.
హంస గీతా? హింస గీతా? ఒత్తుల్లేని తెలుగు సాధ్యమేనా? తెలుగు అక్షరం ప్రత్యేకించి ఒత్తులమీద ఇప్పుడు కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన ‘హంసగీత’ (తేట తెలుగు) లిపిపై ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది.
ఒత్తులు తీసేసి తెలుగును సరళం చేయాలన్నది ఆయన తపన. వినడానికి ఈ ఆలోచన అద్భుతంగా ఉన్నా, ఆచరణలోకి వస్తే ఇది భాషా వికాసం కంటే భాషా వినాశనానికే దారితీసేలా ఉందన్నది భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం.
Ads
ఆకర్షణీయమైన ఆలోచన.. కానీ ప్రమాదకరం!
33 ఒత్తులను తీసేసి, కేవలం ఒక ‘గీత’తో పని ముగించేయాలన్న ప్రతిపాదన వినడానికి చాలా హాయిగా ఉంటుంది. పిల్లలకు అభ్యసనం సులభం కావడం, టైపింగ్ వేగం పెరగడం, పుస్తక ముద్రణలో కాగితం ఆదా కావడం వంటివి ఇందులో పైకి కనిపించే లాభాలు. కానీ, ఒక భాష అంటే కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమే కాదు; అది వేల ఏళ్ల సంస్కృతికి, పలికే శబ్దానికి సంకేతం.

ఒక్క గీతతో అన్ని ఒత్తులను సంకేతించడంవల్ల ‘ద్విత్వ’, ‘సంయుక్త’ అక్షరాల మధ్య తేడా కనుమరుగవుతుంది. ఇది భాషలో అంతులేని గందరగోళానికి దారితీస్తుంది. ఉదాహరణకు, ‘మొక్క’ అన్న మాటలో ‘క’ మీద గీత గీస్తే అది ‘క’ ఒత్తు అనుకోవచ్చు. కానీ ‘పుష్కలం’ అన్న మాటలో ‘ష’ మీద గీత గీస్తే, అప్పుడది ‘ష’ ఒత్తు అవుతుందా? లేక ‘క’ ఒత్తు అవుతుందా? ఇలాంటి అస్పష్టతలు భాషా సౌందర్యాన్నే కాదు, అర్థాన్ని కూడా దెబ్బతీస్తాయి.
లిపి మారితే.. చరిత్ర మాయం!
మనం నేడు ఒక కొత్త లిపిని అలవాటు చేసుకుంటే, రాబోయే తరం మన ప్రాచీన సాహిత్య సంపదను అసలు చదవలేదు. నన్నయ్య భారతం నుండి మొన్నటి సినారె సాహిత్యం దాకా అన్నీ వారికి అర్థం కాని ‘గ్రీకు అక్షరాలు’ అయిపోతాయి. ఒక తరం తన మూలాలను కోల్పోవడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు. లిపిని మార్చడం అంటే మన గతాన్ని మనం తగులబెట్టుకోవడమే అవుతుంది.

ఇప్పటికే డిజిటల్ యుగంలో తెలుగు వాడకం కొత్త పుంతలు తొక్కింది. నేటి యువత తెలుగును ఇంగ్లీష్ అక్షరాల్లో (Transliteration) యథేచ్ఛగా రాసేస్తున్నారు. అమ్మ, నాన్న అని తెలుగులో రాయడానికి బదులు ‘Amma’, ‘Nanna’ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాస్తున్నప్పుడు వారికి తెలుగు లిపితో పని లేదు, భాషా భావంతోనే పని. మంచో, చెడో ఇప్పటికే వాడుకలో ఇదొక అలవాటుగా ఉండగా, మళ్ళీ తెలుగు లిపిలోనే కొత్తగా ‘గీతలు’ పెట్టి గందరగోళం సృష్టించడం వల్ల…వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ.
అభినందనీయమైన తపన.. కానీ ఆచరణ సాధ్యమేనా?
మాతృభాష అంతరించిపోకూడదనే ఆవేదనతో వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చుతో చేస్తున్న ఈ కృషిని మాత్రం గుర్తించాల్సిందే. ఆయన సంకల్పం గొప్పదే అయినప్పటికీ, లిపి మార్పు కేవలం భావోద్వేగాలతో కూడుకున్నది కాదు. ఇది భాషా విజ్ఞాన శాస్త్రం (Linguistics), ఉచ్చారణా శాస్త్రం (Phonetics)లాంటి ప్రామాణిక అంశాలతో ముడిపడి ఉండాలి. పాత రికార్డుల డిజిటలైజేషన్ నుండి ప్రభుత్వ ఆమోదం వరకు ఇందులో ఎన్నో ఆచరణాత్మక అడ్డంకులు (Practical hurdles) ఉన్నాయి.
ఉన్నది పదిలంగా వాడితే చాలు
భాషను కాపాడటం అంటే దాని రూపాన్ని మార్చడం కాదు, దాన్ని వాడే విధానాన్ని మెరుగుపరచడం. ప్రస్తుతం మనకున్న లిపి ఎంతో శాస్త్రీయమైంది, స్పష్టమైంది. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ‘వాయిస్ టైపింగ్’ ద్వారా ఒత్తుల సమస్య ఎప్పుడో తీరిపోయింది. అందుకే, ఉన్న లిపిని మార్చడం కంటే, దాన్ని అలాగే కొనసాగిస్తూ తెలుగును మరింత మందికి చేరువ చేయడంపై మనం దృష్టి పెట్టాలి. ప్రయోగాలు మంచివే కానీ, అవి భాషా స్వచ్ఛతను, చారిత్రక వారసత్వాన్ని బలితీసుకునేవి కాకూడదు.
– పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article