తెలుగు ఇండియన్ ఐడల్ షో చూసేవాళ్లకు తరచూ అర్థం కాని ప్రశ్న… అడ్డదిడ్డం డబ్బింగ్ పాటల్ని ఎందుకు కంటెస్టెంట్లపై, తరువాత శ్రోతలపై ఎందుకు రుద్దుతున్నారు అని..! ఈసారి ఎపిసోడ్ డబుల్ ధమాకా అని స్టార్ట్ చేశారు… దాదాపు అన్నీ ఆ డబ్బింగులే…
ఏం టేస్టురా బాబూ..? అచ్చ తెలుగులో రాయబడి, ట్యూన్ చేయబడి, పాడబడిన పాటలే లేవా..? వాటిల్లో కంటెస్టెంట్లను పరీక్షించలేరా..? ఉదాహరణకు ఈరోజు కొండాకాకీ కొండె దానా, గుండిగలాంటి గుండే దానా. అయ్యారేట్టు పళ్లదానా, మట్టగిడస కళ్ల దానా అనే పాట… పరమ చెత్త సాహిత్యం…
పువ్వులతో బాణం వేస్తే ఫూలన్ దేవి అట… పాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్… నిజానికి ఆ పాటను కూడా నజీరుద్దీన్ బాగా పాడాడు… తోడుగా దామిని కూడా బాగా పాడింది… కానీ ఆహా క్రియేటివ్ టీం టేస్టే ‘కొండాకాకీ కొండెదానా’ తరహాలో ఉంది… ఈసారి ఆరుగురు కంటెస్టెంట్లకు ఆరుగురు ఫేమస్ ప్లేబాక్ సింగర్స్ కలిసి పాడతారని కాన్సెప్టు కదా…
Ads
కానీ వీళ్లలో సౌజన్య, వాగ్దేవి… గత సీజన్ల విజేతలే తప్ప ఫేమస్ ప్లేబాక్ సింగర్స్ ఏమీ కాదు… ఆ ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు… జెమ్స్… ఆనతి నీయరా హరా అనే పాట… చెవుల్లో అమృతం పోసినట్టుగా పాడారు… వీళ్లతోపాటు పృథ్వి చంద్ర, రోహిత్, ధనుంజయ్ కూడా పార్టిసిపేట్ చేశారు…
వీరిలో కీర్తన గురించి చెప్పాలి… అమ్మాయి ఈరోజు ఎర్రాని కుర్రదాన్ని గోపాల అనే పాట ఎత్తుకుంది… పర్‌ఫెక్ట్… అక్కడక్కడా పాటకు తగినట్టు మాడ్యులేషన్ మారుస్తూ… అదే జోష్‌తో పాడింది… ఎందుకో గానీ విజయం వైపు పరుగు తీస్తున్నట్టు అనిపిస్తోంది ఆమె… భరత్ రాజ్, శ్రీ కీర్తి, నజీరుద్దీన్ తనకు బలమైన పోటీ…
ఈసారి పొగడ్తల డోస్ కూడా పెంచారు జడ్జిలు… కీర్తన అర్జెంటుగా కీ బోర్డ్, గిటార్ గట్రా నేర్చేసుకుని సొంతంగానే మ్యూజిక్ కంపోజ్ చేయాలట… నజీరుద్దీన్ ఇక బాలకృష్ణలాగా అన్‌స్టాపబుల్ అట… భరత్ రాజ్ ఎక్కడికో వెళ్లిపోతాడట… పాటల్ని నిశితంగా గమనించి మార్కులు వేయండి, తప్పుప్పుల్ని శ్రోతలకు కూడా చెప్పండిరా బాబూ అంటే… జడ్జిలే కీర్తనలు అందుకుంటున్నారు… ఏమాటకామాట…
పిక్చర్‌తో పిచ్చెక్కిస్తా అనే సరదా గేమ్ మాత్రం ఎంటర్‌టెయినింగ్‌గా ఉంది… అవును మరి, సింగింగ్ కంపిటీషన్ షోను కాస్తా ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ ప్రధానమైన ఓ సగటు టీవీ రియాలిటీ షోగా ఎప్పుడో మార్చేశారు కదా… ఆ ప్రాస కవితలు, ఈ గేమ్స్ అన్నీ అవే… పాటలు ఎప్పుడో పక్కకు పోయాయి..!!
Share this Article