Sampathkumar Reddy Matta…. గోగుపూల పాట
~~~~~~~~~~~~
గోగుపూలు అంటే మోదుగుపూలు…
దక్కనుకు గోగుపూలు పెద్ద భౌగోళిక శోభ !
బతుకమ్మపండుగ ఎట్ల పాటలపండుగనో
కామునిపండుగ సుత అట్లనే పాటలపండుగ..!
ఒకటారెండా వందలువందలు వేలవేల పాటలు.
బతుకమ్మపాటలు మన మానవీయతను ప్రకటిస్తే,
కామునిపాటలు మానవజీవితానికి పంచవర్ణాలద్దుతై.
కామునిపాటలను శ్వాసించి, అదే లయలో పుట్టిన
ఉద్యమపాటలు, సినిమాపాటలు, ప్రచారగీతాలు ఎన్నెన్నో.
మన అవగాహన కోసం… వాటిలో కొన్నిటికి ఉదాహరణలివి.
^^^^^^
1.
కాముని పాట:
పుల్లలు పుల్లలు ఎన్నీయలో మరి లవంగపుల్లలు ఎన్నీయలో
లవంగపుల్లలు ఎన్నీయలో మరి నమిలితె వాసనలెనీయలో
ఉద్యమ గీతం:
ఎర్రజెండ ఎర్రజెంజ ఎన్నీయలో – ఎర్రెర్రనిదీజెండెనీయలో
2.
కాముని పాట:
అల్లీ పొదాలకింద అల్లీ పొదాలకింద
అందగాడెవరో అల్లీ పొదాలకిందా..
కట్లా పొదాలకింద కట్లా పొదాలకింద
కాముడున్నాడో కట్లా పొదాలకిందా..
ఉద్యమ గీతం:
అల్లీ పొదాలకింద అల్లీ పొదాలకింద
అన్నాలున్నారో అల్లీ పొదాలకిందా..
3.
బతుకమ్మ పాట:
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
ఉద్యమ గీతం:
కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ
కొడవండ్లు చేపట్టవే చెల్లెమ్మ
4.
కాముని పాట:
పోదలపొదల గట్లనడుమ పొడిచినాడె చందమామ
రాటుగొట్ట నువ్వేవోంగనో ఓ పాటేలా..
రాగట్లనె పొద్దువొడిసెనో ఓ పాటేల..!
పార్టీ గీతం:
పోదలపొదల గట్లనడుమ పొడిచినాడె చందమామ
సైకిలెక్కి నువ్వేరాంగనో ఓ యెన్టియారు..
మా వోటు నీకే యేస్తమో మా యెన్టియారు..!
5.
కాముని పాట:
చిగురేసే మొగ్గేసే
సొగసంతా పూతబూసే
చెయ్యయినా వెయ్యావేమీ.. ఓ బాపూ దొర !
సినిమా పాట:
ఆకేసే మొగ్గేసే
సొగసంతా పూతబూసే
చెయ్యయినా వెయ్యావేమీ.. ఓ బాపూ దొర !
ఉయ్యాలలూపవేమీ.. ఓ బాపూ దొర..!
6.
కాముని పాట:
గోగులు పూసే గోగులు కాసే ఓ లచ్చాగుమ్మడీ..
గోగులు దులుపే వారెవరయ్యా ఓ లచ్చా గుమ్మడీ..
సినిమా గీతం:
గోగులు పూసే గోగులు కాసే ఓ లచ్చాగుమ్మడీ..
గోగులు దులుపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మడీ..
మదనా సుందారి మదనా సుందారి..
నారె నన్నార – నారె నన్నార..
నారె నన్నరనార నారెనన్నారా..!!
తెలంగాణ ఎర్రమట్టి నిండారా
ఇంకెన్నో.. ఎన్నెన్నో.. పాటలేపాటలు.
తెలంగాణం ప్రపంచంలోనే అతిపెద్ద పాటల లోగిలి. ఇది.. మన సాహిత్యం – మన సంస్కృతి. ~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article