హమ్మయ్య… క్లారిటీ వచ్చింది… ఇన్నేళ్లూ పెద్ద పెద్ద క్రైమ్ ఇన్విస్టిగేటర్లకు, జడ్జిలకు, లాయర్లకు, సోషియాలజిస్టులకు, సైకాలజిస్టులకు, జర్నలిస్టులకు, ఎట్సెట్రా అందరికీ ఓ పెద్ద ప్రశ్న… ఆడవాళ్లపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో ఓపట్టాన బోధపడకపోయేది… కొందరు చిల్లరగాళ్లు ఆడవాళ్ల వస్త్రధారణే సమస్య అన్నారు, మరి చిన్నపిల్లల మీద, ముసలోళ్లు మీద అత్యాచారాల మాటేమిట్రా అనడిగితే నోళ్లు మూతపడ్డాయి…
సాహిత్యం, సినిమాలు, టీవీలు గట్రా కారణమని బల్లలు గుద్ది మరీ చెప్పారు కొందరు… నో, నో, చట్టాలు కఠినంగా లేకపోవడమే కారణమన్నారు కొందరు… అరబ్ కంట్రీల్లో ఉండే కఠిన శిక్షవిధానం అమలు చేస్తే బెటర్ అన్నారు కొందరు… సహజంగానే మనుషుల్లో రాక్షస ప్రవృత్తి పెరుగుతోందనీ, అత్యాచారాలకు అదే ప్రధాన కారణమన్నారు కొందరు… కొందరు మహా బుద్ధిమంతులైతే ‘స్త్రీ బుద్ధి ప్రళయాంతకం, సకల అత్యాచారాలకు ఆమె ధోరణే కారణం’ అని తీర్మానించేశారు… తెలివి మరీ ఎక్కువై మత్తడి దూకుతున్న బాపతు బ్యాచ్…
కానీ అవేవీ కరెక్ట్ కాదనీ… అసలు అత్యాచారాలకు ప్రధాన బాధ్యులు బాధితుల తల్లులేనట… ఎవరో కాదు, శ్రీమాన్ జగన్ అమాత్యవర్గంలోని అత్యంత కీలక హోం శాఖ మంత్రిణి తానేటి వనిత వ్యాఖ్యానించిందట… అవునండీ, ఆంధ్రజ్యోతిలో అలాగే రాశారు… వాళ్లు సరిగ్గానే రాశారు అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్… గ్రేట్ జగన్… సరైన మంత్రి పదవులకు సరైన వ్యక్తులను ఎంపిక చేసుకున్నావ్… నువ్వు సూపర్…
Ads
‘‘పసిపిల్లలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఒక మహిళగా, తల్లిగా ఆ మాటలు వింటేనే భయపడాల్సి వస్తోంది… బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే… తల్లి పాత్ర సక్రమంగా నిర్వర్తిస్తే అఘాయిత్యాలు తగ్గుతాయి… తల్లి పాత్ర సరిగ్గా లేనప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి… అప్పుడు పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’’ అని ఆమె చెప్పిందట… గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రజలారా …
ప్లీజ్, జగన్ సార్, మీ హోం మంత్రి చెబుతోంది కదాని… అర్జెంటుగా మీ దిశ చట్టాన్ని మార్చేసి, ప్రతి అఘాయిత్యం, లైంగికదాడి, అత్యాచారం కేసుల్లో నిందితుల జాబితాలో తల్లులను చేర్చేయకండి ప్లీజ్… మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్… తన బిడ్డపై అఘాయిత్యాన్ని ఏ తల్లీ కోరుకోదు సార్… మరీ అనుమానముంటే మీ పీకేను అడగండి… పోనీ, ప్రతి అఘాయిత్యానికీ ప్రధాన కారణం గతంలో పాలించిన తెలుగుదేశమేనని ముద్ర వేయండి పర్లేదు… మరీ అవసరమైతే ప్రతి అఘాయిత్యానికీ పాత తెలుగుదేశం పాలనే కారణం కాబట్టి చంద్రబాబు అక్యూస్డ్ జాబితాలో చేర్చేసి, విచారించండి… అంతేగానీ, దయచేసి, తల్లుల్ని వదిలేద్దాం సార్…
Share this Article