పొద్దున్నే ఓ పంకిలం మీద కథనం రాయాల్సి వచ్చినందుకు… పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తున్నందుకు… ఒకింత చింత… తప్పదు… కొన్ని చెప్పుకోవాలి… పార్టీలు, పత్రికలు కలిస్తే… ఎదుటోడిపై ఉచ్చనీచాలు మరిచి విరుచుకుపడితే… అధికార యావ, పార్టీలకు భజనే పత్రికల పరమార్థం అవుతున్న వేళ… సోషల్ మీడియా పార్టీ విభాగాలు, ఫేక్ ఖాతాలు, ట్రోలర్ల చెడుగుడు కూడా కలిశాక కరోనాను మించిన వ్యాధి ప్రబలుతూ… ప్రజాప్రయోజనాలు, జన పాత్రికేయం కాస్తా కనుమరుగై… అష్టావక్ర వాతావరణం కనిపిస్తుందని చెప్పడానికి నిఖార్సైన ఉదాహరణ ఇది…
జగన్‌ను తిడతావా, తిట్టు… జగన్ చేసిన లోపాలను ఎండగడతావా, రైట్… చంద్రబాబు అరెస్టు మీద ఏడ్చి మొత్తుకుంటావా, ఫైన్… ఇవన్నీ ఆయా పార్టీల అవసరంకన్నా మీడియా మొరుగులే ఎక్కువ వినిపిస్తున్నాయి ఇప్పుడు… మొన్నేం రాశారు ఆంధ్రజ్యోతి, ఈనాడు… (టీవీ5 అనబడే బురదటీవీ గురించి కాసేపు మరిచిపోదాం… అయ్యా, మరో డిస్‌క్లయిమర్ సాక్షి ఏమీ శుద్ధపూస కాదు…) చంద్రబాబు విచారణ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటిండెంట్ సెలవు పెట్టాడు…
అరె, చంద్రబాబు ఈ జైలుకు రాగానే సెలవు పెట్టడం ఏమిటి..? డీఐజీకి బాధ్యతలు అప్పగించారు… ఔనా..? ఐతే ఏదో ఉంది… జగన్ ప్రభుత్వ ముఖ్యులంతా కలిసి చంద్రబాబు ప్రాణాలకు ఏదో ఎసరు పెట్టబోతున్నారా..? ఏం జరుగుతోంది..? అసలే ఆ జైలులో భద్రత లేదు చంద్రబాబుకు..? మరి తెర వెనుక ఏ కుట్రకు ప్రాణం పోస్తున్నారు వీళ్లంతా..? ఇదుగో ఈ రేంజులో ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు రాసేశాయి…
Ads
అక్కడికీ ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నారు, సదరు సూపరింటిండెంట్ భార్యకు బాగాలేదు, తప్పనిసరై సెలవు పెట్టాడు అని… ఇవే వార్తల్లో రిపోర్టర్‌కు నిజం తెలుసుననీ అర్థమవుతుంది… కానీ పత్రికల యాజమాన్యాల్ని సంతృప్తిపరిచేలా అష్టావక్రల్లాంటి వార్తల్ని పుట్టించాలి కదా… వైజాగ్ నుంచి రాజమండ్రికి రావడం, భార్య అనారోగ్యం, చంద్రబాబు అంశంతో ఆ అధికారి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని రిపోర్టరే రాశాడు వార్తలో… కానీ మళ్లీ తనే సెలవుపై అనుమానాలు అని రాసిపడేశారు… ఏదో జరగబోతోందని సందేహాల్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం… వాతావరణాన్ని మరింత కలుషితం చేయడం…
చంద్రబాబుతో పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కొద్దిసేపటికే సూపరింటిండెంట్ సెలవు పెట్టడం మీద బలమైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయట… (మార్గదర్శిని జగన్ గోకడం మొదలెట్టాక ఈనాడు మరీ దిగజారిపోయింది… మరీ ఆంధ్రజ్యోతికన్నా దిగువకు… పాపం శమించుగాక, మరీ టీవీ5 రేంజుకు పడిపోయింది దాని ప్రమాణాల పతనం…) ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే… సదరు సూపరింటిండెంట్ భార్య మరణించింది… (మీ కళ్లు చల్లబడ్డాయా..?)
గత నెలలో తన తల్లి మరణించిందనీ… ఇప్పుడు సూపరింటిండెంట్ భార్య కిరణ్మయి చనిపోయిందనీ… దీనికితోడు తమపై వచ్చే ఇలాంటి వార్తలు తమను తీవ్రమైన మెంటల్ స్ట్రెస్‌కు గురిచేస్తున్నాయనీ జైళ్ల డీఐజీ రవికిరణ్ బాధపడుతూ ఓ పత్రిక ప్రకటన రిలీజ్ చేశాడు… కాస్త వాస్తవాలు తెలుసుకుని, వివరణలు తీసుకుని వార్తలు రాయండి బాబోయ్ అని ఎస్పీ జగదీష్ అంటున్నాడు…
నిజానికి ఆమెకు కేన్సర్… రాజమండ్రిలోనే నవీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు ఆమెకు గత కొద్దిరోజులుగా… అక్కడి రిపోర్టర్లకు తెలియదా ఈ విషయం… పోనీ, తెలియదు అనుకుందాం… విషయం ఇదీ అని జైళ్ల డీఐజీ చెప్పినప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవచ్చు కదా… అది రాయాల్సిన అవసరం లేదు, అసలు విషయం తెలిసీ విషయాన్ని వక్రీకరించి, చంద్రబాబును ఏదో చేయబోతున్నారు అనే వార్తలు దేనికి..? ఉద్దేశపూర్వక వక్రీకరణలు, తలతిక్క బాష్యాలు కావా..?
ఈనాడు ఆ అధికారి భార్య మరణం వార్త వేయలేదు సరికదా… కొత్తగా ఇన్‌చార్జిగా వచ్చిన అధికారి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనకు బంధువట… అందుకే సందేహాలు ప్రబలిపోతున్నాయట… సూపరింటిండెంట్ సెలవుపై వెళ్తే అదే స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా వేయాలట, కానీ పెద్ద అధికారిని వేశారట, అందుకని అనుమానాల తీవ్రత పెరుగుతోందట… అయ్యా, బాబూ… ఆయన సెలవు పెట్టింది నాలుగు రోజులు… కాస్త నువ్వు చూసుకోవయ్యా నాలుగు రోజులపాటు, అసలే చంద్రబాబు ఉన్నాడు అంటూ మరో పెద్దాయనకు చెప్పారు… ఈమాత్రం దానికి చంద్రబాటు పట్ల కఠినంగా వ్యవహరించడానికట… ఆయన్ని మానసికంగా కుంగతీసే కుట్ర అట, ఆయన రాగానే జైలులో రౌండ్లు వేసింది కూడా ఇందుకేనట… మీకో దండంరా బాబూ…
కక్షసాధింపు రాజకీయాలు, కేసులు, బూతులు, కుసంస్కారం, కుత్సితం, అవినీతి… ఏపీ రాజకీయాల్లో పెంట కుళ్లి కంపుకొడుతోంది… మిగతా ప్రాంతాల్లో రాజకీయాలు బాగున్నాయని కాదు… కాకపోతే ఏపీ కాలుష్య ప్రమాణాల్లో కొత్త రికార్డులు తిరగరాస్తోంది… పార్టీలు, మీడియా, సోషల్ మీడియా కలిశాక ఈ కలరా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది… అదే ఆందోళనకరం… ఈ పంకిల ప్రస్థానం ఇంకా ఎక్కడి వరకో…!! అవునూ, చంద్రబాబును ఇక్కడే జైలులో ఉంచితే ఇలాంటి కథలే వ్యాప్తి చెందుతాయి… సో, తీహార్ జైలుకు పంపించడం బెటరా..? ఢిల్లీ జైళ్లు కేజ్రీవాల్ పరిధి కూడా కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ పరిధి, అనగా బీజేపీ పరిధి… ఒక్క మాట చెప్పండి… మోడీ సై అంటాడు… గ్యారంటీ…!!
Share this Article