రాజ్యానికి వ్యతిరేకంగా, శ్రామికజనం గొంతుకగా ఏళ్ల తరబడీ పనిచేసిన గద్దర్‌కు అదే రాజ్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మీద చర్చ సాగుతూనే ఉంది… బుల్లెట్‌నే నమ్మి, బ్యాలెట్‌ను ధిక్కరించిన గళం చివరకు తనే ఓ సొంత పార్టీ పెట్టిన తీరు మీద చాన్నాళ్లుగా చర్చ సాగుతోంది… గద్దర్ మీద విమర్శలు బోలెడు… అఫ్‌కోర్స్, తను విమర్శలకు అతీతుడు ఏమీ కాదు…
వాళ్లో వీళ్లో దేనికి..? ఏ నక్సలైట్ల కోసం తను అవిశ్రాంతంగా, ప్రాణాలకు తెగించి పనిచేశాడో… అదే నక్సలైట్లు తనకు షోకాజు నోటీసు ఇచ్చారు… పార్టీ నుంచి బయటికి పంపించే దశ రాగానే తనే తప్పుకున్నాడు… వేటిని వ్యతిరేకించాడో అదే రాజ్యం, అవే బూర్జువా పార్టీలు, అవే బ్యాలెట్ రాజకీయాలు, దేవుడు, గుళ్ల వైపు మళ్లిపోయాడు… ఇదంతా ఒక ఎత్తు… గద్దర్ చంద్రబాబును హత్తుకున్న ఫోటో మాత్రం చాలామంది ప్రజాస్వామిక వాదులను చివుక్కుమనిపిస్తూనే ఉంటుంది…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది… బహుశా ఆ పత్రిక తప్ప ఇంకెవరూ రాయరు దాన్ని… సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ వ్యాఖ్య… గద్దర్ మీద హత్యాప్రయత్నం జరిగినప్పుడు తనను బతికించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించామని చెబుతున్నాడు… చంద్రబాబు కూడా బాగా కలత చెందాడట… ‘ఓ కవి మీద ఇలాంటి దాడి బాధాకరం, ఎంత ఖర్చయినా పర్లేదు, బయటి డాక్టర్లను కూడా పిలిపించండి’ అని బాగా బాధపడిపోయాడట…
Ads
గద్దర్‌కు ప్రాణాపాయం లేదని తెలిశాక కుదుటపడ్డాడట చంద్రబాబు… వైద్య ప్రముఖులు దగ్గరుండి గద్దర్ చికిత్సను పర్యవేక్షించారట కూడా… అన్నింటికీ విశేషం ఏమిటంటే… ఇదే లక్ష్మినారాయణ ఏదో ఫంక్షన్‌లో కలిస్తే గద్దర్ తనను కౌగిలించుకుని ‘నా ప్రాణాలు కాపాడార’ని ధన్యవాదాలు చెప్పాడట… తూటాలు కాల్చిన తుపాకీయే తెగ కన్నీరు కార్చినట్టుంది అంటారా..? ఏమో, మావోయిస్టు పార్టీ ప్రకటన ఆరోపణ వేరు… ఇది చదవండి…
అప్పట్లో బూటకపు ఎన్‌కౌంటర్లు మాత్రమే కాదు… అజ్ఙాతవ్యక్తులు రకరకాల పేర్లతో మావోయిస్టు సానుభూతిపరులు, కవర్ సంఘాల యాక్టివ్ లీడర్ల మీద కాల్పులు జరిపేవాళ్లు… నల్లదండు ముఠాలను గద్దర్ మీదకు ఉసిగొల్పి ఖతం చేయడానికి ప్రయత్నించింది చంద్రబాబు ప్రభుత్వమే అని ఈరోజుకూ ఆరోపణ బలంగానే వినిపించింది… అంతెందుకు..? గద్దర్ కూడా పలు వేదికలపై, ఇంటర్వ్యూల్లో ఇదే చెప్పాడు… ఆ తూటాను కూడా జీవితాంతం మోశాడు… కానీ తనే అదే చంద్రబాబును అలుముకోవడం ఒక ఐరనీ… కాల్చిన తుపాకీయే ఆ తూటాను ఇప్పటికీ మోసిన దేహానికి నివాళి అవే తుపాకుల మోతతో అర్పించడం విరోధాభాస విశేషమే… అనగా పారడాక్స్… ఒకప్పటి ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్ గద్దర్ మృతదేహం వద్దకు వెళ్లి మరీ నివాళి అర్పించడం కూడా ఒకింత విస్మయాన్ని కలిగించేదే…
లక్ష్మినారాయణ చెబితే చంద్రబాబు చెప్పినట్టే… లక్ష్మినారాయణ చంద్రబాబులో ఓ పార్ట్… ఇప్పుడాయనే గద్దర్‌ను బతికించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించామనీ, కలత చెందామనీ చెబుతున్న తీరు ఎందుకో నవ్వు పుట్టించింది… మరో రెండుమూడు విషయాలు చెప్పుకోవాలి… విరసం గానీ, మావోయిస్ట్ పార్టీ గానీ గద్దర్ మరణం మీద జాగ్రత్తగా మాటల్ని పేర్చి నివాళి అర్పించాయి… తనను అవమానించలేదు, అలాగని మరీ నెత్తిన పెట్టుకోలేదు… ఆచితూచి స్పందించాయి…
రాజ్యంపై తిరగబడిన గద్దర్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడాన్ని జయప్రకాష్ నారాయణ తప్పుపట్టాడు… కానీ గద్దర్ పదేళ్లుగా జనజీవన స్రవంతిలో ఉన్నాడనీ, విప్లవ రాజకీయాలకు ఏనాడో స్వస్తి పలికాడనీ ఆయన విస్మరించినట్టున్నాడు… ఐనా తనూ రాజ్యం ప్రతినిధే కదా… ఇక్కడ మరో విమర్శనూ (ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ వార్త) పరిగణనలోకి తీసుకోవాలి… ప్రజాస్వామిక శక్తుల ఉనికి పొడగిట్టని కేసీయార్ గద్దర్ అంత్యక్రియల్ని కూడా హైజాక్ చేయడం వెనుక ఆయన ఏ ఫాయిదాను ఆశించాడనేది ఒక చర్చ…!!
Share this Article