నిజంగానే బాగా ఆసక్తికరం అనిపించింది ఒక వార్త… ముందుగా ఆ వార్త చదవండి… తరువాత మిగతా కథ…
‘‘దర్శకుడు వెట్రిమారన్ తీసిన ‘విడుదల పార్ట్- 1’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది… తమిళంలో మంచి విజయం సాధించింది… అఫ్ కోర్స్, తెలుగులో పెద్ద స్పందన ఏమీలేదు… ఇలాంటి జానర్లు తెలుగు వాళ్లకు పెద్దగా కనెక్ట్ కావు… అందుకే మన ఆడియెన్స్ లైట్ తీసుకున్నారు… కాకపోతే ఓటిటిలో చూసిన కొందరు శెభాష్ అంటున్నారు కొందరు…
థియేటర్ ప్రేక్షకులకూ ఓటీటీ ప్రేక్షకులకూ నడుమ అభిరుచిలో తేడా కొంత ఉంటుంది… సరే, అప్పటి నుంచే రెండో భాగం మీద అంచనాలు పెరిగిపోయాయి… ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో కొంత ఫుటేజ్ చూపించి ఊరించాడు దర్శకుడు వెట్రిమారన్… తాజాగా నెదర్లాండ్స్ లో జరిగిన రాటెన్ డాం ఫిలిం ఫెస్టివల్ లో పార్ట్ 1 అండ్ 2 స్క్రీన్ చేశారు… కానీ ఒకింత షాక్ ఇచ్చింది…
Ads
నిజానికి విడుదల పార్ట్- 2 షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది… మరి ప్రీమియర్ ఎలా సాధ్యమయ్యిందనేగా డౌట్… అప్పటిదాకా తీసిన భాగాలను తెలివిగా ఎడిట్ చేయించి, ప్రత్యేక వర్షన్ తయారు చేయించాడట వెట్రిమారన్… దాంతో సీక్వెల్ లోని కొంత కీలక భాగం మిస్ అయినా ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలగకుండా ఏదో మేనేజ్ చేశారు… దీంతో షో అవ్వగానే వచ్చిన ఆహూతులందరూ లేచి నిలబడి చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారుట… సుమారు అయిదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులు వినిపించాయి… విజయ్ సేతుపతి, సూరి తదితరులు ఈ ప్రీమియర్ కి హాజరయ్యారుట…’’
ఇదండీ వార్త… ఇక్కడ విశేషం ఏమిటంటే..? టీవీ సీరియల్ ను వరుసగా ఒక ఏడాది పాటు మిస్సయినా సరే, కథను మిస్సయ్యామనే ఫీల్ రాదు మనకు… కానీ పకడ్బందీ స్క్రిప్ట్, కథాగమనం ఉన్న సినిమా అయితే ఒక్క సీన్ మిస్సయినా సరే ఏదో లింక్ మిస్సవుతాం… మిస్ కావాలి, అలా అయితేనే ఆ స్క్రిప్ట్ అంత గ్రిప్పింగుగా ఉన్నట్టు లెక్క… అలాంటిది ఇంకా షూటింగ్ మిగిలే ఉన్నా సరే, అప్పటివరకు షూటింగ్ జరిగిన సీన్లనే ఒక్కచోట కుట్టేసి, ఓ ఫుల్ లెంత్ సినిమాగా ప్రొజెక్ట్ చేశారంటే, అందరూ చప్పట్లు కొట్టారంటే ఇక ఆ మిగతా సీన్లకు విలువ లేనట్టేనా..? అవి లేకపోయినా పర్లేదా..? అంటే, ఇదీ టీవీ సీరియల్ బాపతేనా..? మరిక మంచి స్క్రిప్ట్ ఎలా అవుతుంది..?
నిజానికి ఇక్కడ వీరతాళ్లు వేయాల్సింది సదరు ఎడిటర్ కు… చేతిలో ఉన్న సీన్లనే బ్రహ్మాండంగా కుట్టేసి, కథలో ఏదో మిస్సయ్యామనే భావన కూడా రాకుండా మేనేజ్ చేశాడంటే ఆ ఎడిటర్ ఎవరో గానీ గొప్పోడు… ఈసారి నేషనల్ బెస్ట్ మూవీ ఎడిటర్ అవార్డుకు అర్హుడు… నిఝంగా నిఝం…!!
ఈ ఏడాది వేసవిలోగా ‘విడుదల పార్ట్- 2’ చిత్రీకరణ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాడట వెట్రిమారన్… ఈసారి అన్ని బాషల ఆడియన్స్ ని మెప్పిస్తానని ధీమాగా ఉన్నాడట కూడా… పార్ట్ -1లో విజయ్ సేతుపతి పాత్ర చాలా పరిమితం… రెండో భాగంలో మాత్రం కథ మొత్తం ఆయన గురించే ఉంటుందట… ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ నక్సలైట్ డ్రామా పూర్తయ్యాకే సూర్య వడివాసల్ ని వెట్రిమారన్ కొనసాగించబోతున్నాడు…
Share this Article