రోగికి కోరిందీ అదే… వైద్యుడు ఇచ్చిన మందూ అదే… ! ఈ దిక్కుమాలిన మహావికాస్ అఘాడి కూటమిని ఎప్పుడు వదిలేద్దామా అని శివసేన చీఫ్ ఠాక్రే ఎదురు చూస్తున్నాడు… రాహుల్ పక్కనున్న జైరాంరమేష్ వంటి మేధావులు ఠాక్రేను ఎప్పుడూ నిరాశపరచరు… రాహుల్‌కు ఏమీ తెలియదు… సొంత పరిజ్ఞానం లేదు… జైరాంరమేష్ వంటి నేతలు తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు…
గత ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు శివసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా వోట్లేశారు… కానీ రాహుల్‌కు జైరాంరమేష్ ఎలాగో శివసేనకు సంజయ్ రౌత్ అనే మేధావి ఉన్నాడు… ఠాక్రే భార్య రష్మికి తన భర్త ముఖ్యమంత్రి కావాల్సిందేనని పట్టు… ఇంకేముంది..? ఈ సంజయ్ రాయబేరాలు నడిపి, బీజేపీని కత్తిరించి, ఎన్సీపీని పట్టుకొచ్చి, కాంగ్రెస్‌తో జత కట్టించి, ఓ అవసరార్థ కూటమిని నిర్మించి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయించాడు…
సరే, బీజేపీ ఓ షిండేను పట్టుకుని, ఆ కూటమి వెన్నువిరిచింది… కాదు, ఏకంగా శివసేనకే ఎసరు పెట్టింది… ఈ దెబ్బకు శివసేన ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు… అధికారం లేనప్పుడు వాళ్లకు ఆ అడ్డమైన కూటమి దేనికి..? పైగా శివసేన కేడర్ ఠాక్రే తీసుకున్న యాంటీ-హిందూ పోకడను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు… తన వోట్లన్నీ ప్రొహిందూ… ఎప్పుడైతే కాంగ్రెస్‌తో, ఎన్సీపీతో కలిశాడో, ఇక ఆ వోట్లన్నీ షిండే వైపు టర్న్ అవుతాయి… అంటే రాను రాను ఒరిజినల్ శివసేనకు, ఠాక్రే రాజకీయ జీవితానికి ముప్పు…
Ads
సావర్కర్ మీద ఎడాపెడా విమర్శలు చేయించిన జైరాంరమేష్ శల్యుడి పాత్రను భలే పోషిస్తున్నాను సుమీ అని ఆనందంగా బ్రేవ్ అంటున్నాడు… రాహుల్ గాంధీ ఏ ఆలోచన లేకుండా జనం ముందుకు వచ్చేసి చెప్పేస్తున్నాడు… ఎప్పుడైతే సావర్కర్ మీద నెగెటివ్ వ్యాఖ్యలు చేశాడో, ఠాక్రేకే ఓ సాకు దొరికింది… ఛస్, ఈ చెత్తా కూటమి నుంచి బయటికి వచ్చేస్తానంటూ సంకేతాలు వదిలాడు…
నిజానికి తను మళ్లీ బీజేపీతో సయోధ్య కోరుకుంటున్నాడు… కానీ షిండే కుదరనివ్వడు… అది మాట్లాడుకున్నాకే బీజేపీతో జతకలిశాడు తను… అందుకే ఠాక్రేకు దిక్కుతోచడం లేదు… జైలు నుంచి బయటికి వచ్చాక సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలే ఠాక్రే పరిస్థితికి అద్దం పడుతున్నయ్… ‘‘ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు… ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల్ని కలుస్తాను’’… పాత టెంపర్ లేదు, తల ఎగరేయడం లేదు…
ఇవన్నీ కాదని సొంతంగా పార్టీ పటిష్టం మీద దృష్టి పెట్టాలని ఠాక్రే అనుకున్నా సరే, జనం నమ్మేట్టు లేదు… బీజేపీని తొక్కేసి, మోసగించి, కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని వాళ్లు ఇప్పట్లో మరిచిపోరు… షిండే వదలడు… ఈ స్థితిలో తమ అసలు బలమైన హిందుత్వనే ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు… ఉనికి కోసం తప్పదు… అక్కడ మమత బెనర్జీ వంటి అగ్గిపిడుగే ‘కాంప్రమైజ్’ స్థితికి వచ్చేసింది… హేమంత్ సోరెన్ దిక్కులు చూస్తున్నాడు… ఠాక్రే ఎంత..? అవునూ, సావర్కర్ గురించిన చర్చ ఇక్కడ అక్కరలేదు గానీ… రాహుల్ గాంధీ పార్టీకి ఈ వ్యాఖ్యలతో ఏమైనా ఫాయిదా ఉంటుందా..?
మహారాష్ట్రలో ఇప్పటికే కొడిగడుతోంది పార్టీ… ఎవరైనా బీజేపీని, శివసేనను ఇష్టపడని తటస్థులు ఉంటే వాళ్లనూ దూరం చేసుకోవడమే ఇది… భారత్ జోడో అంటే మద్దతునిచ్చే పార్టీలను కలుపుకుని వెళ్తూ… పాజిటివిటీని బిల్డ్ చేసుకోవాలి రాహుల్… అలా గాకుండా ఎక్కడికక్కడ కూటముల్ని ఇచ్చుకుపోయేలా చేసుకోవడం కాదు… ఇప్పటికే కేరళలో UDF లో మరో దుమారం మొదలైంది… అదైనా తెలుసా నీకు..?!
Share this Article