ఆమె మహాత్మా గాంధీజీ మనవరాలు, మేం ఎన్నికల్లో ఓటు వేయం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది . అదేంటి, ఓట్లను బహిష్కరించాలి అనేది నక్సల్స్ నినాదం . మీరు గాంధేయ వాదులు అని చెబుతూ , మహాత్మా గాంధీజీ మనవరాలు అయినా సరే , తీవ్రవాదుల్లా ఓటును బహిష్కరించడం ఏమిటీ ? ఇదే అంటే … ఆమె చెప్పిన సమాధానం తటస్థులం అని …!
రాజకీయాల్లో తటస్థులు అనే దానిని ఓ జోక్ గా మార్చారు కానీ వాళ్ళు నిజమైన తటస్థులు . ఎన్టీఆర్ భవన్ లో ఒకసారి మహాత్మా గాంధీజీ మనవరాలు కలిశారు . మానవ విలువలు బోధించే విధంగా కృషి చేసే తమ సంస్థ విధానాల్ని అన్ని పార్టీల వారికి చెబుతూ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు . ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండడం తమ సంస్థ సభ్యులు పాటించాల్సిన నియమం . మేము తటస్థంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం , ఒక పార్టీకి ఓటు వేసిన తరువాత తటస్థులం అని చెప్పడం సరికాదు .. ఏ పార్టీకి ఓటు వేశామో మనం ఆ పార్టీని ఇష్టపడుతున్నట్టు లెక్క , ఓటు వేస్తే ఇక తటస్థులు ఎలా అవుతారు, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు .
ఆ తరువాత అదే ఎన్టీఆర్ భవన్ తటస్థులతో నిండిపోయింది .
1999 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన తటస్థ రాజకీయ ప్రయోగం రాజకీయాల్లో ఓ విచిత్ర ప్రయోగంగా మిగిలిపోయింది . ఒక పార్టీ తరపున గెలిచిన తరువాత తటస్థులు ఎలా అవుతారో ? గెలవడమే కాదు మంత్రివర్గంలో చేరిన తరువాత కూడా మేం తటస్థులం అని చెప్పుకునేవారు . ఈ 99 ప్రయోగం విఫలమైనట్టు 2004 లో కానీ టీడీపీ గుర్తించలేక పోయింది . తరువాత తటస్థులు ఎవరూ పార్టీలో మిగలలేదు .
Ads
95లో ఎన్టీఆర్ ను దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి బలమైన పథకాలు లేవు . పైగా టీడీపీకి రామబాణం లాంటి రెండు రూపాయలకు కిలో బియ్యం ధర రెట్టింపు చేశారు . సొంతంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేమి లేవు . హైటెక్ సిటీపై పూర్తిగా ఆధారపడలేరు . ఈ సమయంలో తటస్థ ప్రయోగానికి తెర లేపారు .
********
ఎన్టీఆర్ భవన్ లో అప్పుడు ఒక జాతరలా ఉండేది . పెద్ద సంఖ్యలో జనం వచ్చి మేం తటస్థులం అని చెప్పి పార్టీలో చేరేవారు . రిపోర్టర్లకు సైతం వారితో మాట్లాడడం ఓ కాలక్షేపంగా ఉండేది . అప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్న యాదగిరి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రిసెప్షనిస్ట్ గా బాధ్యతలు నిర్వహించేవారు . పెద్ద సంఖ్యలో వచ్సిన తటస్థులు రిసెప్షన్ లో ఉన్న యాదగిరి వద్ద సందర్శకుల బుక్ తీసుకోని అందులో వివరాలు , ఫోన్ నంబర్ , అడ్రెస్ రాసేవాళ్ళు . అలా రాసే వారి ఉద్దేశం పార్టీ నుంచి తమకు పిలుపు వస్తుంది , ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అని .. అలా రాసి వెళ్లిన వారికి పిలుపు వచ్చేది పార్టీ నుంచి కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి . టైమ్స్ మార్కెటింగ్ అతను రోజూ యాదగిరి వద్దకు వచ్చి అంతకు ముందు రోజు అడ్రెస్ లు రాసిన వారి వివరాలు నోట్ చేసుకొని , టైమ్స్ పత్రిక వేసుకోమని కోరే వారు . అలా రాసి వెళుతున్న వారికి ఇది తెలియదు కానీ రిపోర్టర్లుగా రోజూ అక్కడే ఉండి ఈ తతంగాన్ని చూసే వారికి ఇదో తమాషాగా ఉండేది .
తాజాగా రిటైర్ అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి, బ్రీఫ్ కేస్ తోనే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి .. నాకేదైనా పని అప్పగించండి అని ఉత్సాహపడ్డారు . అక్కడ తోటి తటస్థులు , జర్నలిస్ట్ లు కనిపించగానే అతనికి జ్ఞాన బోధ చేయాలి అనిపించింది . తప్పంతా నెహ్రూదే అన్నట్టుగా అందరికీ ఓటు హక్కు కల్పించడం వల్లనే దేశం ఇలా ఉంది . చదువుకున్న వారికి , ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే దేశం ఇలా ఉండదు అని అతను తేల్చేశాడు . అంతా విన్నాక అతనికో మాట చెప్పాను .. ఎన్టీఆర్ భవన్ ఎదురుగానే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటుంది . బాగా చదువుకున్న వాళ్ళు , సంపన్నులు , ఉన్నతాధికారులు అక్కడ వాకింగ్ చేస్తుంటారు . చేతిలో బ్రీఫ్ కేస్ తో ఇలానే ఆ పార్క్ వద్దకు వెళ్లి గుండెపోటు వచ్చినట్టుగా పడిపోండి . మీరు చెప్పిన ఉన్నత వ్యక్తులు మీకు ఏమైందో అని సహాయం చేయడానికి వస్తారా ? లేక అక్కడ ఉండే ఆటో డ్రైవర్లు , ఇతర చిన్న చిన్న వాళ్ళు వస్తారో చూడండి అని సలహా ఇచ్చాను .
****
1999 ఎన్నికల్లో తటస్థ కోటలో పలువురికి టికెట్లు ఇచ్చారు . తటస్థ కోటాలో విజయరామారావు , శనక్కాయల అరుణ , లక్ష్మి పద్మావతిలకు బాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు . డిజిపిగా , సిబిఐ డైరెక్టెర్ గా మంచి ప్రతిభ చూపారు అని చెప్పి విజయరామారావును హోం మంత్రిని చేస్తారు అని అంతా అనుకుంటే రోడ్లు భవనాలు అప్పగించారు . తటస్థులు మంత్రివర్గంలో ఉన్నా , పార్టీతో మాకేం సంబంధం , మేం తటస్థులం అని చెప్పే వాళ్ళు . అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లాల్ జాన్ బాషా పార్టీలో ప్రముఖునిగా ఉండేవారు . ఓ మంత్రికి ఫోన్ చేస్తే పార్టీతో నాకు సంబంధం లేదు అని బదులిచ్చారు . తటస్థ నాయకులు ఉన్న చోట పార్టీ శ్రేణులు నిర్వీర్యం అయ్యారు . తటస్థ కోటాలో విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కెసిఆర్ కు ఇస్తే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు టీడీపీ నాయకుల వాదన .. ఐతే తటస్థుల ప్రయోగాన్ని కన్నా చాలా ముందుగానే తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరిగాయి .
*******
తటస్థుల ప్రయోగం టీడీపీలానే బిజెపి కూడా చేసింది . 2004 ఎన్నికలకు ముందు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వైస్ రాయ్ హోటల్ లో కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించి బీజేపీని గెలిపించాలి అని కోరారు . ఐతే ఇది పార్టీ సమావేశం కాదు బీజేపీని అభిమానించే తటస్థుల సమావేశం అని ప్రకటించారు . టీడీపీకి ఇప్పటికీ స్వదేశంలో , విదేశంలో తటస్థ మద్దతుదారులు ఉన్నారు . స్వల్ప సంఖ్యలోనే కావచ్చు వీరిని చూసి ఇతర పార్టీల వారూ మేము తటస్థులం అని చెప్పుకుంటారు . ఇప్పడు బీజేపీకి కూడా తటస్థ మద్దతుదారులు బాగానే ఉన్నారు .
ఒక్క తెలంగాణ ఉద్యమంలో మాత్రమే అన్ని పార్టీల వాళ్ళు , ఏ పార్టీకి చెందని వారు . లెఫ్ట్ , రైట్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు . గుడిలో పూజలు చేసే పూజారులు సైతం… – బుద్దా మురళి
Share this Article