విరాటపర్వం సినిమాకు ఏడో రోజు, పన్నెండోరోజు కలెక్షన్ 4 లక్షలు… అంటే ఒక ప్రెస్‌మీట్‌లో పెట్టే స్నాక్స్ ఖర్చంత కూడా రికవరీ లేదు… ఆహా ఓహో అని సోషల్ మీడియా నిండా పొగడ్తలు, చప్పట్లు… తీరా చూస్తే ఇవీ కలెక్షన్లు… కొండా సినిమా ఫట్… ఆ వర్మ సినిమాకు అంతకుమించి సీన్ లేదు, ఉండదు… మొన్న ఒకేరోజు ఏడెనిమిది సినిమాలు రిలీజైతే అన్నీ గాలిబుడగల్లాగే ఫట్‌మని పేలిపోయాయి… ఎఫ్3, సర్కారువారిపాట చచ్చీచెడీ కష్టమ్మీద గట్టెక్కాయి… కారణం..?
నిజంగా సినిమాల మీద ప్రేక్షకుడికి ఆసక్తి లేక కాదు, నాలుగు డబ్బులు ఖర్చుపెట్టలేక కూడా కాదు… ప్రేక్షకుడు భరించే స్థాయిని దాటి థియేటర్లు దోపిడీ చేయడం ప్రధాన కారణం… చిన్నాచితకా సినిమాలు ఎలా ఉన్నా సరే జనం చూడటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రప్పించేందుకు థియేటర్లే రెడీగా లేవు… మెల్లిమెల్లిగా థియేటర్ సూసైడ్ చేసుకుంటోంది… టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ ఫీజు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కాగా… ట్రాఫిక్, పొల్యూషన్, థియేటర్ వరకూ చేరుకునే ఖర్చు, టైమ్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్… నిర్మాతలు ఎన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ చేపట్టినా సరే, జనం మునుపటిలా థియేటర్‌కు రారు, రారు…
చూస్తారు, సినిమాల్ని ప్రేక్షకులు తప్పక చూస్తారు… థియేటర్‌కు వచ్చి మరీ చూస్తారు… ఎప్పుడు..? మౌత్ టాక్ బాగుండి, పర్లేదు, డబ్బు ఖర్చయినా సరే అనుకున్నప్పుడు ప్రేక్షకుడు థియేటర్ వెళ్లేందుకు సాహసిస్తున్నాడు… కరోనా అనంతర కాలంలో బంగార్రాజు, అఖండలు నడవలేదా..? ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్ కుమ్మేశాయి కదా… చిన్న సినిమాలే తీసుకుందాం… ఈమధ్యకాలంలో డీజే టిల్లు సైలెంట్ హిట్… తక్కువ ఖర్చు, పటాటోపాలు, అట్టహాసాలు లేకుండా వచ్చాడు… అదరగొట్టేశాడు…
Ads
మరో సూపర్ హిట్ మేజర్… దాని ఖర్చు తక్కువే… రికవరీ చాలా ఎక్కువ… అడివి శేషును నిలబెట్టింది సినిమా… అవునూ, మహేశ్‌బాబు ఏదో సినిమాను ఇంత చౌకగా వర్కవుట్ చేస్తాడు, మరి తను సినిమాకు ఎందుకంత ఖర్చు..? ఎందుకంటే… వ్యాపారం… డబ్బు… ఆ ఖర్చులో అధికవాటా తన రెమ్యునరేషనే… ఇంకా చెప్పాలంటే… చిన్న సినిమాలను జనం ఆదరిస్తూనే ఉన్నారు… కన్నడ చార్లి ఇంకా నడుస్తోంది… డాన్ తన పెట్టుబడి ఖర్చు వసూలు చేసుకుంది… అదేదో విష్వక్సేనుడి సినిమా పర్లేదు… బాగానే నడిచింది, కాకపోతే పెద్ద సినిమాలు వచ్చేసి, థియేటర్ల నుంచి పీకేశారు…
మరీ చూడాలి అనుకుంటేనే థియేటర్ వైపు అడుగులు పడుతున్నాయి… అంతే… సాదాసీదా సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసి, పండుగ చేసుకునే రోజులు పోయాయి… టికెట్ రేట్లు తగ్గించాం అని ప్రకటనలు చేసుకుంటున్నా సరే, అవీ ఎక్కువే… సో, ఓటీటీల మీద ఏడవడం దండుగ… ప్రేక్షకుడికి అదో అదనపు ఆప్షన్… అంతే…
కాదు, అంతేకాదు… సినిమా కంటెంట్ మారాలి, ప్రజెంటేషన్ మారాలి… సన్నాఫ్ ఇండియాలాగా ప్రేక్షకుల మీదకు వదులుతాం అనుకుంటే ప్రేక్షకులేమైనా పిచ్చోళ్లా..? అంతటి ఆచార్యనే ఛీపో అనేశారు… ఇంకా చేదు ఫలితాల్ని చవిచూడటానికి తెలుగు థియేటర్ రెడీగా ఉండాలి… స్వయంకృతమే..!! అక్కడెక్కడో పక్కా కమర్షియల్ సినిమాకు 25 బెనిఫిట్ షోలు వేస్తుంటే దేకినోడు లేడట… ఎస్, గోపీచంద్ అయితేనేం, మారుతి అయితేనేం… ఈ తొక్కలో పాత చింతకాయతొక్కు వాసన ఎవడిక్కావాలి…!?
Share this Article