స్టార్ తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే సంగీత దర్శకులు డీఎస్పీ, తమన్… కాపీలు కొట్టినా, సొంత ట్యూన్లు కొట్టినా, హిట్లతో అదరగొట్టినా ఆ రెండు పేర్లేనా..? అప్పుడప్పుడూ కీరవాణి… అంతేనా..? మంగళవారం సినిమా చూస్తూ కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ భేష్ అనుకుంటున్నప్పుడు ఈ సందేహమే కలిగింది… కాంతారతో సూపర్ హిట్టయిపోయిన ఈ మ్యూజిషియన్‌కు ఇప్పుడు ఊపిరి సలపనంత పని… చేతిలో దాదాపు ఆరేడు సినిమాలున్నయ్…
రెహమాన్‌లు, ఇళయరాజాల్ని ఎప్పుడో దాటేసి, చాలా మైళ్లు ముందుకెళ్లిపోయిన అత్యంత గిరాకీయుడు అనిరుధ్ సంగతి కాసేపు పక్కన పెడితే… మన తెలుగులోకి కన్నడ సంగీత దర్శకులు చొచ్చుకు వచ్చేస్తున్నారు… ప్రస్తుతం దుమ్మురేపుతున్న సలార్‌కు సంగీత దర్శకుడు రవి బస్రూర్… తనే కేజీఎఫ్‌కూ చేశాడు… పాటలు వదిలేస్తే అదిరిపోయే బీజీఎంతో సినిమా సీన్లను భలే ఎలివేట్ చేశాడు… (కాకపోతే కేజీఎఫ్ రేంజులో లేదనే అభిప్రాయాలు వినిపించాయి) తనే సంగీత దర్శకత్వం వహించిన కబ్జా, శాసనసభలతోపాటు బీజీఎం అందించిన రెండుమూడు హిందీ సినిమాలు కూడా పెద్ద క్లిక్ కాలేదు… ఐతేనేం, గిరాకీ ఏమీ తగ్గలేదు… తన చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఓ హిందీ సినిమా ఉందిప్పుడు…
అజనీష్ ప్రయోగాలు చేస్తాడు… సాహసిస్తాడు… కానీ రవి బస్రూర్ పెద్దగా ప్రయోగాల జోలికి పోడు… విరూపాక్ష, మంగళవారం సినిమాలకు అజనీష్ బీజీఎం ప్రాణంగా నిలిచింది… హొంబలె ప్రొడక్షన్స్ వారి మరో భారీ సినిమా బఘీరాకు తనే సంగీత దర్శకుడు… కన్నడ వాళ్లు వచ్చేస్తున్నారు, తమిళవాళ్లు మొదటి నుంచీ ఉన్నారు… మరి తెలుగులో…? దేవిశ్రీప్రసాద్, తమన్ డేట్లు పెద్ద సినిమాలకే దొరకడం కష్టంగా ఉంది… ఈమధ్య భీమ్స్ కొన్ని హిట్ సినిమాలు చేశాడు… తను పర్లేదు, కెరీర్ రాను రాను ఊపులో సాగిపోతుంది గ్యారంటీ…
Ads
చిన్న చిన్న సినిమాలే అయినా శ్రీచరణ్ పాకాల కూడా పర్లేదు… లబ్దప్రసిద్ధుడు మణిశర్మకు కన్నప్ప సినిమా ఒక్కటే చేతిలో ఉన్నట్టుంది ప్రస్తుతం… ఆస్కార్ సహా అనేకానేక అవార్డులు పొందిన కీరవాణి మరీ జయమ్మ పంచాయతీ, చంద్రముఖి-2 వంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో తనకే తెలియాలి… ప్రస్తుతం తను వర్క్ చేస్తున్న పెద్ద సినిమా ఏదీ లేనట్టుంది… అదోరకం ధోరణి తనది… వచ్చే ఏడాది హరిహరవీరమల్లు చేయాల్సి ఉంది కావచ్చు…
సంతోష్ నారాయణ్ అలియాస్ సంతోష్ నారాయణన్ … తను కూడా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్… ‘దసరా’ తో తెలుగులో కూడా అడుగుపెట్టాడు… వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందే ‘సైంధవ్’, ప్రభాస్ హీరోగా రూపొందే ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలకు కూడా ఈయనే సంగీత దర్శకుడు… శ్యామ్ సింగరాయ్ చేసిన మిక్కీ జే మేయర్‌కు ప్రస్తుతం రెండుమూడు సినిమాలు చేతిలో ఉన్నా సరే, పెద్ద సినిమాలేవీ లేవు… సో, కన్నడ, తమిళ మ్యూజిషియన్సే కాదు, అవసరమైతే మలయాళ, హిందీ సంగీత దర్శకులనూ తెలుగు ఇండస్ట్రీ పిలిపించుకోవాల్సి ఉంటుందన్నమాట… ఇది ఓ స్థూల పరిశీలన మాత్రమే, మరీ లోతుకు వెళ్లి ఆలాపనలు, శృతులు ‘చించుకున్నదేమీ’ కాదు…
Share this Article