Bharadwaja Rangavajhala……… నిజమైన ఆవకాయ సౌభాగ్యం కోనసీమలోనే చూడాలి . అందరికీ చిన్నా పెద్దా మామిడితోటలుంటాయి. ప్రతి తోటలోనూ ఆవకాయ చెట్టని ఒకటి విధిగా ఉంటుంది. వంశపారంపర్యంగా తాత, ఆయన తాత యెంచి దాని యోగ్యత నిర్ణయించి చప్పరించి మరీ వేసిన చెట్టది. ఆవకాయ చెట్టు అహంకారం ఎలాంటిది అంటే … ప్రతి పొరుగుచెట్టూ రెండో పక్షమే.
పదిహేను రోజుల పాటు ప్రతి పెరడూ ఒక ఆవకాయ ఖార్ఖానా. ఉదయం పదిగంటల నుంచీ సాయంత్రం ఐదు గంటల వరకూ రోకటి దెబ్బలతో ఆకాశం శబ్దగుణకం అయిపోతుంది. వాతావరణం అంతా ఖారం. ఇంటినిండా తుమ్ములు.
హైస్కూల్లో ఉద్యోగం చేసే రోజుల్లో ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు. స్కూల్లో ఉన్నంత సేపూ పగడైన తలపాగా , నిండుబొత్తాల అల్ఫాగ కోటూ , దానిపై రెండు వైపులకూ జార్చిన జరీ కండువా , స్కూలు రౌండ్స్ కు వెళ్లే ధీరోదాత్తగమనం , చూస్తే దగ్గరకు వెళ్లడానికే భయంగా ఉండేది. అట్టి విద్యాధికారి ఆవకాయ రోజుల్లో పరమ శ్రోత్రీయంగా మారి, తెల్లవారు జామున నాలుగు గంటలకు లేచి, పైన ఒక తువాలు , కింద ఓ పెద్ద అంగోస్త్రం ధరించి, ఇంటికి వచ్చి, శాస్త్రిగారూ పదండి అంటే ఎక్కడికి? అని అడగకూడదు. ఎక్కడికో విశదమే. మైలు దూరంలో కాలవ అవతల ఒక చెట్టు ఆవకాయకు ప్రశస్తమని ఎవరో చెప్పారు. అడ్డమైన చెట్టు ఆవకాయకు పనికిరాదని శాస్త్రం.
Ads
చెట్టు బాగా ముదరుది. శాఖోపశాఖలుగా విస్తరించి ఆముక్తమాల్యదలో వటవృక్షంలా ఉంది. భేష్ అనుకున్నారు మా మాస్టారుగారు. చెట్టు కాపలా మనిషిని లేవగొట్టారు. వంద ఇంతకని తెగ్గొట్టారు. ఒక్క రూపాయి పెచ్చు తగిలించేటప్పటికి అతడు చెంగున చెట్టుమీదున్నాడు. పదిహేనేళ్ల కొడుకు గట్టి చిక్కం కట్టిన వెదురుగడ తండ్రికి అందించాడు.
కాయలు కోసి చిక్కంలో వేయాలి. వేసినవి ఒక్కోటీ కింద పడకుండా అందుకున్న వాటిని చంటిపిల్లల్లా బుజ్జగించి బుట్టలో వేయాలి. నేల మీద కాయ పడిందా దాని పని గోవిందా … దూరంగా పడేయాలి. కాయలు కోసి చిక్కెంలో నుంచీ ఒక కాయ తీసి అహ్ ఏమి జాతండీ ఇలా ఉండాలి. ఆవకాయ అంటే … చర్మం తెల్లగా ఉండాలి. ముచిక దగ్గర రవ్వంత పరువు కనిపించాలి. పీచుకు పీచూ పులుపుకు పులుపూ మొలిచినట్టుండాలి. ఈ కాయ చూడండి అని ఒక బద్ద చీల్చి నా చేతిలో పెట్టారు. ముక్క నోట్లో వేసుకుంటే నషాళం అంటింది.
పులుపు, నేను పులుపు తినలేను. బంగినపల్లి ఆవకాయ తినే రకం. నా ముఖంలో మెప్పు కనబడకపోతే రెండు ఇంక్రిమెంట్లు పోతాయన్నంత భయం. కనుబొమ్మలెగరేసి కళ్లు పెద్దవి చేసి సాధ్యమైనంత మెప్పు నటించాను. ఇంకో ముక్క నోట్లో వేసుకున్న మేస్టారు అర్ధనిమీలిత నేత్రులై నా మెప్పు స్వీకరించలేదు.
ఎడ్యుకేషన్ లెవెల్స్ పడిపోతున్నట్టుగానే ఆవకాయ స్థాయి పడిపోతూన్నందుకు చాలా విచారించారు లోలోపల. స్కూలు టైమ్ జ్ఞాపకం చేసి మేష్టార్ని ఆవకాయ తన్మయత్వం నుంచీ విడదీసి గృహోన్ముఖులను చేశాను. ఒకసారి కొత్తావకాయ రోజుల్లో పనిమీద రాజమండ్రి వెళ్లి సుబ్రహ్మణ్యశాస్త్రి గారింట్లో మకాం చేశాను.
రాత్రి శాస్త్రిగారితో పరమాప్యాయంగా భోజనం, పిన్నిగారు వారం రోజుల కిందట వేసి బాగా ఊరిన ఆవకాయ తదితర జాతి ఉపజాతులు వేరు వేరు వరసనా వడ్డించి రుచి చూడమన్నారు. అక్కడ ఆడవారికి ఎవరెన్ని రకాలు పెడితే అంత ఘనత. అవి ఆప్తులు తిని మెచ్చుకుంటే కృతార్ధత. కొత్తావకాయ సింధూర తిలకంలా, శివుడి మూడో కన్నులా, జాజ్వలమానంగా ఉంది. దానితో ఒక పెద్ద వాయి కానిచ్చి, తక్కిన వివిధ భారతి తగు మాత్రంగా సంభావించి భోజనం ముగించాను.
భోజనానంతరం శాస్త్రిగారూ నేనూ సాహిత్యం కథలు కబుర్లలో పడ్డాం. పది గంటలయ్యింది. కన్ను పొడుచుకున్నా నిద్ర రావడం లేదు. కళ్లు మండుతున్నాయి. శాస్త్రిగారు కనిపెట్టారు. ఆవకాయ వేడి నిద్ర పట్టదు. ఉండండి అని ద్రాక్షారిష్టం సీసా తీసి రెండు ఔన్సులు నీళ్లలో కలిపి పుచ్చుకోండి … అన్నారు. చిరుఘాటుగా తియ్యగా గొంతులో దిగింది. ఆవకాయ జోరు తగ్గి నిద్ర పట్టేసింది……….. – హనుమదింద్రగంటి.
Share this Article