ఆశ్చర్యం ఏమిటంటే… హాకీ వరల్డ్ కప్ మన దేశంలోనే సాగుతున్నా ఎక్కడా ఒక్క వార్త లేకపోవడం… ప్రచారం లేకపోవడం… నిజంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్థానంలో చంద్రబాబు వంటి లీడర్ ఉంటే ఇప్పటికే హంగామా పీక్స్‌కు వెళ్లిపోయేది… నభూతో అన్నంతగా మీడియా కీర్తించేది… మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఈరోజు ప్రారంభమై 29 వరకూ భువనేశ్వర్‌లోని కళింగ, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియాల్లో సాగుతుంది…
ఏదీ ప్రారంభోత్సవం బాపతు అట్టహాసం..? ఆఫ్టరాల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటేనే ఏ నగరమైనా విపరీతమైన సందడిని సంతరించుకుంటుంది… మీడియా విపరీతమైన కవరేజీ ఇస్తుంది… వేరే ఏ ఇతర క్రీడాంశంలో పోటీ అయినా ప్రచారానికి నోచుకుంటుంది… అలాంటిది హాకీలో వరల్డ్ కప్ కూడా ఇంత అనామకంగా జరగడం ఏమిటి..? అదీ ఆశ్చర్యం…
ఎవరూ పట్టించుకోకపోతే మన హాకీని ఒడిశా ప్రభుత్వం దత్తత తీసుకుంది… ఇంటర్నేషనల్ స్థాయి శిక్షణ ఇప్పించింది… మొన్నటి ఒలింపిక్స్‌లో మన జట్ల కొన్ని మెరుపులు ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం పుణ్యమే… దత్తత తీసుకున్నప్పుడు సీఎం నవీన్ పట్నాయక్ తన అధికార గణానికి చెప్పింది ఒకటే… మనకు ఓ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కావాలి… సో, భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియాన్ని రినోవేట్ చేయడం, అదనంగా మరో కొత్త స్టేడియం కట్టడం…
Ads
అసలు కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ స్టేడియాలను అంతర్జాతీయ హాకీ పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, కొత్తగా నిర్మించడం పెద్ద సవాల్… కానీ ఒడిశా ప్రభుత్వం ఆ సవాల్ స్వీకరించింది… ఆ బాధ్యతను మన తెలుగువాడు, అక్కడి స్పోర్ట్స్ సెక్రెటరీ వినీల్ కృష్ణ తీసుకున్నాడు… తనేమిటో ప్రూవ్ చేసుకున్నాడు… ముఖ్యమంత్రి నమ్మకాన్ని కూడా నిలబెట్టాడు… తుషార్ కాంతి బెహెరా కూడా వీళ్లకు తగినట్టు దొరికాడు… దాంతో 15 నెలల్లోనే 260 కోట్ల ఖర్చుతో, 20 వేల మంది హాజరయ్యే గ్లోబల్ హాకీ స్టేడియం నిర్మించారు రూర్కెలాలో..!
ఆల్రెడీ ఉన్న స్టేడియం నవీకరిద్దామని అనుకున్నారు… అదేమో సెయిల్ వాళ్లది… వాళ్లు సహకరించలేదు… దాంతో కొత్త స్టేడియం సొంతంగా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు… 12 నెలల గడువు పెట్టుకున్నారు… పెద్ద టాస్క్ అది… కానీ 15 నెలల్లోనే కట్టి చూపించారు… అంత సులభంగా ఏమీ జరగలేదు… మన వినీల్ కృష్ణ ఏమంటాడంటే..? ‘‘ఒకవైపు కరోనా సృష్టించే అడ్డంకులు, వాతావరణ అననుకూలతలు, గ్లోబల్ సప్లయ్ చెయిన్ అంతరాయాలు మాకు ప్రతికూలతలుగా మారాయి…
మరింత చదవడానికి ముందు మన తెలుగు ఐఏఎస్ వినీల్ కృష్ణ సారథ్యంలో ఆ ప్రభుత్వం మన హాకీకి ఎలా పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేసిందో ఈ లింకులో చదవండి…
మన తాజా ఒలింపిక్స్ హాకీ విజయాల వెనుక ఓ గట్టి తెలుగు బుర్ర…!!
‘‘రెండు మూడు మ్యాచులు నిర్వహించేలా స్టేడియం కడితే సరిపోతుందని భావించాం మొదట్లో… ఇంటర్నేషనల్ ప్లేయర్లు, కోచ్‌లు వస్తారు, వాళ్లకు హోటల్ ఎలా..? ముఖ్యమంత్రేమో భువనేశ్వర్ కళింగ స్టేడియం స్థాయిలోనే రూర్కెలాలో కూడా మ్యాచులు జరగాలి, ఈ రెండు స్టేడియాల్లో మనం హాకీ వరల్డ్ కప్ నిర్వహించాలి అని టార్గెట్ పెట్టాడు… అప్పటికే వేక్సిన్ వచ్చింది, వర్క్ ఫోర్స్‌కు ముందుగా వేక్సినేషన్ పూర్తిచేశాం, సీరియస్‌గా వర్క్‌లో పడిపోయాం…
మాకు ఆనందంగా ఉంది, ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ అయినా లేకుండా నేరుగా మేం రూర్కెలాలో ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం… తాజ్ గ్రూపుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని 225 మందికి సరిపోయేలా, ఫైవ్ స్టార్ సౌకర్యాలున్న హోటల్ గదులను నిర్మించాం… బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (BPUT) భవనాన్ని అప్‌డేట్ చేస్తే సరిపోతుందని ముందుగా అనుకున్నాం, కానీ దానికి అంత కెపాసిటీ లేదు… దాంతో కొత్త నిర్మాణాలకు వెళ్లాల్సి వచ్చింది… రూర్కెలాలో విమానాశ్రయం ఎలాగూ ఆపరేషన్‌లో ఉంది… అవసరమైతే జార్సుగూడ ఉంది, అదనపు ట్రిప్పులు నడపటానికి…
టాటా సహకారంతో భువనేశ్వర్‌లో ఓ హైపర్‌ఫార్మెన్స్ సెంటర్ పెట్టబోతున్నాం… సేమ్, రూర్కెలాలో కూడా అలాంటి సౌకర్యాన్ని కల్పించబోతున్నాం… దిగువ స్థాయిలో హాకీని ప్రోత్సహించడానికి 21 సింథటిక్ టర్ఫ్‌లతో హాకీ ట్రెయినింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాం… రూర్కెలాలోనే అయిదు ఉన్నాయి… హాకీకి తగిన ఇంతటి మౌలిక వసతుల కల్పన దేశంలో ఇంకెక్కడా జరగలేదు…’’ నిజంగా ఇవన్నీ మన మీడియాకు ఎందుకు కనిపించలేదు… ఈరోజు వరల్డ్ కప్ మొదటి మ్యాచ్… ఎవరు సహకరించకపోయినా, సొంతంగా నిశ్శబ్దంగా ఇంతగా మౌలిక వసతుల్ని క్రియేట్ చేసుకుని, వరల్డ్ కప్ నిర్వహిస్తూ ఒడిశా ప్రభుత్వమే ఈ కప్ గెలిచినట్టు…! ఒడిశా ప్రభుత్వ టీంలో కీలకమైన ప్లేయర్ మన తెలుగు ఐఏఎస్ అధికారి..!!
Share this Article