.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీయార్‌ను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం శనివారం ఫామ్ హౌజుకు వెళ్తాడనీ, కేసీయార్ టైమ్ అడిగారనీ ఓ వార్త…
మరీ అప్పట్లో యాదాద్రి ఆవిష్కరణకు బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యక్రమంలా చేసి అభాసుపాలైంది అప్పటి కేసీయార్ సర్కారు… తన అహం కూడా ఎవరినీ, చివరకు గవర్నర్‌ను కూడా రానివ్వదు… అది వేరే సంగతి…
Ads
అన్ని పార్టీల నాయకులనూ పిలవాలనేది, ఇది యావత్ తెలంగాణ ఫంక్షన్ అని చూపాలనేది స్థూలంగా రేవంత్ రెడ్డి సర్కారు భావన… కానీ ఓడిపోయాక జనానికి మొహం చాటేస్తున్న కేసీయార్‌ను ఇరుకునపడేసే రాజకీయ ఎత్తుగడ ఇది…
తనెలాగూ రాడు… పక్కా… రాడు కదా, చూశారా, ఇదీ తెలంగాణ అస్థిత్వం మీద కేసీయార్ నిజరూపం అని బదనాం చేయొచ్చుని కాంగ్రెస్ ప్లాన్ కావచ్చు… నువ్వు అసెంబ్లీకి రావెందుకు, పెద్దరికం నిలబెట్టుకో అని పదే పదే కేసీయార్‌ను నిందిస్తూ, రెచ్చగొడుతూ రేవంత్ ఓరకమైన దాడి చేస్తున్నాడు…
తను రాడు, కుర్చీ దింపేస్తే ఇక మీ జోలికి రాను, రెస్ట్ తీసుకుంటానంటూ ఓ ప్రపంచప్రఖ్యాత స్టేట్స్‌మన్ బాపతు స్టేట్‌మెంట్ ఏదో ఇచ్చాడు కదా కేసీయార్… తెలంగాణ తల్లి ప్రోగ్రామ్‌కు కూడా రాడు… సరే, తనేమంటాడో సరదాగా… ఇతర పార్టీల నాయకులు ఏమంటారో కూడా సరదాగా చెప్పుకుందాం…
కేసీయార్ : : ఏం విగ్రహమయ్యా అది, ఓ కిరీటం ఏది… వడ్డాణం ఏది..? దేవతామూర్తిని ఓ పేదతల్లిలా చేశారు… ఆ అభయహస్తం ఏంది..? ఆమె కాంగ్రెస్ తల్లా…? నేనొచ్చి ఇదే అసలైన తెలంగాణ తల్లి అని సర్టిఫై చేయాల్నా..? నామీద ద్వేషంతో తెలంగాణ అస్థిత్వం మీద, చరిత్ర మీద దాడి చేస్తున్నారు… ఇక జనమే చెబుతారు…
సంజయ్ : : నో, నో… ఇదేం విగ్రహం..? ఆమె చేతిలో కమలంపువ్వు పెడితే మీ సొమ్మేం పోయిందయ్యా… భక్తిగా దండం పెట్టేలా ఓ భరతమాత విగ్రహంలాగా ఉండాలయ్యా…
తమ్మినేని : : అది కాదు కామ్రేడ్… తెలంగాణ సగటు పోరాట మహిళ విగ్రహమన్నారు… ఏదీ ఆ స్పూర్తి… చేయి పైకెత్తి పిడికిలి బిగించనట్టు ఉండాలా లేదా..? చేతిలో కర్ర లేకపోయినా సరే ఓ కొడవలి పెట్టాలి కదా… అబ్బే, ఇది మరీ ఫాసిస్ట్ ధోరణి…
కూనంనేని : : వోకే, వోకే… మరీ దొరసానిలా నగలేమీ లేవు సరే… కానీ కాళ్లకు మట్టెలు ఏవి…? కడియాలు ఏవి…? బతుకమ్మ ఏది..? అసలు పుస్తెలు ఏవి..? అస్సలు బాగాలేదు… ఐనాసరే, వస్తాం…
ఒవైసీ : : పిలిచారు, సంతోషం, అధికారిక కార్యక్రమం సరే… కానీ మేం విగ్రహాల్ని, ఆరాధనల్ని విశ్వసించం…
… జస్ట్, సరదాగా… నిజంగానే మొదట్లో ఆలోచించినట్టుగా… చేతిలో కర్ర ఉంటేనే బాగుండు… తెలంగాణ సోయికి విరుద్ధంగా ఎవడు వ్యవహరించినా సరే, ఈ కర్రతో జవాబు చెబుతాం అని సగటు తెలంగాణ మహిళ హెచ్చరిస్తున్నట్టుగా..!!
Share this Article