మీకు గుర్తుందా..? 2019… యూపీ, మీర్జాపూర్‌లోని జమాల్‌పూర్ బ్లాక్, సియూర్ పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద రొట్టె, ఉప్పు పెట్టారు… కూర కాదు, జస్ట్ ఉప్పు… పేద పిల్లల కడుపు నింపే ఆ పథకాన్ని కూడా భ్రష్టుపట్టించిన తీరును వివరించే ఆ దృశ్యాన్ని పవన్ జైస్వాల్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ వీడియో తీశాడు…
ఎండిన రొట్టెలు, అందులోకి ఉప్పు… కడుపు తరుక్కుపోయేట్టుగా ఉన్న ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది… చాలా మీడియా సంస్థలు వెంటనే దాన్ని అందుకుని ప్రత్యేక కథనాలు చేశాయి… జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై సీరియస్ అయ్యాడు, ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశాడు… ఒకరు ఆ స్కూల్ మధ్యాహ్నభోజనం ఇన్చార్జి, మరొకరు గ్రామపంచాయితీ సూపర్‌వైజర్…
తరువాత ఏమైంది..? ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చడానికి కుట్ర చేశాడనే ఆరోపణతో పోలీసులు కేసు నమోదు చేశారు… అరెస్టు చేశారు… వార్తలో నిజం లేకపోతే మరి కలెక్టరే దర్యాప్తు చేసి, ఇద్దరిని సస్పెండ్ చేశాడు కదా… మళ్లీ ఈ నేరారోపణ ఏమిటి..? ఈ ప్రశ్నను ఎవరూ పట్టించుకోలేదు… జర్నలిస్టు సంఘాలు ఖండించాయి… ఎడిటర్స్ గిల్డ్ ప్రభుత్వాన్ని నిందించింది… కానీ ఏమీ ఫాయిదా జరగలేదు…
Ads
మూడు నెలలపాటు జైలులో ఉన్నాడు… తరువాత తన తప్పేమీ లేదని తేల్చి, వదిలేశారు… తననే కాదు, తనకు సమాచారం ఇచ్చిన ఓ గ్రామస్థుడిని కూడా అరెస్టు చేశారు… ఏదైనా వార్త వస్తే, అందులో నిజానిజాలు తేల్చుకుని, తప్పుంటే సరిదిద్దుకోవడం, లేదంటే ఖండించడం సాధారణంగా అధికార యంత్రాంగానికి పరిపాటి… కానీ ఇక్కడ ఆ జర్నలిస్టుపై పగబట్టినట్టే వ్యవహరించింది యోగి సర్కారు…
సరే, ఓ కుట్రతో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆ జర్నలిస్టు గనుక ప్రయత్నించి ఉంటే… మరి మూడు నెలల దర్యాప్తులో తేల్చలేదేం..? నిర్దోషిగా ప్రభుత్వమే వదిలేసింది… మరెందుకు కేసు పెట్టినట్టు..? కలెక్టరే స్వయంగా ఆయన వార్తలో నిజం ఉందని ఆల్‌రెడీ అంగీకరించాడు కదా, మళ్లీ కేసెందుకు పెట్టారు..? ఎందుకంటే..? ఉక్రోషం… నిజాల్ని బయటపెట్టాడనే కక్ష…
ఎప్పుడైతే ప్రభుత్వానికి టార్గెట్ అయ్యాడో, ఇక తనకు ఇంకెక్కడా పని దొరకలేదు… మరోవైపు మౌత్ కేన్సర్ సోకింది… డబ్బుల్లేవు… నా చికిత్సకు డబ్బులు ఇవ్వండి అంటూ క్రౌడ్ ఫండింగ్ కోసం అర్థించాడు నెల క్రితం… కానీ ఏమీ ఒరగలేదు… చివరకు మరణించాడు… ఒక గ్రామీణ జర్నలిస్టుగా నిజాయితీగా, వృత్తినిబద్ధతతో వ్యవహరించి, సొసైటీ కోసం తపన పడినందుకు, చివరకు తనే ప్రాణాలు కోల్పోయాడు… యోగి పాలనకు పవన్ జైశ్వాల్ చావు ఓ చేదు మరక..!!
Share this Article