.
ప్రతి ప్రతిష్ఠాత్మక క్రికెట్ ఈవెంట్‌లోనూ… గెలుపు ముంగిట బోల్తాపడటం దక్షిణాఫ్రికా జట్టుకు ఓ విషాదం… బాగా ఆడుతుంది, చివరో చతికిలపడుతుంది… దాని దురదృష్టం…
అదుగో దాన్ని బ్రేక్ చేశాడు టెంబా బావుమా… ఆ జట్టు కెప్టెన్… అదొక్కటేనా..? కాదు, చాలా ఉన్నాయి… 27 ఏళ్ల తరువాత టెస్టు క్రికెట్ చాంపియన్‌షిప్ గదను సగర్వంగా దక్షిణాఫ్రికాకు దక్కేలా చేశాడు…
Ads
అంతేనా..? కాదు… వర్ణవివక్షకు క్రూరమైన చాంపియన్‌గా ప్రపంచంలోనే పెద్ద పేరున్న దేశ జట్టుకు ఓ నల్లజాతీయుడు కెప్టెన్ కావడమే కాదు, ఆ తెల్ల కెప్టెన్లకు చేతకాని కప్పును సాధించిపెట్టాడు… ప్రతిభ ఎవడి సొత్తు తలెగరేశాడు…
ఇంకా..? తను చిన్నప్పటి నుంచీ కలలు గన్న క్రికెట్ మక్కా లార్డ్స్ స్టేడియంలోనే ఓ గొప్ప విజయాన్ని దక్కించుకున్నాడు… చాలామందికి అందులో మ్యాచ్ చూడటమే ఓ కల… అందులో ఆడటం మరో పెద్ద కల… అక్కడ ఆ స్టేడియం ఉన్న గడ్డ మీద టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్ గెలిచిపెట్టడం ఇంకా పెద్ద పెద్ద పెద్ద కల… దాన్ని నెరవేర్చుకున్నాడు…
ఇంకేమీ లేదా..? ఉంది… తను ఈ స్థాయి దాకా రావడానికి ఎంత వివక్షను, ఎన్ని అవమానాల్ని భరించాడో… నిశ్శబ్దంగా, భరిస్తూ, ఎదుగుతూ, సాన పెట్టుకుంటూ వచ్చాడు… చేతలే ప్రతి అవమానానికీ సమాధానం అనే భావన నిజంగా ఎంత గొప్పది… అదీ బావుమా ఈ లోకానికి చూపించాడు…
కెప్టెన్ కాగానే తనపై బోలెడు విమర్శలు, వెక్కిరింపులు… ప్రత్యేకించి బాడీ షేమింగ్… తను పొట్టి, తన దేహం నలుపు… మొహం మీదే ఈసడింపులు… ఒక్కసారిగా అందరికీ అద్భుతమైన జవాబు ఇచ్చాడు.,. ఎత్తు, వర్ణం కాదురా, గుండెలో దమ్ముండాలి, బుర్రలో సరుకుండాలి అని చెప్పాడు… గ్రేట్…
అందుకే, తను చాలా నెగెటివ్ ధోరణులను బ్రేక్ చేశాడు… అందుకే ఈ విజయం తన వ్యక్తిగతం కాదు.., వివక్షల మీద, వెక్కిరింపుల మీద విజయం… దీన్నిలాగే చూడాలి… తనొక్కడిదే కాదు కదా, జట్టు విజయం అంటారా..? అదీ నిజమే… కానీ ఒక కెప్టెన్‌గా తన విజయం కూడా ప్రధానమే, విశేషమే…
తను కెప్టెన్‌గా ఆడిందే పది మ్యాచులు… 9 గెలుపు, ఒకటి డ్రా లేదా టై… ఇప్పుడు ఈ విజయం… మన కోహ్లీలు, మన రోహిత్ శర్మలు, మన ధోనీలు కలలు గనాల్సిన గెలుపు ఇది… మొన్నటి ఆర్సీబీ గెలుపు అనంతరం తొక్కిసలాటలు, మరణాలు గట్రా దుర్లక్షణాలు, దుష్ప్రభావాలు చూశాం కదా… ఈ టెస్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ గెలిచిన వెంటనే బావుమా గ్రౌండ్‌లోకి పరుగెత్తుకు రాలేదు…
ఎగరలేదు, అరవలేదు… లార్డ్స్ స్టేడియం బాల్కనీలో కదలకుండా అలాగే నిలుచుండి పోయి, తలను చేతుల్లో దాచుకుని, కాసేపు అలా ఉండిపోయాడు… అవ్యక్తమైన అనుభూతి, ఆ క్షణం తనలో తాను లీనమైపోయి… జస్ట్, ఈ ఒక్క గెలుపు గురించి కాదు… ఏళ్ల తరబడీ తన త్యాగాలు, ఒత్తిడి, వివక్ష, అడ్డంకులు… తన దేశ జట్టు దీర్ఘకాల, బాధాకరమైన నిరీక్షణ… అన్నీ ఆ క్షణం ముప్పిరిగొని మాట రాని క్షణం…
పోస్ట్- మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ…, తాను అనుభవించిన భావోద్వేగాల లోతు గురించి బావుమా వివరించాడు… గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలను — ప్రధాన టోర్నమెంట్‌లలో సౌత్ ఆఫ్రికాకు తగిలిన గుండెపోటులు నుండి కెప్టెన్‌గా తనపై ఉంచిన అపారమైన అంచనాల వరకు… ఈ గెలుపు క్షణంలో తాను ఒక్కసారి మానసికంగా తన ప్రయాణాన్ని తిరిగి చూసుకున్నానని అంగీకరించాడు…
చాలా పరిపక్వతతో, చాలా వినమ్రతతో… అణకువతో… ‘‘ఈ గర్వం నాది మాత్రమే కాదు — ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది, మా భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుంది’’ అన్నాడు… ‘‘సౌత్ ఆఫ్రికా కెప్టెన్‌గా ఉండటం సులభం కాదు. ఎన్నో త్యాగాలు, ఎన్నో నిరాశల నడుమ ఓ మంచి గెలుపు కోసం నిరీక్షణ… ఈ గెలుపును స్వీకరించడానికి, నమ్మడానికి, గుర్తించడానికి ఆ క్షణం ఆ నిశ్శబ్దం…’’
ఇక్కడ పాకిస్థాన్ క్రికెటర్ల గురించీ ఓ మాట చెప్పాలి… ఆమధ్య ఏదో మ్యాచులో బావుమా రనవుట్ అయ్యాడు… దాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో పాకిస్థానీ ప్లేయర్లు తనను కించపరుస్తూ చిల్లరగా బిహేవ్ చేశారు… ఆ వీడియో బిట్ జతచేసి నెటిజనం పాకిస్తాన్ క్రికెటర్లను తూర్పారబడుతూ పోస్టులు పెడుతున్నారు… నిన్నంతా అవే వైరల్… అవును, పాకిస్థానీ క్రికెటర్ల చిల్లరతనం కొత్తదేమీ కాదు కదా, కాకపోతే తిట్టడానికి మరో సందర్భం…
Share this Article