ఆమె పొంగిపోయింది… తన విద్యార్థిని ఓ జిల్లా కలెక్టర్‌గా చార్జి తీసుకోవడం ఆమెకు గర్వంగా తోచింది… ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి..? ఎస్, ఆ విద్యార్థినితోనే ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి… అదీ సదరు కలెక్టర్ జెండా వందనం చేస్తున్నప్పుడు… పోలీస్ బలగాలు ఆమెకు గౌరవ వందనం చేస్తుంటే కళ్లారా చూడాలి… అనుకున్నదే తడవుగా ఆమె మధురై నుంచి కొట్టాయం వరకు రాత్రికిరాత్రి 250 కిలోమీటర్లు ప్రయాణించి, తన విద్యార్థిని ఇరవై ఏళ్ల తరువాత కలుసుకుంది… ఆనందంగా ఆలింగనం చేసుకుంది…
నిజానికి కొన్ని వార్తలు మొదట చదువుతుంటే… ఆఁ ఏముందిలే ఇందులో అనిపిస్తాయి… కాస్త ఆలోచిస్తే… నిజమే కదా, కొన్ని ఎమోషన్స్ చిన్నవైనా అపరిమిత ఆనందాన్ని ఇస్తాయి కదా అనిపిస్తాయి… ఇదీ అదే… కొట్టాయం కలెక్టర్ పేరు వి.విఘ్నేశ్వరి… ఆమె స్వస్థలం మధురై… అక్కడ SBOA హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది ఆమె… అక్కడ క్రిస్టినల్ శాంతి థియోడర్ లూథర్ హిస్టరీ బోధించేది…
Ads
ఈ కథలో విశేషం ఏమిటంటే… కలెక్టర్‌గా పనిచేస్తున్న మన పాత విద్యార్థిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పగానే మరో ఇద్దరు ఆమెతోపాటు వచ్చారు… అయితే వాళ్లు టీచర్లు కారు… ఆ స్కూల్‌లో ఆమెతోపాటు పనిచేసిన ల్యాబ్ అసిస్టెంట్ సిరాజ్, విఘ్నేశ్వరిని రోజూ స్కూల్‌ను తీసుకొచ్చిన బస్ కండక్టర్ షణ్ముగనాథన్… బాగుంది కదా… తమ కళ్ల ముందు స్కూల్ డ్రెస్సుల్లో రోజూ కనిపించిన పిల్ల నేడు కలెక్టర్… ఇరవై ఏళ్ల తరువాత ఆమెను చూడటం, కలవడం వాళ్లకు అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చింది…
క్రిస్టినాల్, ఆమె మాజీ సహచరులు రాత్రిపూట ప్రయాణించి నేరుగా కొట్టాయంలోని పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లారు.., ఇది జెండా ఎగురవేత వేడుకకు సిద్ధంగా ఉంది… ఎలాగోలా వారు అధికారిక గ్యాలరీలో సీటు పొందగలిగారు… అప్పుడు జెండా వందనం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు… తన తండ్రిని వీఐపీ గ్యాలరీ వద్దకు తీసుకెళ్లడానికి వేదిక దిగి వచ్చింది కలెక్టరమ్మ… తన మాజీ మిస్‌ను చూసింది… ఆశ్చర్యంతో ఆమె కళ్లు విచ్చుకున్నాయి…
“అప్పుడు నేను క్రిస్టినల్ మిస్‌ని చూశాను, ఆశ్చర్యపోయాను… దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమెను చూస్తున్నాను… నేను పాఠశాల పూర్తి చేసిన తర్వాత నాకు ఆమెతో టచ్ లేదు… ఆమె తన విద్యార్థిని కలవడం కోసం మధురై నుండి కొట్టాయం వరకు రాత్రిపూట ప్రయాణించి వచ్చిందని తెలిసి ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు… ఆమె మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి నన్ను బస్‌లో స్కూల్‌కి తీసుకెళ్లిన బస్ కండక్టర్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది..’’ అంటూ విఘ్నేశ్వరి మురిసిపోయింది…
జెండా ఎగురవేత కార్యక్రమం తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లోని పోలీస్ క్లబ్‌లో విఘ్నేశ్వరి తన టీచర్‌ని అందరికీ పరిచయం చేసింది కలెక్టర్.., కేరళ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్, కొట్టాయం జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర అధికారులతో కలిసి ఆ ముగ్గురూ అల్పాహారం చేశారు… గర్వంతో పొంగిపోయి, భావోద్వేగంతో నిండిన క్రిస్టినాల్ ఇలా చెబుతోంది..,
“నేను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న క్వీన్ మీరా ఇంటర్నేషనల్ స్కూల్‌లో అర్ధరాత్రి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత, నేను రోడ్డు మార్గంలో కొట్టాయం బయలుదేరాను. మేము మా సందర్శన గురించి ఎటువంటి సమాచారాన్ని నా విద్యార్థితో ముందస్తుగా పంచుకోకుండానే నేరుగా వేదిక వద్దకు వెళ్లాము… నా విద్యార్థి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశ ప్రజలకు సేవ చేయడం పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడం కంటే ఉపాధ్యాయురాలిగా గర్వించదగ్గ క్షణం నాకు మరొకటి ఏం ఉంటుంది..?
విఘ్నేశ్వరి 2015 కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిణి… మొన్నటి జూన్‌లో కొట్టాయం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది… ఆమె SBOAలో పాఠశాల విద్యను పూర్తి చేశాక… మధురైలోనే త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది… దీనికి ముందు, ఆమె కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది… ఆమె భర్త NSK ఉమేష్ కూడా మధురైకి చెందినవాడే.., పొరుగున ఉన్న ఎర్నాకులం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు తను…
Share this Article