Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి… భయంభయంగా రాయునది…

January 10, 2023 by M S R

Over Dosage: హీరోకు జీరో బహిరంగ లేఖ

దైవాంశ సంభూతులయిన సినిమా హీరో గారికి,

మీరు మొన్న ఎడమకాలి గోటితో అప్రయత్నంగా సుతారంగా నొక్కినప్పుడు పాతాళం అడుగుకు కూరుకుపోయిన హిమాలయం సిగ్గుతో తల దించుకుని మరింత కిందికి కిందికి వెళ్లిపోతోంది.

Ads

ఆరడుగుల బుల్లెట్లు, ధైర్యం విసిరిన రాకెట్లు మీ నోట్లో సిగరెట్టును వెలిగించడానికి నిలువెల్లా దహిస్తూ బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నాయి.

మొన్న మీరు రాయలసీమ విలన్ ఇంటి ముందు ఈల వేస్తే గాల్లోకి ఎగిరిన తెల్లటి సూమోలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు రాయలసీమ సామాన్య జనం నెత్తిమీదే పడుతున్నాయి.

 

మొన్న మీరు తొడగొట్టి నంద్యాల రైల్వే స్టేషన్లో తన్నిన దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలున్నా, లేకున్నా ఆగకుండా వేగంగా వెనక్కు వెళుతూనే ఉంది.

నిన్న మీరు విదేశం నుండి విమానమెక్కి, ఈరోజు హెలిక్యాప్టర్ ఎక్కి ముఖ్యమంత్రిగా వచ్చి మా ఎర్రి పల్లె పంచాయతీ వార్డు మెంబరును గెలిపించడానికి ఊరవతల పాడుబడ్డ రైస్ మిల్లులో ఎమ్మెల్యే విలన్, ఆ విలన్ కొడుకుతో తలపడి గెలిపించిన ప్రజాస్వామ్యం మీ మెడకో దండకోసం వెతుకుతోంది.

ఇటలీ మిలాన్ వీధుల్లో కాలికి చెప్పుల్లేకుండా తిరిగిన మీ అసామాన్య సామాన్య నగ్న పాదానికి తొడగడానికి ఇక్కడ చెప్పులు నిరీక్షిస్తున్నాయి.

కొన్ని కోట్ల తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదలను వదిలి పెంటపాడు ఊళ్లో మీరు ఈగలు తోలుకుంటూ గడిపిన క్షణాలు సిగ్గుపడుతున్నాయి. పెంటపాడు ఊరవతల మీరు వేసిన గ్రాఫిక్ రోడ్డు నిజమనుకుని నిజంగా వచ్చిన రోడ్డు రోలర్ వెనక్కు వెళ్లిపోయింది.

కాశీలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోకుండా మీరు రాగానే రాయలసీమలో కుంభవృష్టి మొదలై ఊళ్లకు ఊళ్లు మునిగి తేలడం లేదు.

 

మీరు మళ్లీ కాశీ వెళితేనే ఊళ్లు తేలుతాయని అనడానికి మా వెర్రి అభిమానం అడ్డొస్తుంది.

మీరు ఏకగ్రీవం చేయక చాలా నియోజకవర్గాల్లో అనవసరంగా ఎన్నికలు జరిగి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల ఖర్చవుతోంది.

మీరు అనంతకోటి బ్రహ్మాండాలు దాటి ఎదుగుతూ ఉండడంతో మీ వీరత్వాన్ని వర్ణించడానికి భాషలో ఉపమానాలకు తీవ్రమయిన దుర్భిక్షం వచ్చి కవులు విరోధాభాసలను ఆశ్రయించాల్సి వస్తోంది. దాంతో శివుడి మూడో కన్ను కూడా చిన్నబోతోందనే అర్థం వస్తోందని భక్తులకు నిజంగా భయభక్తులు పెరిగాయి.

తుపాను అంచున మీరు చేసిన తపస్సుల వేడికి భూగోళం మాడి మసయి…గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరుగుతోంది స్వామీ…. కొంచెం కనికరించండి.

 

క్షణాలలో శవాలను పుట్టించే మీ బీభత్స భయానక రసాన్ని చూసి తట్టుకునేంత వాళ్లం కాము.
పిల్లలుగల వాళ్లం… కొంచెం పెద్ద మనసు చేసుకోండి.

థియేటర్లకు రావడానికి భయపడి ఇళ్లల్లో గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీల్లో చూసినా జడుసుకునే పిరికివాళ్లం…
గంజీ- బెంజీ- రంజీ అన్నీ తెలిసిన మీకెలా చెప్పాలో మాకు అర్థం కావడం లేదు.

మీరే మా దయనీయ, హృదయవిదారక, నీరవ, నైరాశ్య, వైరాగ్య, దుఃఖిత, విస్మిత, కుపిత, చలిత, జ్వలిత, దుర్భర, దారుణ దుస్థితిని అర్థం చేసుకుని కొంచెం దయ చూపండి!
చచ్చి మీ కడుపున పుట్టం!!

ఇట్లు,
హీరో పాదధూళికి కూడా అర్హతలేని జీరో

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions