.
ఒక పోస్టు కనిపించింది… లోకేష్‌కు చేరేవరకూ షేర్ చేయండి అట… ఈ సమస్యకు లోకేష్ ఏం చేయగలడు పాపం..? కొన్ని మన మైండ్ సెట్స్ అవి…
విషయం ఏమిటంటే..? గుంటూరు వార్త… ఆంధ్రజ్యోతిలో ఉంది… జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ఐఎఫ్ఎస్ అధికారి… (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) … పేరు రమేష్ కుమార్ సుమన్… 59 ఏళ్లు… ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులో ఉన్నాడు…
Ads
మంగళగిరి సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు… ఏపీ సర్వీస్ కదా… జీవితమంతా ఫారెస్ట్ విభాగంలోనే చేశాడు… (చాలామంది ఐఎఫ్ఎస్ అధికారులు ఇతర విభాగాల్లో పనిచేస్తుంటారు…) ఈమధ్యే కొచ్చిలో అటవీ అభివృద్ధి, జీవ వైవిధ్య పార్కులకు సంబంధించిన శిక్షణకు కూడా వెళ్లొచ్చాడు…
శిక్షణలో ఉన్నప్పుడే ఈనెల 16న గుండెపోటుతో మరణించాడు… దురదృష్టం… ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మరణం పట్ల సంతాపాన్ని ట్వీట్ చేశాడు… కొచ్చి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు… కానీ ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని నా ఇంటికి మాత్రం తీసుకురావద్దని కరాఖండీగా చెప్పేశాడు… ఆయన ఎంతటి వాడైతే నాకేంటి..? ఇదీ ఆయన మాట…
ఏం చేయాలి..? విధిలేక అటవీ అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడ ఉంచారు… కుటుంబసభ్యులను, బంధువులను, అటవీ సిబ్బంది కూడా అక్కడికే వచ్చారు… తరువాత అంత్యక్రియలకు అక్కడి నుంచే తరలించారు… ఈ ఘటన కుటుంబసభ్యులను, బంధుగణం, అటవీ సిబ్బందిని తీవ్ర వేదనకు గురిచేసిందనేది వార్త…
నిజానికి ఇది ఒక్క గుంటూరులోనే కాదు… అన్నిచోట్లా ఉన్నదే… హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో అద్దెదారులందరూ ఎదుర్కునే సమస్యే ఇది… హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని రానివ్వరు… ఇండిపెండెంట్ ఇళ్లే కాదు, అపార్ట్‌మెంట్లలోనూ…
ఒకవేళ ఫ్లాట్ యజమాని అంగీకరించినా సరే, అపార్టమెంట్ అసోసియేషన్లు కూడా అంగీకరించవు… మైల భయం… పార్కింగ్ ప్లేసులో శవాన్ని ఉంచి, అక్కడి నుంచి స్మశానానికి తీసుకుపోతాం, శుద్ధి చేయించి పార్కింగ్ ఏరియాలో పెయింటింగ్ కూడా చేయిస్తామని చెప్పినా వినిపించుకోవు కొన్ని అసోసియేషన్లు…
ఇలాంటి సందర్భాల్లో చాలామంది కుటుంబసభ్యులు, బంధువులు వచ్చేవరకు హాస్పిటళ్ల మార్చురీల్లోనే ఉంచి, అక్కడి నుంచి నేరుగా స్మశానానికి తీసుకుపోతుంటారు… ఇంత అమానవీయమా అనే ప్రశ్నకు జవాబు మన మైండ్ సెట్… ఇతర ఫ్లాట్ల ఓనర్లు అభ్యంతరం చెబితే మనమూ ఏమీ చేయలేం…
ఒకవేళ ఇండిపెండెంట్ ఇళ్లయినా సరే, ఇతర పోర్షన్ల వాళ్లు అంగీకరించరు… గేటు ముందు టెంట్ వేయనివ్వరు… శవస్నానం, అంతిమ నివాళి, అలంకరణ, అంతిమయాత్ర వంటి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కుదరదు అని చెప్పేస్తుంటారు… పొరపాటున ఏ పంతులో ఇది అరిష్టం, ఆ ఇల్లు కొన్నాళ్లు ఖాళీగా ఉంచాలని చెబితే..? ఇవీ భయాలు, చిక్కులు…
అవును, అందుకే ఆ ఇంటి యజమాని చెప్పినట్టు… ‘‘ఆయన ఎంతటి వాడయితేనేం…?’’ మనిషి నమ్మకాలు, భయాల ఎదుట ఏ వాదనలూ నిలవడం లేదు, అది కదా అసలు సమస్య..!!
Share this Article