అమెరికాలో ఉన్నాను కదా… అమెరికాలోని వార్తే ఒకటి కనిపించింది… మనవాళ్లదే.,. విషయం ఏమిటంటే..? ఉత్తర టెక్సాస్‌లో పోలీసులు కోడిపందేల రాకెట్ ఒకటి బ్రేక్ చేశారు… వేలాది డాలర్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు… ఇదీ వార్త… వివరాల్లోకి వెళ్లాలంటే…
అక్కడ నవరో అనే ఓ కౌంటీ ఉంది… పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు… ఓచోట కోడిపందేలు సాగుతున్నయ్… అక్కడ ఫైటింగ్ రింగ్, బతికున్న కోళ్లు, చచ్చిపడున్న కోళ్లు, డాలర్లు, ఇతర ఆధారాలు కనిపించాయి… పోలీసులు ఏం చెబుతున్నారంటే… ‘42 స్టేట్స్లో కూడా కాక్ ఫైటింగ్ ఓ సీరియస్ క్రైమ్, జరిమానా మాత్రమే కాదు, జైలుశిక్షలూ వర్తిస్తాయి… అంతేకాదు, వాటిని చూడటం కూడా క్లాస్ సి దుష్ప్రవర్తన’’…
మన దగ్గర పోలీసులు కోడిపందేలు, పేకాట శిబిరాలు, వ్యభిచార రాకెట్లకు సంబంధించి కేసులు నమోదు చేసినప్పుడు సంబంధిత ఆధారాల ఫోటోలు విడుదల చేస్తారు కదా, సేమ్, అలాగే ఇక్కడి పోలీసులు కూడా ఈ ఫోటోల్ని వదిలారు… కోడికత్తులు, ఫైటింగ్ రింగ్, డాలర్లు ఎట్సెట్రా ఉన్నయ్ ఫోటోల్లో క్లియర్‌గా…
Ads
‘‘ఇది క్రూరం, నెత్తుటి క్రీడ’’… ఇదీ పోలీసుల మాట… మన రాష్ట్రాల్లో సంక్రాంతికే ఈ పందేలు, కానీ అమెరికాలో ఎప్పుడు వీలుంటే అప్పుడే… ఇక విషయంలోకి వస్తే… మనవాళ్లు ఎక్కడికి పోయినా సరే, ఆ సినిమా నటుల మూఢభక్తి వదలరు, కులపైత్యం వదలరు… రాజకీయ అనుబంధాలు వదలరు… చివరకు ఈ కోడి పందేల వంటివీ వదలడం లేదు… అసలు మన తెలుగు రాష్ట్రాల్లోనే అది నేరం… సరే, కాకపోతే పోలీసులు చాలాచోట్ల చూసీచూడనట్లు వదిలేస్తారు, అదేమంటే సంస్కృతి అనే పడికట్టు పదం ఉండనే ఉంది కదా…
బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అనేది చాన్నాళ్లుగా పాతబడిపోయిన ఓ సామెత… అంటే రోమ్‌లో రోమన్‌లాగే ఉండాలి అని..! నథింగ్ డూయింగ్, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మేం టిపికల్ తెలుగు వాళ్లలాగే ఉంటాం అంటారు మనవాళ్లు… ఇలా దొరికిపోతుంటారు… బీ ఏ రోమన్ అంటే ఫుడ్డు, డ్రెస్సింగ్, కల్చర్ ఎట్సెట్రా మాత్రమే కాదు… అక్కడి చట్టాల్ని గౌరవించాలి అని..! అక్కడి సంస్కృతిని గౌరవించాలి అని..!
అబ్బే, అవన్నీ మనకు ఎందుకండీ… థియేటర్లలో సీట్లు చింపేయాలి, కాగితం ముక్కలు గాలిలోకి విసిరేయాలి, కార్ల ర్యాలీ తీయాలి, అరుపులు- కేకలతో హంగామా క్రియేట్ చేయాలి, లేకపోతే మన సంస్కృతి ఏమైపోను..? అంతేనా..? మన తెలుగు రాష్ట్రాల్లోని మన ప్రతి పైత్యాన్ని ఇక్కడికి తీసుకురావల్సిందే అంటారా..? రికార్డింగ్ డాన్సుల క్యాంపులు, పేకాట క్యాంపులు, ఇంకా ఏమేమో యవ్వారాలు గట్రా… ఏమో… ఇలాగే దొరికిపోయి జైలుకు పోవాలనుకుంటే మీ ఇష్టం..!!
Share this Article