‘‘నీ నవ్వు తాకి తరించి తపస్సిలా
నిషీధులన్నీ తలొంచే తుషారానివా….’’ ఇవి రాబోయే సీతారామమ్ అనే సినిమాలోని ఓ పాటలోని పంక్తులివి… నీ నవ్వు తాకి తరించి తపస్సిలా… ఒక్క ముక్క కూడా బుర్రకు ఎక్కలేదు… ఏమోలే… సదరు రచయిత కృష్ణకాంత్ కవిహృదయాన్ని అర్థం చేసుకునేంతగా మనం ఎదగలేదేమో అనుకుందాం… ఈ నిషీధులు ఏమిటో… ఓహో, నిశీధులేమో… సరే, ఓ మంచు బిందువుకు చీకటి తలొంచడం ఏమిటి..? కథానాయిక అందానికి అదెలా వర్తిస్తుంది..?
లాభం లేదు… ఈ కృష్ణకాంత్ అనే రచయితను ఇంకా అర్థం చేసుకోవాల్సిందే… నెలక్రితం మరో పాట రిలీజ్ చేశారుగా… అందులో ‘‘రోజంతా వెలుగులిడు నీడవుతా’’ అంటున్నాడు కథానాయకుడు… నీడ వెలుగులు ఇవ్వడం ఏమిటో… పోనీలే, మనమే ఇంకా పండి, పరిపక్వం కావాలేమో… ఆ విద్వత్తును అర్థం చేసుకోలేని కచ్చకాయలమే కావచ్చు మనం ఇంకా…! సదరు రచయిత లోతును, గాఢతను, వైశాల్యాన్ని, భావుకతలను పట్టుకోలేకపోతున్నామేమో…
ఇదే బాధపడుతుంటే చటుక్కున స్పురించింది… రాధేశ్యామ్ సినిమాలో కూడా తనే రాసినట్టున్నాడు… శ్యామ్‌సింగరాయ్‌లో కూడా… శ్యామ్‌సింగరాయ్‌లో కాస్త అర్థమయ్యీ కానట్టు అనిపించాయ్… చల్నేదో బాల్‌కిషన్ అనుకున్నాం, కానీ ఆ సినిమాకు పాటలే మైనస్… సాయిపల్లవి డాన్స్ చేసిన ప్రణవాలయ పాట తప్ప… అదేమో సిరివెన్నెల రాసింది… మరి రాధేశ్యామ్..?
Ads
‘‘ఖాళీఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే… ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో, ఏమో… కాలం మంచు కత్తీ గుండెల్లో గుచ్చే… గాయం లేదు గానీ దాడెంతో నచ్చే… ఆ మాయ ఎవరే, రాదా ఎదురే, తెలీకనే తహతహ పెరిగే… నిజమా, భ్రమా, బాగుందే యాతన… కలతో కలో, గడవని గురుతులే… ఏదో జన్మ బాధే, పోదే, ప్రేమై రాదే… ఈ రాతలే… దోబూచులే… ఇలా ఉంటుంది ఓ పాట… ఏమైనా బుర్రకెక్కిందా..? ఎక్కడు… హైక్లాస్… మరీ డీప్ క్లాస్… మరీ కాన్సంట్రేట్ క్లాస్…
ఆ ట్యూన్లు కూడా రాధేశ్యామ్ తరహాలోనే… సేమ్ సేమ్… చివరకు సినిమా టైటిల్ డిజైన్ కూడా సేమ్… అవునూ, పుష్ప సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయిన రష్మిక మరీ సైడ్ హీరోయిన్ అయిపోయిందా అప్పుడే… పట్టుమని పది సినిమాలు కూడా చేయని మృణాల్ ఠాకూర్ ప్రధాన హీరోయిన్ అట… మరీ సుమంత్ కూడా సైడ్ హీరో అయిపోయాడా..? దుల్కర్ హీరో అయితే, మస్తు సినిమాల్లో హీరోగా చేసిన సుమంత్ సైడ్ హీరోయా..? పోస్టర్లు, ఇప్పటికి రిలీజైన రెండు పాటల్లో కూడా దుల్కర్, మృణాలే కనిపిస్తున్నారు… నో రష్మిక, నో సుమంత్…
పాటలు కనెక్ట్ కావడం లేదు మొర్రో అన్నామనుకొండి… శుభం పలకరా పెళ్లికొడుకా అంటారు… మరీ ఎక్కువయితే ‘బోడి, అసలు సినిమా పాటలకు అర్థలు దేనికోయ్, మంచి ట్యూన్ పడితే చాలు, సాహిత్యం ఎవడిక్కావాలి’ అని దాడికొస్తారు… కానీ వైజయంతి వాళ్ల సినిమా కదా… ఏదీ అనుకోకుండా, ఏమీ అనకుండా ఎలా ఉండగలం..? పైగా యుద్ధంతో రాసిన ప్రేమకథ అని ట్యాగ్ తగిలించారు టైటిల్‌కు… విరాటపర్వంలోని విప్లవప్రేమ గుర్తొచ్చింది… ఏమోలెండి… ‘‘నిశీధులన్నీ తలొంచే తుషారంలా’’ బాగానే ఉంటుందేమో…!! అవును, సోదరా… జనానికి సమజయ్యే భాషలో రాస్తే మర్యాద దక్కదని దర్శకుడు బెదిరించాడా..?!
Share this Article