.
డీజే టిల్లూ సినిమా ఓ సెన్సేషనల్ హిట్… జొన్నలగడ్డ సిద్ధును నిలబెట్టింది… టిల్లూ స్క్వేర్ దాన్ని పదిలం చేసింది… కానీ తరువాత వచ్చిన జాక్ ఫటేల్‌మంది…
తనను ఆ టిల్లూ మార్క్ హ్యాంగోవర్ నుంచి బయటికి తీసుకురావడానికి, జాక్ వైఫల్యం తుడిచేయడానికి తనకు ఓ సినిమా కావాలి… ఓ మహిళా దర్శకురాలు నీరజ కోన చెప్పిన ‘తెలుసు కదా’ కథకు తలూపాడు… పైగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి… కమెడియన్ హర్ష చెముడుకు మంచి ప్రాధాన్యం ఇచ్చినట్టు ప్రెస్ మీట్లలో వెల్లడి…
Ads
కొత్త కథ… దీంతో కాస్త ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి… అఫ్‌కోర్స్, ఏదో మీడియా మీట్‌లో మీరు కూడా మీ నిజజీవితంలో వుమెనైజరా అనే ఓ మీడియా పిచ్చి ప్రశ్న తాలూకు వివాదం, సిద్ధు రుసరుస కూడా సినిమాకు ఇంకాస్త పబ్లిసిటీని ఇచ్చినట్టుంది…
థమన్ సంగీతం కూడా ఓ ఇంట్రస్టింగ్ పాయింట్… ఇదొక రొమాంటిక్ డ్రామా… రిలేషన్‌షిప్స్ డ్రామా… ఈ కథ వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) జీవిత లక్ష్యాలు, అతని వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంది, ఒక బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకున్నాక అతని జీవితంలోకి మాజీ ప్రియురాలు తిరిగి రావడం వలన ఏర్పడే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది…
స్టోరీ లైన్ వరకూ వోకే… భార్య, మాజీ ప్రేయసి… ఓ సంఘర్షణ… అయితే ఆశించినంతగా దర్శకురాలి నుంచి అంత ఇంప్రెసివ్ ప్రజెంటేషన్ కనిపించలేదు…
నో డౌట్… సిద్ధు జొన్నలగడ్డ వరుణ్ పాత్రలో మెరిశాడు… సినిమాను మోసింది ప్రధానంగా తనే… మొదటి సన్నివేశం నుండే అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలోని చాలా సన్నివేశాలను నిలబెట్టింది… కొన్ని ముఖ్యమైన ఎమోషనల్ సన్నివేశాలను కూడా అతను మెప్పించేలా చేశాడు…
రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి అందంగా ఉన్నారు, తమ తమ పాత్రలకు సరిపోయారు, న్యాయం చేశారు, కానీ థియేటర్ నుండి బయటకు వచ్చాక గుర్తుంచుకోదగిన ఒక్క సన్నివేశం కానీ వారి పాత్రల్లో లేదు… వారి నటన నీట్‌గా ఉన్నప్పటికీ, ఆ పాత్రల కేరక్టరైజేషన్ కారణంగా ఆ పాత్రలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాయి…
చెప్పుకోవాల్సింది సపోర్టింగ్ రోల్‌లో హర్ష చెముడు… అతని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ కొన్ని సన్నివేశాలకు కొత్త శక్తినిచ్చాయి… అతని పాత్రకు ప్రాధాన్యం ఉంది, తను సరిగ్గా వాడుకున్నాడు… సినిమాకు తను కూడా ఒక ప్లస్ పాయింట్…
దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన, ఒక సాధారణ, పాత కథాంశాన్ని తీసుకుని, హీరో వైఖరి, రిలేషన్‌షిప్స్ లోని చిన్నపాటి క్లిష్టతతో కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించింది… కొత్త తరం ప్రేక్షకులకు వోకే అనిపించవచ్చుగాక, అందరూ ఈ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తారనేది ప్రశ్న…
మొదటి భాగం సిద్ధు పాత్ర, అతని పర్సనాలిటీ, బ్రేకప్, పెళ్లి, ఆ తర్వాత జీవితాన్ని చక్కగా పరిచయం చేసింది… సినిమాను ఆసక్తికరంగా ఉంచడంలో ఆప్ట్ సంభాషణలు పనిచేశాయి… అయితే, కథానాయకుడు ఎదుర్కొనే ప్రతి సంఘర్షణ కృత్రిమంగా, బలవంతంగా ఉన్నట్టు అనిపించింది… ఉదాహరణకు, శ్రీనిధి శెట్టి పాత్ర హీరో ఇంట్లో ఉండడానికి చెప్పే కారణం…
మొదటి భాగంలోని రెండు పాటలు బాగున్నాయి.., నీట్‌గా చిత్రీకరించబడ్డాయి… ఎటొచ్చీ రెండో భాగమే సమస్య… అందులోనే ప్రధాన సంఘర్షణ… రాశి ఖన్నా పాత్ర తీసుకునే కీలక నిర్ణయం… ఈ మలుపు అకస్మాత్తుగా, నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తుంది… సరైన డ్రామా లేదా భావోద్వేగం లేకపోవడంతో, ఆ తరువాత వచ్చే హీరో- హీరోయిన్ల సంభాషణలు, రెండు పాత్రల మధ్య చర్చలు కూడా యాంత్రికంగా అనిపిస్తాయి…
మధ్యలో వచ్చే ఫ్యామిలీ ఫంక్షన్ కామెడీ సన్నివేశాలు అసహజంగా ఉండి, సినిమా టోన్‌కు భంగం కలిగించాయి… ముఖ్యంగా క్లైమాక్స్‌లో, సిద్ధు పాత్ర తండ్రి కావాలనే తన కలను చేరుకున్నప్పటికీ, అక్కడ ఎలాంటి నిజమైన భావోద్వేగం కలగకపోవడం, ఈ రిలేషన్‌షిప్ డ్రామాలో కృత్రిమత్వాన్ని తెలియజేస్తుంది… ఇక్కడే దర్శకురాలికి ఈ సంబంధాల తాలూకు లోతును చూపించడంలో అనుభవం, ఒప్పించే శక్తి కొరవడింది…
చివరగా… సినిమా జస్ట్ వోకే… ఐతే అందరికీ నచ్చకపోవచ్చు…
Share this Article