సరిగ్గా వండుకోవాలే గానీ… ఫ్రైడ్ రైస్ ఏ బిర్యానీకి తీసిపోదు… కాకపోతే కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి… ఆల్ రెడీ మిగిలిపోయిన అన్నమే కాదు, మనకు ఓపిక ఉంటే అప్పటికప్పుడు అన్నం వండి మరీ ఫ్రై చేసుకోవచ్చు… అయితే చాలామందికి ఓ విసుగు… ప్రతి వంటకూ… అదే నూనె, అందులో ఆవాలు, చిటపట, కాస్త జిలకర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు ఎండు మిర్చి ముక్కలు, కాస్త ఇంగువ, సరిపోనట్టుగా టమాటలు… ఎంతసేపూ ఇదే పోపు, ఇదే రీతి… ఇదే టేస్టు… కొత్తగా ఏమీ లేదా..?
ఎందుకు లేదు..? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు… కాకపోతే మనకు ఎవరైనా చెబితే దాని ప్రకారం చేసుకోవాలి… లేదంటే దిక్కులేక యూట్యూబ్ దిక్కు చూడాలి… ఇక్కడే జాగ్రత్త… ఏ యూట్యూబ్ వీడియో చూసినా సరే, నానా పెంటా అందులో వేసి చేసుకొమ్మంటారు… చివరకు మనం ఏం వండామో, ఏం తింటున్నామో మనకే అర్థం కాదు… కడుపుకు కూడా ప్రమాదం…
సరే, మనం ఫ్రైడ్ రైస్ వితవుట్ ఆవాలు, వితవుట్ అల్లం, వితవుట్ జిలకర, వితవుట్ పోపు, వితవుట్ పోపు అనుకున్నాం కదా… ఓ పనిచేయండి… దిగువన ఓ వీడియో ఉంది… కాస్త బాగానే చెప్పాడు ఓ కొత్త డిష్ గురించి… కాకపోతే అందులో బ్రకోలీ ఎట్సెట్రా చెప్పాడు, చాలా సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే… దాన్ని స్కిప్ చేసేస్తామన్నమాట…
Ads
మరి మనం ఎలా చేసుకోవచ్చు… కొత్తగా అన్నం వండి, ఈ ఫ్రైడ్ రైస్ చేసుకునే పక్షంలో బాస్మతి లేదా లాంగ్ గ్రెయిన్ (పొడుగు గింజ) బియ్యం తీసుకొండి, కాస్త ఉప్పు వేసి వండేసుకుని, పక్కన పెట్టేసుకొండి… కానీ మెత్తగా కాదు, కాస్త పలుకు పలుకు ఉండాలి… అంటే ఓ 80 శాతం వరకూ ఉడికితే చాలు…
ఒక ఓ ప్యాన్‌లో కాస్త నూనె వేసి… ఇది తప్పదు లెండి… ఆ నూనెలో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని, కలర్ మారేదాకా వేగనివ్వండి… మరీ ఈ వీడియోలో చూపినట్టు దాన్ని కొంత పక్కకు తీసి, చివరలో ఫ్రైడ్ రైస్ మీద చల్లడం వేస్ట్… కొందరికి ఆ టేస్ట్ పడదు… మరీ కచ్చాపచ్చా వెల్లుల్లి తిన్నట్టు ఫీలవుతారు…
సో, ఆ నూనెలో ఎంచక్కా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న క్యారట్, బీన్స్, కాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేయండి… ఉంటే స్వీట్ కార్న్ కూడా కలపండి… మిరియాలపొడి కూడా యాడ్ చేయండి… (నిజానికి మన టేస్టుకు ఇది సరిపోదు… కాబట్టి సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు యాడ్ చేయాలి…) దీనికి ఉల్లిపరక (ఉల్లికాడలు, ఉల్లిఆకులు) ముక్కల్ని వేయండి… ఏ రకం ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సరే, ఉల్లిఆకులు సూపర్ టేస్ట్ ఇస్తాయి… ఇంకేముంది..? అయిపోయింది… అందులోకి ఆ అన్నం వేసి, కలుపుతూ, ఓసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరి… కళ్లకూ కలర్ కలర్‌గా కనిపిస్తుంది… ఆత్మారాముడికీ ఆనందం…
బిర్యానీలు అయితే మసాలాలు లేకపోతే ఆ టేస్టు రాదు, కొందరికి ఎక్కువ తక్కువ మసాలాలు పడవు… సో, ఇది బెస్ట్… పైగా వెల్లుల్లి ఆరోగ్యరీత్యా బహుళ ప్రయోజనకారి… ఇంకేం కావాలి..?!
Share this Article