రాజకీయాల్లో పరిపక్వత ఎలా ఉండాలో, అపరిపక్వత ఎలా ఉండకూడదో చెప్పడానికి నిన్నటి మోడీ బెంగాల్, ఒడిశా పర్యటనలే ఉదాహరణలు… రాజకీయాలు వేరు, పరిపాలనకు సంబంధించి కేంద్రం- రాష్ట్రాల నడుమ సంబంధాలు వేరు… ప్రత్యేకించి విపత్తు సందర్భాల్లో పాలకస్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఉదాత్తమైన ప్రవర్తనను ఆశిస్తాం… కానీ ఎప్పటిలాగే మమతా బెనర్జీ చిల్లర వేషాలను ప్రదర్శించి, తన తత్వాన్ని మరోసారి తేటతెల్లం చేసుకుంది… మోడీ ఈ దేశానికి ప్రధాని, మమత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి… యాస్ తుపాన్ విపత్తుపై ప్రధాని స్వయంగా సమీక్షకు వచ్చినప్పుడు ఓ సగటు టీఎంసీ కార్యకర్త స్థాయిలో ప్రవర్తించింది ఆమె… కావాలని ఓ అరగంట లేటుగా వెళ్లింది… తరువాత 20 వేల కోట్లు ఇవ్వాలంటూ ఓ మెమోరాండం ప్రధాని దగ్గర పడేసి, చక్కా వెళ్లిపోయింది… ఓ సంస్కారం లేదు, ఓ పరిపక్వత లేదు… కానీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హుందాగా వ్యవహరించాడు…
నిజానికి ఒడిశాలో బీజేపీ, బీజేడీలే రాజకీయ ప్రత్యర్థులు… కాంగ్రెస్ ఎప్పుడో కొట్టుకుపోయింది అక్కడ… ఐతేనేం, రాజకీయాలు వేరు… ఈ సందర్భంలో ఒక సీఎం, ఒక పీఎం… అంతే… ముఖ్యమంత్రిగా ప్రధానిని రిసీవ్ చేసుకున్నాడు, తుపాన్ నష్టాల్ని వివరించాడు… అంతేకాదు, దేశమంతా కరోనా సంక్షోభంలో ఉంది… కేంద్రంపై బరువు మోపేలా తక్షణసాయాన్ని మేం ఏమీ డిమాండ్ చేయడం లేదు అన్నాడు… ఈ వ్యాఖ్య పట్ల దేశవ్యాప్తంగా నవీన్ పట్నాయక్‌పై అభినందనలు కురిశాయి… ఈ తుపాన్ నష్టాల నుంచి బయటపడటానికి మా సొంత వనరులనే ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాం అన్నాడాయన… మాకు మోడీ అదివ్వలేదు, ఇదివ్వలేదు, అందుకే మేం ప్రజలకు ఎక్కువ సాయం చేయలేకపోతున్నాం అని కుంటిసాకులతో పొద్దుపుచ్చే సీఎంలు చదవాల్సిన వార్త ఇది… మమత ఎలాగూ మారదు గానీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి సీఎంలు మరీ మరీ చదవాలి… కేరళ సీఎం విజయన్ కూడా బీజేపీకి రాజకీయ ప్రత్యర్థే అయినా ఇలాంటి పాలనపరమైన సంబంధాల్లో మెచ్యూర్డ్‌గానే వ్యవహరిస్తుంటాడు…
Ads
‘‘మాకు తక్షణ సాయాలేమీ అక్కర్లేదు… కానీ ఒడిశా ఎప్పుడూ ప్రకృతి సంబంధ విపత్తులతో తల్లడిల్లిపోతోంది… దీర్ఘకాలిక విపత్తు నియంత్రణ చర్యల కోసం… మౌలిక వసతుల కోసం సాయం చేయండి…’’ అని మోడీని అడిగాడు ఒడిశా సీఎం… కరెక్ట్ అప్రోచ్… నిజానికి ఇదే కాదు, సీఎంగా ఆయన పనితీరు ఎప్పుడూ హుందాగానే ఉంటోంది… పబ్లిసిటీ పిచ్చిలేదు, ఎడాపెడా ఆబగా డబ్బు తినేది లేదు… వారసుల సమస్య లేదు, చిల్లర మాటల ప్రసక్తే లేదు… ఒక రిథమ్ ప్రకారం అధికార వ్యవస్థ పనిచేస్తూ పోతుంటుంది… దేశమంతా ఆక్సిజన్ కొరత ఏర్పడి, అనేకచోట్ల రోగులు మరణించిన విషాదపర్వంలో… ఒడిషా ప్రభుత్వం పకడ్బందీగా, తన విద్యుక్తధర్మంగా భావించి వేల టన్నుల ఆక్సిజన్‌ను అనేక రాష్ట్రాలకు పంపించింది… ఎక్కడా అపశృతి దొర్లకుండా ప్రత్యేకంగా అధికారుల వ్యవస్థను అప్పటికప్పుడు ఏర్పాటు చేసింది… అటు బెంగాలీ మమత బెనర్జీ, ఇటు ఒడియా నవీన్ పట్నాయక్… ఫుల్ కంట్రాస్ట్… అలా ఉండాలి, అలా ఉండకూడదు…!!
Share this Article