వార్త ఎలా ఉన్నా దాన్ని ప్రెజెంట్ చేసే పద్ధతిలో ఆంధ్రజ్యోతి కాస్త భిన్నంగా ఉంటుంది. మిగతా పత్రికలు తమ టెంప్లెట్లో తామే బందీలయి ఉంటాయి. జ్యోతి స్వేచ్ఛగా ఉంటుంది. తెలంగాణాలో ఎలెక్ట్రిక్ వాహనాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ రవాణా శాఖ ఒక ఉత్తర్వు ఇచ్చిన వార్తను జ్యోతి చాలా ప్రాధాన్యంతో మొదటి పేజీలో పైన దాదాపు బ్యానర్ పక్కన ప్రచురించింది. మిగతా పత్రికల్లో ఈ వార్త వచ్చినట్లు లేదు. లేక వచ్చినా కనిపించకుండా మరుగున ఎక్కడో ఉండిపోయి ఉండవచ్చు.
భవిష్యత్తు ఎలెక్ట్రిక్ వాహనాలదే. రోజూ పొద్దునా సాయంత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఈ రోజుల్లో ఎలెక్ట్రిక్ వాహనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలో కరెంటుతో నడిచే టెస్లా కార్లు ఎప్పుడో వచ్చాయి. ఒకసారి సెల్ ఫోన్ లా ఛార్జ్ చేసుకుంటే దాదాపు మూడు వందల కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. త్వరలో టెస్లా కారులో తృతీయ శ్రేణి మోడల్ భారత్ లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. కాకపోతే ధర మాత్రం అరవై లక్షల వరకు ఉండవచ్చు. మన లాంటి దేశాల్లో పది లక్షల ధర దాటిన కార్లు ఎక్కువగా అమ్ముడుపోవు. కాలగతిలో ఎలెక్ట్రిక్ కార్ల రేట్లు తగ్గే అవకాశముంది.
Ads
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఎలెక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బైక్ లు, మోపెడ్లు, స్కూటర్లు తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ పార్కింగుల్లో వీటికి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలు ఇరవై ఏళ్లకు మించి వాడడానికి వీల్లేకుండా కేంద్రం అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ఎంత వాడితే అంత కాలుష్యం పేరుకుపోతుంది. నగర జీవి ఊపిరితిత్తులు దెబ్బతినడానికి ప్రధాన కారణం వాహనాల పొగ. ఈ నేపథ్యంలో ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిజానికి- ఒకసారి ఎలెక్ట్రిక్ వాహనం నడిపిన వారెవరయినా పెట్రోల్, డీజిల్ వాహనాలను అసహ్యించుకుంటారు. ఎలెక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువ శబ్దం ఉండదు. బండి ఆన్ లో ఉందో, ఆఫ్ లో ఉందో కూడా గుర్తించలేం. పొగ రాదు. అన్నిటికి మించి పెట్రోల్ బంకులకు వెళ్లే పని లేదు. హైదరాబాద్ లాంటి విశ్వ నగరాల్లో మరో పదేళ్ళకయినా కనీసం యాభై శాతం ఎలెక్ట్రిక్ వాహనాలు వచ్చినా- నగర జీవి ఆయుః ప్రమాణం మరో ఐదేళ్లు ఆటోమేటిగ్గా పెరుగుతుంది. లేదా కనీసం ఆసుపత్రి ఖర్చు సగానికి సగం తగ్గుతుంది……………. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article