతం కదా, ఏ స్వరాభిషేకంలోనో, ఏ పాడుతా తీయగా షోలోనో ఎస్పీ బాలు వివరణలు, సందేహనివృత్తులు ఏమైనా ఉన్నాయేమో అని వెతికితే… ఎప్పటిదో పాడుతా తీయగా వీడియో కనిపించింది…
తను చెప్పిన కొన్ని అంశాలు అక్షరాలా నిజాలే… అవసరమైతే కొన్ని పదాల సంగమం దగ్గర నోట్స్ కాస్త మార్చుకుని మరీ అర్థం చెడకుండా పాడాలనేది తన మాటల సారాంశం… నిజం… తెలుగు రాని గాయకులతో, సంగీత దర్శకులతో వస్తుంది చిక్కు… ఒరిజినల్‌గా సఖి మూవీలో ఈ పాట పాడింది హరిణి, కల్పన, కల్యాణి మేనన్… మంచి సింగర్స్, ఉచ్ఛరణ కూడా స్పష్టంగా ఉండటానికి సాధన చేస్తారు… సంగీతం రెహమాన్… తెలుగు పెద్దగా తెలియదు… దర్శకుడు మణిరత్నానికీ తెలియదు…
సో, పాటలో శృతులకన్నా భావం చెడకుండా, పదాల్ని పలకడం కూడా ప్రధానమే… భావవ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి… అబ్బే, సినిమా పాటలకు ఇవన్నీ ఎందుకండీ, ఢమ్ ఢమ్ అని నాలుగు సంగీత పరికరాలు ఎడాపెడా మోగించి స్పీకర్లు పగులకొట్టేస్తే సరి అంటారా..? కాదు, కొన్ని పాటలు డిఫరెంట్… అందులో అలై పొంగెరా వంటివి చాలా డిఫరెంట్… ఈ సినిమా మాతృక తమిళంలో ‘అలై పాయిదె’… తెలుగులో అలై పొంగెరా… తెలుగులో సినిమాను సఖి పేరుతో రిలీజ్ చేశారు… ఓసారి ఆ లిరిక్ చూడండి…
Ads
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
ఆలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానస మలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమునది
అలై కన్నా..
నిలబడి వింటూనే చిత్తరువైనాను – నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొర – ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా ఆ ఆ ఆ
కన్నుల వెన్నెల పట్టపగలు పాల్చిలుకుగా – కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నెమోమున కనుబొమ్మలటు పొంగే – కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే – కన్నెవయసు కళలోలికే వేళలో
కన్నెసొగసు ఒక విధమై ఒరిగేలే – అనంతమనాది వసంతపదాల
సరాగ సరాల స్వరానివా – నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా!
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన – వరించి కౌగిళ్ళు బిగించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన – వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కథాకళి కళలిడు – శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు – రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలే ఆవేదననో – ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదననో – ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో – ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో – ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా // అలై పొంగెరా //
అలై… అంటే అల వలె… అలగా కాదు, ఆ పదానికి వేరే అర్థం వస్తుంది… ఈ పాట పాడే ప్రతి గాయని మానస మలై పొంగెరా అని పాడుతుంది… స్వరజ్ఞానం, గాత్రశుద్ధి ఉన్న మన నిత్యసంతోషిణి కూడా అలాగే పాడింది… నిజానికి అది మానసం అలై పొంగెరా… ట్యూన్లు, నోట్స్ గొడవలో రెండూ కలిపేసి, మలై చేసేశారు… తమిళంలో మలై అంటే పర్వతం… తిరుమలలో తిరు అంటే శ్రీ… మల, మలై అంటే పర్వతం… మనం తెలుగులో ఈమధ్య అద్రి అని పుణ్యపర్వతాల పేర్లు మార్చుకుంటున్నాం కదా… భద్రాద్రి, యాదాద్రి ఎట్సెట్రా…
యవ్వనమలై పొంగెరా కూడా అంతే… యవ్వనం అలై… పాల్చిలుకగాఅనే పదమూ అంతే … పాలు చిలుకగా… అలాగే కాదిలి, గాదిలి… అనంతమనాది… అనంతం అనాది… శకుంతమరందమెడారి… మరందం ఎడారి… దాదాపు అందరూ మనాది, మెడారి అనే పలుకుతున్నారు… తలిరుటాకులకు బదులు తీరుటాకులకు అని పాడుతున్నారు… ఆ పదాలేమిటో తెలియవు, వాటి అర్థాలేమిటో తెలియవు, ఇక భావమెలా పలికిస్తారు..? అఫ్ కోర్స్, తెలుగు తెలిసిన గాయకులే తప్పులు పాడగా లేనిది, తెలుగు తెలియని గాయనులను ఏమంటాం..? అనేకానేక పాటల్లో ఇలాంటివే బోలెడు… మనాదులు, మెడారులు…!! మలై గుట్టలు..!!!
Share this Article