.
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీశ్రీ చాలా బాధ పడితే… అది తెలుగు కవితలో తాజ్ మహల్ ను మించి నిలిచి, వెలిగే కవిత అయ్యింది.
“మొగలాయి రాజు తెలి కన్నుల రాల్చిన బాష్ప ధారలే పొదలి ఘనీభవించినవి ముంతాజు మహాలు పోలికన్…” షాజహాను కన్నీరు ఘనీభవిస్తే తాజ్ మహల్ అయ్యిందన్నాడు జాషువా.
Ads
ఆగ్రాలో యమున ఒడ్డున ప్రత్యక్షంగా చూసిన తాజ్ మహల్ కంటే… గుర్రం జాషువా పద్యకావ్యంలో నిర్మించిన తాజ్ మహల్ అద్భుతంగా ఉంటుంది. కావ్యమంతా అమృత రసధార. మన సందర్భానికి తగిన భాగం మాత్రమే తీసుకుందాం.
మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1592-1666)కు భార్య ముంతాజ్ అంటే అమిత ప్రేమ. ఆమె పద్నాలుగో బిడ్డను కంటూ… 30గంటల ప్రసవవేదనతో కన్ను మూస్తుంది (1631లో). ఆమె అకాలమరణాన్ని షాజహాన్ తట్టుకోలేకపోతాడు. ప్రపంచంలో ఇప్పటివరకూ భార్యపేరుతో ఎవరూ నిర్మించని స్మృతి మందిరాన్ని నిర్మించి ముంతాజ్ పేరు శాశ్వతంగా గుర్తుండేలా చేయాలనుకుంటాడు.
అప్పటికి ప్రపంచంలో పేరున్న భవననిర్మాణ నిపుణుడు ఉస్తాద్ అహ్మద్ లాహోరికి ఆ బాధ్యతను అప్పగించాడు. 1631లో ప్రారంభమైన తాజ్ మహల్ పనులు 1648లో ఒక రూపానికి వచ్చాయి. 1653కు షాజహాన్ కలగన్నట్లు పూర్తయ్యింది.
1658లో షాజహాన్ ను కొడుకు ఔరంగజేబు బంధించి… ఆగ్రా కోటలోని చెరసాలలో ఉంచి… రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. చెరసాల కిటికిలో నుండి రాత్రీపగలు తాజ్ మహల్ ను చూసుకుంటూ 1666లో షాజహాన్ కన్నుమూశాడు. అదే తాజ్ మహల్లో తల్లి ముంతాజ్ సమాధి పక్కనే తండ్రి షాజహాన్ శవాన్ని పూడ్చి… సమాధి కట్టించాడు ఔరంగజేబు.
ఆరోజుల్లో తాజ్ మహల్ నిర్మాణానికి అయిన ఖర్చు యాభై లక్షల రూపాయలు. ఇప్పటి విలువతో పోలిస్తే అది దాదాపు 700 కోట్ల రూపాయలు.
అలాంటి తాజ్ మహల్ నిర్మాణం ఎలా జరిగిందో జాషువా కళ్ళతో చూస్తే-
“గ్రీకు శిల్పులు మొదలు ప్రపంచంలో పేరున్న నిపుణులను పిలిపించాడు షాజహాన్. భవన ప్రణాళిక మీదే చాలా చర్చ జరిగింది. అద్దాలకంటే తళతళలాడే రాళ్ళతో నిర్మాణం జరగాలన్నాడు. ప్రకృతికి ప్రతిబింబంగా రాళ్ళలో లతలు తీగసాగేలా; పూలు రేకులు విచ్చి పలుకరించేలా; గులాబీల మృదుత్వం హొయలుపోయేలా; గోడల్లో రంగులు నాట్యం చేసేలా శిల్పులు తాజ్ మహల్ ను తీర్చిదిద్దారు.
చేయి తిరిగిన కవి కలంలో శబ్దంలా శిల్పి ఉలిలో దిద్దుకున్న తాజ్ మహల్ అందం మాట్లాడుతుంది. తాకితే కందిపోయే లావణ్యంతో రాళ్ళ సౌకుమార్యం రాగాలు పాడింది. తాజ్ మహల్ అణవణువునా ముంతాజ్ ను చూసుకుంటూ పొంగిపోయాడు షాజహాన్. చివరకు ముంతాజ్ చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
రాణి విడిచిపోయె రాజునొంటరి చేసి
రాజు విడిచిపోయె రాజ్యరమను
రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర
తాజి విడువలేదు రాజసంబు”
తాజ్ మహల్ నిర్మాణంలో తెలుగు శిల్పులు కూడా పనిచేశారని కొందరు అంటారు. కానీ స్పష్టమైన ఆధారాల్లేవు. తాజాగా తాజ్ మహల్ నిర్మాణంలో మన తెలంగాణ దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల పారదర్శకమైన స్ఫటిక రాతిని వాడినట్లు రుజువయ్యింది.
మ్యూరల్ వర్క్ లాగా పైకి పొడుచుకుని వచ్చినట్లు రాతిలో చిత్రాలను చెక్కడం కొంత సులభం. పాలరాతిని అచ్చంగా అలాగే వాడకుండా అందులో డిజైన్లను చెక్కడం తాజ్ మహల్ నిర్మాణంలో ప్రత్యేకత. టర్కీ ఇస్తాంబుల్ బ్లూ మాస్క్ లాంటి చాలా చోట్ల అప్పటికే ఈ ఇస్లామిక్ నిర్మాణ శైలి బాగా పేరు పొందింది.
డిజైన్ ప్రకారం తెల్ల పాలరాతిని తొలచాలి. తొలిచిన మేర రంగు రంగుల రాళ్లను చెక్కి అందులో కూర్చాలి. చేత్తో తాకితే ఎత్తుపల్లాలు లేకుండా ఒకే బల్లపరుపు రాయిలా, గోడమీద గీసిన రంగుల చిత్రంలా ఉండాలి. బట్టమీద డిజైన్ చేత్తో నేయడమే కష్టమనుకుంటే ఇది అంతకంటే కష్టమైన విద్య.
మిల్లీమీటర్ తేడా ఉన్నా రంగురాయి తెల్లరాతిలో ఒదగదు. ఆకుపచ్చ, పసుపు, నీలం, ఎరుపు ఇలా ఒక్కో రంగుకు ఒక్కో రాతిని ఒక్కో ప్రాంతం నుండి ఎంపిక చేసి తెప్పించారు.
సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, వెన్నెల రాత్రుల్లో ఏ రాయి ఎలా కనిపిస్తుందో, సూర్యచంద్ర కాంతులకు ఏ రాయి ఎలా కాంతిని వెదజల్లుతుందో లెక్కగట్టి ఆ ప్రకారమే ఎంపిక చేసిన రాతిని వాడారు. అందులో ఒకానొక పారదర్శకంగా ఉండే స్ఫటిక రాయి తెలంగాణ దేవరకొండ, మహబూబ్ నగర్ నుండి తెప్పించినవని నిపుణులు ఇన్నాళ్ళకు తేల్చారు.
సులభంగా అర్థం కావడానికి గాజులా ఉన్న రాయి అనుకోవచ్చు. ఇలాంటి పారదర్శకంగా ఉన్న రాతిమీద ముదురు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి తాజ్ మహల్లో గోడలకు ఎక్కువగా వాడారని నిపుణుల విశ్లేషణ.
ఈసారి తాజ్ మహల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు గోడలను తాకి చూడండి… దేవరకొండ గాజురాతి రాగాలో, మహబూబ్ నగర్ మట్టి పాటలో వినిపించకపోవు.
జాషువా మాటను కొనసాగిస్తూ…
“తాజి విడువలేదు దేవరకొండ రాజసంబు;
తాజి విడువబోదు తెలంగాణ మట్టి బంధంబు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article