.
ఓ మిత్రుడి పోస్టు… ‘‘ మనకు భాషాభిమానం, సిగ్గు రెండూ లేవని గుర్తించి… తమిళ టైటిల్స్ అలాగే తెలుగులో పెడుతున్నా సరే… వాటిని ఎగబడి కొని మరీ మనపై రుద్దుతున్న డబ్బింగ్ నిర్మాతలందరికీ… దండాలురా బాబూ…
కరుప్పు, మార్గన్, తంగలాన్, అమరన్, తలైవి, వలిమై, కంగువ, తుడరుమ్, పొన్నియిన్ సెల్వన్….. పెట్టుకుంటూ పోండి… ఆపేదెవరు..? ఎగబడి మరీ సినిమాలు చూస్తాం, వందల కోట్లు మీకే తగలేస్తాం…’’
Ads
నిజమే… మనది మరీ విశాల హృదయం… ఏమో, ఎక్కువ భారీ విశాలమైందేమో… వాడు మన తెలుగును అక్కడి స్కూళ్ల నుంచి తీసేస్తాడు… మన సినిమాలను దేకడు… మన హీరోలు ఆనరు… వాడి భాష తప్ప మన భాష పలకడు… మన సినిమాల్ని డబ్ చేస్తే తప్పకుండా వాడి భాషలో పేర్లు పెట్టాల్సిందే… రకరకాలుగా వ్యక్తం అవుతూనే ఉంటుంది…
కర్నాటకలో కన్నడం, మహారాష్ట్రలో మరాఠీ భాషల మీద కూడా సేమ్ ఇలాంటి దురభిమానమే ప్రబలుతోంది… వాళ్ల భాష నేర్చుకోకపోతే, మాట్లాడకపోతే దెబ్బలు పడుతున్నయ్ కూడా… మనం మరీ అంత సంకుచితంగా అస్సలు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కానీ… కనీసం మన మీదకు వాడి సినిమాల్ని వదులుతున్నప్పుడు, ఆ టైటిల్స్ ఏమిటో అర్థం కావాలి కదా, మన భాషలో ఉండాలి కదా…
నో, తమిళ పేర్లను యథాతథంగా పెట్టేసి వదులుతున్నారు… ఏమో, తమ తమిళ టైటిళ్లకు సరిపోయే టైటిళ్లను తెలుగులో వెతకడం, ఆల్రెడీ ఆ టైటిళ్లతో గతంలో తెలుగు సినిమాలు ఉన్నా, రిజిష్టర్ అయి ఉన్నా అదో తలనొప్పి కావచ్చు బహుశా… అందుకే ఆ తమిళ టైటిళ్లనే యథాతథంగా వదులుతున్నారేమో…
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ నటించిన తలైవన్ తలైవి టైటిల్‌కు తెలుగులో ఏం పెట్టాలో తెలియక… సార్ మేడమ్ అని పెట్టేశారు, ఇది పర్లేదు… తాజాగా సూర్య నటించిన కరుప్పు సినిమాను అదే పేరుతో తెలుగులోనూ వస్తున్నట్టు ఓ ఫస్ట్ లుక్ రిలీజైంది… దాంతో ఈ తమిళ టైటిళ్లు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి…
ఓటీటీల్లో ఒరిజినల్ సినిమా టైటిళ్లు ఏ భాషలో ఉన్నా, వాటి తెలుగు ఆడియోలను యాడ్ చేస్తున్నా… పెద్ద ఫరక్ పడదేమో, కనీసం థియేటర్లలో రిలీజ్ చేసే డబ్బింగ్ వెర్షన్లకయినా తెలుగులో ఏడవాలి కదా…
పైన ఫోటోలో చూడండి, కరుప్పు అనే పదాన్ని తెలుగులో కూడా సరిగ్గా రాయలేకపోయారు… ఇంతకీ కరుప్పు అంటే ఏమిటంటే..? నలుపు… ఆహా, తెలుగు వెర్షన్‌కు అదే టైటిల్ పెడితే సరిపోయేది కదా… ప్చ్, బాలేదోయ్ సూర్యా..!!
Share this Article