నాగచైతన్యను ఒక్క విషయానికి అభినందించొచ్చు… ‘‘తెలుగు హీరో అంటే తప్పనిసరిగా మాస్, కమర్షియల్, బిల్డప్పు, ఇమేజీ, ఫార్ములా విలువల్ని మాత్రమే ప్రేమించును’’ అనే పాయింట్ నుంచి బయటికి వచ్చి భిన్నంగా వ్యవహరిస్తున్నందుకు..! కథల ఎంపికలో ఎంతోకొంత శ్రద్ధను చూపిస్తున్నాడు… భిన్నత్వాన్ని అటెంప్ట్ చేస్తున్నాడు… థాంక్యూ అనే సినిమా కథ కూడా అంతే..! నిజానికి థర్డ్, ఫోర్త్ లేయర్ హీరోల సినిమాలకు కూడా రకరకాల మార్గాల్లో బోలెడంత హైప్ క్రియేట్ చేస్తుంటారు…
ఏ తెలుగు సినిమాకైనా మొదటి మూడు రోజులే కదా ప్రాణం… శుక్రవారం రిలీజ్ చేయాలి, శని ఆది వారాల్లో తాడోపేడో తేలిపోతుంది… కానీ ఈ సినిమాకు ఎందుకోగానీ అంత హడావుడి లేదు… దిల్ రాజు కూడా ప్రచారప్రియుడే… ఐనా దీనిమీద పెద్ద ఇంట్రస్టు ఏమీ చూపినట్టు లేడు…
పాటలు, ఫస్ట్ లుక్కులు, ట్రెయిలర్ల హంగామాలు పెద్దగా కనిపించలేదు… అడ్వాన్స్ బుకింగులు కూడా పెద్దగా లేవు… ఏవో కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కనిపించాయి పత్రికల్లో… అవి పెద్దగా ఎవడూ చదవడు… వెరసి చైతూ రేంజుకు ఇది లోప్రొఫైల్ రిలీజే… ఇందులో రాశిఖన్నా ఉంది, అవికా గౌర్ ఉంది… మాళవికా నాయర్ ఉంది… థమన్ మ్యూజిక్… పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ… దిల్ రాజు నిర్మాత… ఇష్క్, 24 వంటి సినిమాలు తీసిన విక్రమ్ దర్శకత్వం… చివరలో ప్రకాష్ రాజ్ కూడా వస్తాడు… ఓ భిన్నమైన కథ… ఇంకేం కావాలి…? సగం సక్సెస్ టీం కూర్పుతోనే దక్కి ఉండాలి కదా… కానీ జరగలేదు…
Ads
నిజానికి మంచి కథే… పలు సవాళ్లు, కష్టాల దశలు దాటి హీరో సక్సెస్‌ఫుల్ వాణిజ్యవేత్త అవుతాడు… అంతా తన ప్రతిభే అనుకుంటాడు… కానీ ఓ సంఘటనతో ఇదంతా తనవల్లే కాదనీ, తనకు ఏదోరకంగా సాయపడ్డవాళ్లు చాలామంది ఉన్నారని తెలుసుకుంటాడు… అందరికి కృతజ్ఞతలు చెప్పడానికి బయల్దేరతాడు… ఓదార్పు యాత్రలాగే ఇది ధన్యవాదయాత్ర అన్నమాట… ఆడేపాడే స్టూడెంట్ దశ నుంచి క్రమేపీ మెచ్యూరిటీ, సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీ దాకా… మూణ్నాలుగు దశల చైతూను చూపిస్తారు ఇందులో… ఆ వేరియేషన్స్‌ను చైతూ బాగానే చూపించగలిగాడు…
కథ బాగుంది, కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనిపిస్తుంది… అంటే ప్రేక్షకుడిని కనెక్ట్ చేయలేకపోయాడు… కథకన్నా కథనం ముఖ్యం కదా సినిమాకు… పాటలు, బీజీఎం బాగాలేవు, థమన్ ఎవరో అసిస్టెంటుకు బాధ్యతలు అప్పగించేసి ఉంటాడు బహుశా… చైతూ నటన పర్లేదు, వంకరహితమే… కానీ ఆ పాత్రకు తగినంతగా ఉందానేది మరో పెద్ద ప్రశ్న… రాశి, అవికాలను పక్కనపెడితే మాళవికా నాయర్ మాత్రం బాగుంది… అయితే సినిమాలో ఎక్కడా వినోదం జాడలు కనిపించవు…
ఫీల్ గుడ్ మూవీయే… కానీ ప్రేక్షకుడికి ఫీల్ గుడ్డా, కమర్షియలా, మాస్ యాక్షనా, ఊరమాస్ స్టోరీయా అవసరం లేదు… మీరు ఏ ముద్రయినా వేసుకొండి… వాడికి నచ్చాలి… ఏది కనెక్టవుతుందో ఎవడూ చెప్పలేడు… మాస్ చూస్తాడు, క్లాస్ చూస్తాడు… నిజానికి డీజే టిల్లు రేంజ్ ఎంత..? ఆచార్య రేంజ్ ఎక్కడ..? కానీ ఫలితం ఏమిటి..? గోపీచంద్‌లు, పోతినేని రాంలు అట్టర్ ఫ్లాప్, కానీ అడివి శేషు మేజర్ సూపర్ హిట్… థాంక్యూ సినిమాకు సంబంధించి ప్రజెంటేషన్‌లోనే తేడా కొట్టింది… సరే, దిల్ రాజుకు థాంక్యూ సినిమాలో ఏదో లోపించినట్టు ముందే అర్థమైనట్టుంది… అందుకే టికెట్ల ధరలు ఇంకా తగ్గింపు అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు… ఐనా సరే… సారీ, నో థాంక్స్…!!
Share this Article