Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘రెండు ఘంటసాల వెయ్యి, సుశీలను కూడా పెట్టు, చివరలో సిధ్ శ్రీరాం…’

May 10, 2024 by M S R

Ashok Vemulapalli….   సుశీల-ఘంటసాల (బజ్జీ-ఉగ్గానీ)… రాయలసీమ ఆతిథ్యం గురించి సినిమాల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా ఇవాళే చూసాను.. శతృవైనా ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారని విన్నాను.. అక్కడ వాళ్లు చూపించే ప్రేమకే కడుపు నిండిపోతుంది..

కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఇంటికి ఇవాళ వెళ్లినపుడు.. ముందు కడుపు నిండా తినండి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు ఆయన.. నాకు అంతకుముందు అసలు పరిచయం లేదు..

మాతో పాటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు .. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు.. డైనింగ్ టేబుల్ మీద ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు.. ఆవిడని చూస్తే ఎవరికైనా అమ్మ గుర్తుకు వస్తుంది.. అంతటి ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు.. ఒక మాజీ ముఖ్యమంత్రి (కోట్ల విజయభాస్కరరెడ్డి ) కొడుకు, ఒక కేంద్ర మాజీ మంత్రి (సూర్య ప్రకాష్ రెడ్డి) పక్కన నేను కూర్చుంటే మాజీ ఎమ్మెల్యే (కోట్ల సుజాతమ్మ ) మాకు వడ్డిస్తున్నారు..

ఉదయం పూట కావడంతో ఇడ్లీ, దోశ లాంటివి ఉంటాయనుకున్నాను.. కానీ ప్లేట్లులో ఉగ్గానీ బజ్జీ పెట్టారు.. నేను తింటోంటే .. ఆ ప్లేటులో ఇంకో రెండు ఘంటసాల వేయి.. కాస్త సుశీలని పెట్టు.. ఆ లక్ష్మిని కూడా వేయి.. మన టేస్ట్ చూస్తారు అంటున్నారు సూర్యప్రకాష్ రెడ్డి గారు.. ఘంటసాల ఏంటి? సుశీల ఏంటి? లక్ష్మి ఏంటి? సరదాగా అంటున్నారా అని ఆయన ముఖం వైపు చూస్తుంటే సుజాతమ్మ గారు నావైపు చూసి నవ్వి … ఏమీ అర్థం కాలేదా అన్నారు ..

Ads

మేము ఉగ్గాని బజ్జీని .. సుశీల- ఘంటసాల అని పిలుస్తాము.. ఉగ్గానే సుశీలమ్మ గొంతు అంత మెత్తగా గొంతులోకి వెళ్తే బజ్జీ .. ఘంటసాల గొంతులా కొంచెం గట్టిగా, కొంచెం కారంగా ఉంటుందని వీటిని అలా పిలిచేవాళ్లు..

మరి లక్ష్మి ఎవరు అన్నాను.. లక్ష్మి అంటే చింతకాయ పచ్చడి అంటూ నా ప్లేట్ లో కొంచెం చింతకాయ పచ్చడి వేశారు.. ఆ సుశీలని ఈ లక్ష్మితో కలిపి ముద్దలా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది .. చింతకాయ తొక్కు మా చెట్ల కాయలతోనే పడతాము.. ఇది మాకు లక్ష్మి తో సమానం.. ఇది ఎవరు అడిగిన ఇవ్వం.. ఆఖరికి మా కూతుళ్లు అత్తారింటికి వెళ్తున్నప్పుడు కూడా చింతకాయ పచ్చడి మాత్రం ఇవ్వం.. కావాలి అంటే మాకు డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్లవచ్చు.. అంతేగానీ ఊరికే మాత్రం ఇవ్వం.. కానీ మా ఇంట్లో ఎంతైనా తినొచ్చు ..

అలాగే కొత్త ఇల్లు గృహప్రవేశం రోజు కూడా చేతిలో చింతకాయపచ్చడి జాడీ పట్టుకుని ఇంటి లోపలికి వెళ్తాం.. ఇంత గొప్పగా లక్ష్మి దేవిలా చింతకాయ పచ్చడిని భావిస్తాం .. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఢిల్లీ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నపుడు కేవలం లక్ష్మి కోసం ఎంతోమంది మా ఇంటికి భోజనానికి వచ్చేవారు .. ఎంతమందికైనా లక్ష్మితో కలిపి భోజనం పెట్టేవాళ్ళం కానీ ఎవరికీ లక్ష్మిని ఉచితంగా ఇచ్చేవాళ్ళం కాదు.. అప్పట్లో మా ఇంట్లో భోజనం చేసినవాళ్లు ఇప్పటికీ ఫోన్ చేసి లక్ష్మి కావాలని అడుగుతారు అని నవ్వుతూ చెప్పారు సుజాతమ్మగారు

అలా చెబుతూనే నాకు నాలుగుసార్లు ఘంటసాల, సుశీలని, లక్ష్మిని వడ్డించారు.. మధ్యలో కందిపొడి వడ్డించారు .. ఇక అయిపోయిందని నేను లేస్తోంటే.. ఏంటీ అప్పుడే అయిపోయిందా? ఇంకా సిద్ శ్రీరామ్ ని వడ్డించుకోరా? అంటూ నవ్వుతూ నా ప్లేట్లో గడ్డపెరుగు వడ్డించారు .. దీనికి ఎవరూ పెట్టలేదులే.. నేనే సరదాగా పెట్టాను .. ఈ గడ్డ పెరుగు మా ఇంట్లో గేదెల నుంచి వచ్చిన పాలతో చేశాము.. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.. అన్నారు

సిద్ శ్రీరాం ని అలా చేత్తో తీసుకుని ఉగ్గానితో కలిపి నోట్లో వేసుకుంటే గుండెల్లో ఇళయరాజా సంగీతం అలా మోగుతూనే ఉంది..

(అలా ఉదయ ఫలహారం ముగించుకుని మేము బయటకు వస్తుంటే .. గేటు వరకూ సూర్యప్రకాశ్ రెడ్డి గారు, సుజాతమ్మ, వారి ఇద్దరు కూతుళ్లు వచ్చి మమ్మల్ని సాగనంపారు .. కారు ఎక్కేముందు .. మీ లక్ష్మిని కొంచెం ఇస్తారా.. అని నేను అడుగుతుంటే .. అస్సలు ఇచ్చేదే లేదు అంటూ నవ్వుతూనే కళ్లతో చెప్పారు సుజాతమ్మ )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions