ఆయన మోడీ మీద రెండు ప్రశంసాపుష్పాలు విసిరాడు… అంతే, అప్పటిదాకా తనను వీరాభిమానించేవాళ్లు సైతం చాలామంది హఠాత్తుగా మనువాదిని చేశారు… మతోన్మాది అన్నారు… సంఘీ అని తిట్టారు… ఇన్నేళ్ల తమ అభిమానానికి నిలువెత్తు పాతరేసి, యమర్జెంటుగా రెండు మూడు పుష్పాల్ని నివాళిగా అర్పించారు… ఖతం…
ఇళయరాజా… గొప్ప సంగీతకారుడే… డౌట్ లేదు… అదేసమయంలో పలు వివాదాల్లోనూ ఆయన పేరు తరచూ వినిపిస్తుంటుంది… ప్రత్యేకించి సినిమా పాటల రాయల్టీ గట్రా… ఆ కెరీర్, ఆ ప్రపంచం వేరు… ఆయన సంగీత విద్వత్తు వేరు… తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా సొంత అభిప్రాయాలు ఉండటానికి వీల్లేదా..? మోడీని మెచ్చుకుంటే అది బ్రహ్మహత్యాపాతకమా..? హేమిటో ఇదంతా…
ఇలాంటి హఠాత్ విమర్శకులు ఇన్నేళ్లు ఆయన సంగీత ప్రతిభను చూపి అభిమానించారా..? లేక ఇన్నేళ్లూ ఆయన ప్రదర్శించిన రాజకీయ తటస్థతను అభిమానించారా..? సరే, ఈ చర్చ కాసేపు వదిలేద్దాం… సాధారణంగా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు తమిళనాట మంచి మంచి పదునైనా కార్టూన్లు కనిపిస్తాయి… ఈ వివాదం మీద ఎందుకో కనిపించలేదు…
Ads
కాకపోతే ఎందుకు ఇళయరాజా హఠాత్తుగా మోడీని ప్రశంసిస్తున్నాడనే అంశంపై మాత్రం రకరకాల ఆసక్తికర కథనాలు కనిపిస్తున్నాయి… సాధారణంగా పన్ను ఎగవేతదారులు, రుణ బకాయిదారులు, డిఫాల్టర్లు గట్రా బీజేపీలో చేరి రక్షణ పొందుతుంటారనే ప్రచారం ఉన్నదే కదా… సీబీఐ లేదా ఈడీ తరుముకొస్తే వెంటనే బీజేపీ ఆఫీసుకు వెళ్లాలనే చెణుకులు వింటూనే ఉన్నాం కదా… ఇళయరాజాకు ఈమధ్య జీఎస్టీ నోటీసులు వచ్చాయి…
జీఎస్టీ ఇంటలిజెన్స్ డీజీ నుంచి ఫిబ్రవరి 28న ఒకటి… మార్చి ఒకటిన మరొకటి… ఏమయ్యా, జీఎస్టీ బకాయిలు చెల్లించడం లేదేమిటి..? ఏమిటీ కథ..? అనేదే ఆ నోటీసుల సారాంశం… ఒకవేళ చెల్లించి ఉంటే ప్రూఫులు తీసుకుని, వెంటనే వచ్చెయండి అని హుకుం… వాటిల్లో డెడ్‌లైన్ కూడా పెట్టారు… ఓహో, అందుకేనా ఇళయరాజా మరీ మోడీ మీద పొగడ్తలకు తెగబడ్డాడు అనే విమర్శలు వెల్లువెత్తాయి…
ఇళయరాజా టీం, ఆయన లాయర్ల కౌన్సిల్ మాత్రం దీన్ని ఖండిస్తోంది… ‘‘అబ్బే, నోటీసులకూ ఈ ప్రశంసలకూ లింక్ లేదు… జీఎస్టీ బకాయిలు అనేది 2017 నాటి ఇష్యూ… అన్ని బకాయిలూ చెల్లించేశాడు ఇళయరాజా… ఆ ఇష్యూ ఎప్పుడో సెటిలైంది… కాకపోతే ఆ కేసు ఇంకా ఎందుకు మూసేయలేదో అర్థం కావడం లేదు’’ అంటున్నారు వాళ్లు…
ఏదో నాలుగు ముక్కలు మెచ్చుకుంటే పెద్దగా ఇంత వ్యతిరేకత రాకపోయేది… కానీ కొన్ని మోడీ నిర్ణయాలతో అంబేద్కర్ కూడా గర్వపడేవాడు అని ప్రస్తావించడం చాలామందికి నచ్చలేదు… ‘‘ట్రిపుల్ తలాఖ్, బేటీ బచావో బేటీ పడావో వంటి మోడీ నిర్ణయాలు సామాజిక మార్పులకు దోహదపడతాయి, డాక్టర్ అంబేద్కర్ కూడా గర్వించేవాడు’’ అని ప్రస్తావించాడు ఓ ముందుమాటలో…
ఈ 78 ఏళ్ల సంగీత విద్వాంసుడికి నిజంగా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయా..? అందుకే మోడీ భజన అందుకున్నాడా..? ఈ సందేహాలు కూడా తమిళ సైట్లు, యూట్యూబ్ వార్తలు, మీడియా విమర్శల్లో బోలెడు… ప్రత్యేకించి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్టు ప్రచారం ఒక్కసారిగా పెరిగి పోయింది…
చివరగా ఒక్క మాట…. ఇళయరాజాకు పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయో లేవో తెలియదు గానీ… ఆయన తమ్ముడు గంగై అమరన్ 2017లోనే బీజేపీలో చేరాడు… ఫేమస్ సీట్ ఆర్‌కే నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేశాడు కూడా… ఆయన కూడా సంగీత దర్శకుడే, లిరిసిస్ట్ కూడా… బేసిక్‌గా ఇళయరాజా కుటుంబం బీజేపీలో ఎప్పుడో చేరింది… ఇప్పుడు మోడీని ప్రశంసిస్తే అందులో కొత్తగా విడ్డూరపడాల్సింది ఏమిటనేదే అర్థం కాని ప్రశ్న…!!
Share this Article