ఇంతకూ బడ్జెట్లో మధ్య తరగతికి వచ్చిందేమిటి?
————————
సాధారణంగా ఎల్ కే జీ లో చేరితే పి హెచ్ డి దాకా తరగతులు, తరగతి గదులు, భవనాలు మారుతూ ఉండవచ్చు. మారడం ఇష్టంలేని వారు ఒకే తరగతిలో పదేళ్లయినా ఉండిపోవచ్చు. ఈ తరగతులకు అతీతమయినది మధ్య తరగతి. కొంచెమే అతీతమయినది ఎగువ మధ్య తరగతి. మరీ దుర్భరమయినది దిగువ మధ్య తరగతి.
భారత దేశ 130 కోట్ల జనాభాలో ఎక్కువ శాతం జనాభా ఈ మూడు తరగతుల మధ్యలోనే బతుకు పాఠాలను చాలా కష్టంగా చదువుకుంటూ ఉంటుంది. సృజనాత్మక రచయితలందరి ఏకాభిప్రాయం ప్రకారం మధ్య తరగతి స్వరూప స్వభావాలు, లక్షణాలు ఇలా ఉంటాయి.
Ads
1 . నెల జీతమే ఆధారం.
2 . జీతం రాగానే పాలు, పేపర్, కరెంట్, ఫోన్, ఇంటర్నెట్, హౌసింగ్ లోన్ లేదా ఇంటి అద్దె, వెహికిల్ లోన్ ఈ ఎం ఐ పోగా మిగిలేది ఉండదు.
3 . పదో పరకో మిగిలినా ఏ ఆసుపత్రి ఖర్చులో లేక ఇంకేదో అనుకోని ఖర్చు ఉండనే ఉంటుంది.
4 . నెల సగం గడవగానే ఎంతో కొంత అప్పులు చేయక తప్పని తిప్పలు.
5. ఆదాయానికి- ఖర్చుకు మధ్య ఎప్పటికీ పొత్తు కుదరదు.
6 . ఊపర్ షేర్వాణీ- అందర్ పరేషానీ.
7. పిల్లల చదువులకు, అమెరికా ఎం ఎస్ కు పాతిక లక్షల బ్యాంక్ లోన్ తప్పనిసరి.
8. అమ్మాయి పెళ్లికి ఆస్తుల అమ్మకం, అయినా చాలకపోతే అప్పులు.
9 . పెద్ద రోగమొస్తే దేవుడే దిక్కు.
ఇంకా అంతర్గతంగా మధ్య తరగతుల లక్షణాలు చాలా ఉన్నాయి కానీ- వారి మనోభావాలను గౌరవించి ఇక్కడికి వదిలేయడం మంచిది.
————————
మధ్య తరగతి కోసం బడ్జెట్లో ఎన్నో పెడుతుంటారు. అవన్నీ మధ్య తరగతికి అందకుండా మధ్యలోనే మాయమవుతున్నాయేమోనని మధ్యతరగతి అనుమానం. ఈ రోజు కేంద్ర ఆర్థిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతుండగా టీ వీ ల్లో వచ్చిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఒక మధ్య తరగతి కుటుంబం తేరిపార చూసింది. ఒళ్లంతా చెవులు చేసుకుని విన్నది. వారికి అర్థమయినట్లు వారి భాషలో వారు బడ్జెట్ ను అన్వయించుకున్నారు. అది ఇక్కడ అనవసరం. ఒక సగటు మధ్య తరగతి కుటుంబంలో భర్త, భార్య, కాలేజీకెళ్లే కూతురు, స్కూల్ కెళ్లే కొడుకు- బడ్జెట్ తరువాత టీ వీ ల్లో చూసిన చర్చలు, పేపర్లలో చదివిన వార్తల సారమిది.
1. ఆత్మ నిర్భర భారత్ లో ఇరవై లక్షల కోట్లు.
2. రోజూ పెరిగే పెట్రోల్, డీజిల్ రేట్లకు అగ్రి సెస్ పెట్రోల్ కు రెండున్నర, డీజిల్ కు నాలుగు రూపాయలు. ప్రస్తుతానికి రేట్లు పెరగకపోయినా భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు.
3 . డెబ్బయ్ ఐదేళ్లు దాటిన పెన్షనర్లు ఐ టి రిటర్న్స్ వేయకపోయినా పరవాలేదు.
4 . ఇన్సురెన్సుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింతగా పెంపు.
5 . గెయిల్ లాంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం.
6 . తలసరి సగటు ఆదాయం స్థూల ద్రవ్య సూచీ కంటే కింద పాతాళంలోకి చొచ్చుకు పోతోంది.
7. విదేశీ సంస్థాగత మదుపుదారులు అదుపు లేకుండా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి తలుపులు బార్లా తెరిచారు.
8. దేశంలో 130 కోట్ల జనాభాలో కోటి యాభై లక్షల మంది మాత్రమే ఆదాయపు పన్ను కడుతున్నారు. కనీసం పది శాతం అంటే పదమూడు కోట్ల మంది ఐ టీ వలలోకి రావాలన్నది ప్రభుత్వ దూరదృష్టి. వజ్ర సంకల్పం. ప్రయత్నం.
9. రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రెపో రేటులో రేపో మాపో మార్పులొచ్చి ఆర్థికం బండి రివర్స్ గేర్లో వెళ్లవచ్చు. అదృష్టం బాగుంటే టాప్ గేర్లో అయినా వెళ్లవచ్చు.
10. ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి నిరర్థక, అనర్థక, అర్థరహిత, అర్థ వ్యతిరేక పదాలన్నిటినీ దశల వారీగా అర్థశాస్త్ర నిఘంటువుల నుండి ఉపసంహరించడానికి శబ్దార్థ, ప్రతిపదార్థ, అర్థాన్వయ, అనంతార్థ కోవిదులతో ఒక అర్థ నిర్భరార్థం శబ్ద్ కోశ్ ఉపసంహరణ్ అభియాన్ ఏర్పాటు.
11. స్వదేశీ స్వయం ప్రకటిత్ ఆత్మావాహన్ వాహనంలో విదేశీ ఆత్మ దుర్భర్ ఆత్మల ప్రవేశానికి ఆంక్షల సడలింపు.
————————
సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీద పడ్డా, మిన్ను విరిగి మీద పడ్డా చలించనిది మధ్య తరగతి. దెబ్బలు తగిలి తగిలి మధ్య తరగతి గుండె ఎప్పుడో బండబారిపోయింది. ఇప్పుడు తాయిలాలకు పొంగిపోయి చేయి చాచదు. దెబ్బలకు కుంగిపోయి నడక ఆపదు.
ఎంత చదివినా ఇంకా ఎంతో చదవాల్సింది మిగిలిపోయేదే మధ్యతరగతి. మధ్య తరగతి బడ్జెట్ మానసిక ప్లాన్ ముందు ప్రపంచ ఆర్థిక శాస్త్ర మహా గ్రంథాలన్నీ చిన్నబోతాయి………… By…-పమిడికాల్వ మధుసూదన్
Share this Article