పాన్ ఇండియా సినిమాలు హిందీ వ్యతిరేక సెంటిమెంట్‌ను మళ్లీ రాజేస్తున్నాయి… కన్నడ నటుడు సుదీప్ చేసిన పిచ్చి వ్యాఖ్యలు, అంతకుమించి అజయ్ దేవగణ్ చేసిన తలతిక్క వ్యాఖ్యలు మళ్లీ హిందీ వివాదాన్ని రేపుతున్నాయి… ఇంకా… నిజానికి ఒక జాతి మీద మరో భాషను రుద్దే ప్రయత్నాలు అనేక విపరిణామాలకు దారితీస్తాయి… బుర్రతిరుగుడు వ్యాధి బలంగా ఉండే సినిమా నటులకు ఇది అర్థం కాదు… మంట రాజేస్తారు తమకు తెలియకుండానే…
ఒక జాతికి తమ భాష, ఆహారం, ఆహార్యం, సంస్కృతి ప్రధానం… తమిళనాడు వంటి ప్యూర్ హిందీ వ్యతిరేక ప్రాంతాల్లో ఓపట్టాన ఇవి ఆరిపోవు… మొదటి నుంచీ హిందీని తమపై రుద్దడాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న ప్రాంతం అది… అసలు ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా భాషను రుద్దే ప్రయత్నాలు హింసకు, రక్తపాతానికీ, చివరకు రాజ్యాలు చీలిపోవడానికి కారణాలు… సుదీప్, అజయ్ వంటి దేడ్ దిమాక్ స్టార్లకు అది సమజ్ కాదు…
తాజాగా తమిళనాడు విద్యామంత్రి ఓ వ్యాఖ్య చేశాడు… ‘‘హిందీ మాట్లాడేవాళ్లు కోయంబత్తూరులో పానీపూరీ అమ్ముతుంటారు’’ అని… మా అన్నాదురై చెప్పాడు, జస్ట్, టూ లాంగ్వేజెస్… ఒకటి తమిళం, రెండు ఇంగ్లిషు… ఇంగ్లిషు అంతర్జాతీయ భాష… ఇక మూడో భాష మాకు అప్రధానం… మాపై రుద్దుతామంటే ఊరుకోం అనేది తన ఉద్దేశం…
Ads
ఆ వ్యాఖ్య విన్నాక అప్పట్లో కేసీయార్ చేసే వ్యాఖ్యలు గుర్తొచ్చాయి… ఎవరినో ఉద్దేశించి, బహుశా చంద్రబాబు గురించే కావచ్చు… ‘‘వచ్చి హైదరాబాదులో కర్రీ పాయింట్ పెట్టుకొమ్మనండి, వద్దంటామా..?’’…. అది భాష గురించే కాకపోవచ్చు… కానీ సెంటిమెంట్ రగల్చడానికి భాష, ఉపాధి అన్నీ పాయింట్లే కదా… హైదరాబాదులో పొట్టపోసుకునే వేలాది మందిని హర్ట్ చేశాయి అవి… (అఫ్ కోర్స్, ఇప్పుడు తనకు వాళ్లే ఆత్మబంధువులు… రాజకీయాల్లో అన్నీ చల్తా…)
తమిళనాడు విద్యామంత్రి అల్లాటప్పాగా చేసిన వ్యాఖ్యలేమీ కావు అవి… మళ్లీ ఒకవేళ హిందీని రుద్దితే బాగుండదు సుమా అనే ఓ హెచ్చరిక… అసలే డీఎంకే హిందీ వ్యతిరేకత బలంగా నరాల్లోకి ఇంకిన పార్టీ… నిజానికి బీజేపీ నేతలకు, డీఎంకే నేతలకు హిందీకి, హిందూకు తేడా తెలియదు… హిందీ వ్యతిరేకతను యాంటీ-హిందుత్వ అనుకునే భ్రమ డీఎంకే పార్టీది… బీజేపీ కావాలని హిందీ రూపంలో హిందుత్వాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుందనేది దాని భావన…
భాష వేరు, మతం వేరు… హిందీకి, హిందుత్వకూ లింకే లేదు… కానీ నార్తరన్ ఇండియా ఎప్పుడూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది… సౌత్ ఇండియా దాన్ని తిప్పికొడుతూనే ఉంటుంది… కాస్త అగ్గి కనిపిస్తే చాలు మండిపోవడానికి తమిళనాడు సిద్ధంగా ఉంటుంది… జాతీయ భాషగా హిందీ అనే భావనను జాతీయతగా చిత్రీకరించే భ్రమ, మూర్ఖత్వం బీజేపీది… అది మారదు… సౌత్ ఇండియా స్టేట్స్ బీజేపీ నాయకులకు అర్థం కాదు…
అందరినీ కలుపుకునిపోవడం, భాషలకు అతీతంగా ఏకతాభావనను దేశవ్యాప్తం చేయడం అనేదే ప్రస్తుత ఆచరణీయ మార్గమని బీజేపీ గుర్తించదు… గుర్తించేవాళ్లను పార్టీలో ఉండనివ్వదు… అసలు ఓ జాతీయ భాష అవసరమా..? ప్రపంచంతో అందరినీ కలిపే ఇంగ్లిష్ ఉండగా హిందీ అవసరం ఏమిటీ అనే మథనం, సమీక్ష ఆ పార్టీలో కనిపించదు, అదేమిటో మరి… దశాబ్దాలుగా ప్రతిఘటన ఎదురవుతున్నా సరే, నార్తరన్ లీడర్‌షిప్ మారదు… మారడం లేదు… !!
Share this Article