ఇలా అడిగేవాడు ఒక్కడైనా అవసరం ఇండస్ట్రీలో..! ఆత్మవంచన, హిపోక్రసీ, అబద్దాలు, భజన, పాదసేవలు తప్ప ఇంకేమీ తెలియని సినీ పరిశ్రమలో తమ్మారెడ్డి భరధ్వాజలాగా పదునైన, సహేతుకమైన విమర్శ చేసేవాడు అవసరం… తాజాగా ఏదో ఇంటర్వ్యూలో కార్తికేయ హీరో నిఖిల్‌ను, దానికి అడ్డుపడబోయి అడ్డంగా బదనాం అయిపోయిన దిల్‌రాజును తమ్మారెడ్డి నిలబెట్టి కడిగేశాడు… నిఖిల్, దిల్‌రాజు డబుల్ స్టాండర్డ్స్‌ను ఏకిపడేశాడు…
కార్తికేయ-2 సినిమా విడుదలకు దిల్‌రాజు రకరకాలుగా అడ్డుపడ్డాడనేది ఫిలిమ్ సర్కిళ్లలో బహిరంగ రహస్యం… అంతెందుకు ఇదే నిఖిల్ మీడియా ముందు ఏడ్చినంత పనిచేశాడు కదా… నాకు థియేటర్లు ఇవ్వడం లేదన్నాడు కదా… దిల్‌రాజు ఇంటికెళ్లి బాబ్బాబు, థియేటర్లు ప్లీజ్ అని అడుక్కున్నాడు కదా… థియేటర్ల సిండికేట్, తెలుగు సినిమా అనేది దిల్‌రాజు ఇనుపకౌగిలిలో బంధింపబడి ఉందనే సంగతి అందరికీ తెలిసిందే కదా… మళ్లీ ఇదే దిల్‌రాజు కార్తికేయ సక్సెస్‌మీట్‌కు విశిష్ట అతిథి అయ్యాడు… అదీ ఇండస్ట్రీ నేలబారుతనం…
ఎహె, నేనెక్కడ అడ్డుపడ్డాను, మీడియా ఇష్టమొచ్చింది రాసుకుంది, ఏం రాసుకుంటారో రాసుకొండి అని దిల్‌రాజు నోటికొచ్చినట్టు మీడియాను నిందించి, తను ఓ ధర్మాత్ముడిలా, సత్యవర్తనుడిలా ఫోజు పెట్టాడు… తన వెనుక నిలబడిన ఇదే నిఖిల్ ముసిముసినవ్వులు నవ్వుతూ కనిపించాడు… వాళ్లూ వాళ్లూ బాగానే ఉన్నారు… మాఫియా లీడర్ వోకే, విక్టిమ్ వోకే… నడుమ వీళ్లకు మీడియా వాళ్లు హౌలాగాళ్లయిపోయారా..?
Ads
‘‘అసలు నువ్వు దిల్‌రాజు ఇంటికి వెళ్లి ఎందుకు అడుక్కున్నవ్..? నువ్వు హీరోవు, నీకెందుకు ఏడుపు..? సరే, అడుక్కున్నవ్, మరి మళ్లీ దిల్‌రాజు శుద్దపూస అన్నట్టు మాట్లాడతావేం ఇప్పుడు..? తన తప్పేమీ లేదన్నట్టు వ్యవహరిస్తావేం..?’’ అని అడిగాడు తమ్మారెడ్డి… ‘‘సినిమా హిట్ అయ్యింది కాబట్టి కాలర్ ఎగరేయకు, ముందు ఒకమాట, తరువాత ఒకమాట కాదు, మాటమీద నిలబడటం నేర్చుకోవాలి… లైగర్ సినిమాలా ఈ సినిమా చీదేసి ఉంటే అప్పుడు ఏమనేవాడివి..?’’ అని నిఖిల్‌ను నిలదీశాడు… నిజం, నిఖిల్ అత్యంత అవకాశవాదం ప్రదర్శిస్తున్నాడు…
‘‘ఎవరూ దేశాన్ని ఉద్దరించేందుకు సినిమాలు తీయరు, డబ్బు కోసమే తీస్తారు… మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, తరువాత అబ్బే, అలాంటి వివాదమేమీ లేదని బొంకడం వంటి డ్రామాలు ఎందుకు..? ఇప్పుడు హిట్ వచ్చింది కదాని ఎగిరెగిరి పడితే, తరువాత కిందపడిపోతారు…’’ అంటాడాయన… కాకపోతే ఆయన కాస్త సరళంగా చెప్పడు, ఈడ్చి ముక్కుమీద గుద్దినట్టుగా ఉంటుంది తను వాడే భాష… కానీ చెప్పేవి నిజాలే… ఇలా బురదపూసిన కొరడాలు పట్టుకున్న పదిమంది తోడయితే… మాఫియా రాజులు కాస్త అదుపులో ఉంటారేమో… లేకపోతే నిఖిల్స్‌తో కాళ్లు పట్టించుకుని కాలర్లు ఎగరేస్తారు..!!
Share this Article