ది బర్త్ డే బాయ్… ఈ సినిమా కథేమిటీ, ఎలా ఉందీ అనే ప్రశ్నలకన్నా దర్శకుడి వ్యవహారశైలే విచిత్రంగా, సందేహాస్పదంగా, భిన్నంగా కనిపించింది… ప్రమోషన్ మీటింగుల్లో దర్శకుడు మాట్లాడుతూ మాస్క్ కట్టుకుని కనిపించాడు… తన మొహం చూపించడం లేదు…
అదేమిటయ్యా అంటే… ‘‘2016లో నా లైఫ్ లో జరిగిందే ఈ ఘటన… దాని మీద 2020లో సినిమా చేయాలి అనుకున్నాను… ఈ నాలుగేళ్ల సమయంలో అమెరికాలో ఉండి… ఉద్యోగం చేస్తూ డబ్బులు సేవ్ చేసుకున్నాను… ఆ డబ్బు తీసుకుని సినిమా తీయడానికి ఇండియా వచ్చేశాను… నేను సినిమా ఫీల్డ్ లోకి రావడం నా కుటుంబానికి ఇష్టం లేదు… నేను అసలు ఇండియా వచ్చిన సంగతి కూడా వాళ్లకు తెలియదు… అందుకే ఇలా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను…’’ అని చెప్పుకొచ్చాడు…
తను ఎక్కడ ఉన్నాడో, ఎటు తిరుగుతున్నాడో కూడా కుటుంబానికి తెలియదా..? తెలియకూడదా..? సరే, వాళ్లకు సినీ ఫీల్డ్ ఇష్టం లేదు, ఫ్రెండ్ తీస్తున్నాడు, తోడుగా ఉన్నాను చెప్పొచ్చు కదా… అంత గోప్యత దేనికి..? అంత రహస్యంగా ఇన్నిరోజులపాటు ఇండియాలో తిరగడం దేనికి..? పైగా విస్కీ అనే మారుపేరు… రచయితలకు కలం పేర్లుంటాయి… దర్శకులకూ గుప్తనామాలు ఉంటాయా..? ఈ విస్కీ ఏమిటి అనడిగితే నా కుక్క పేరు అంటాడు… అది చనిపోతే ఆ పేరు తనకు పెట్టుకున్నాడట… హేమిటో…
Ads
నా స్నేహితుడు బర్త్ డే బంప్స్ పేరిట సాగిన పిచ్చి చేష్టల్లో మరణించాడు, సో, దాని మీదే సినిమా తీయాలని అనుకున్నాను, 80 శాతం రియల్ స్టోరీ, 20 శాతం సినిమాటిక్ లిబర్టీ అన్నాడు, బాగానే ఉంది… కానీ నిజంగానే ఇది సీరియస్ సబ్జెక్టు… దానికి కొంత థ్రిల్లింగ్ కంటెంట్ కొంత జతచేసి, కామెడీ బేస్డ్ నడిపించడం సరైనది కాదేమో అనిపించింది… నిజంగానే బర్త్ డే పార్టీలు వికృతంగా సాగుతున్నయ్ ఈమధ్య…
అమెరికా నేపథ్యమే అయినా సరే, మొత్తం ఇండియాలోనే షూట్ చేశారు… అన్నీ కొత్త మొహాలే… రవికృష్ణ మాత్రం సీరియళ్లలో, టీవీ షోలలో కనిపిస్తాడు… బిగ్‌బాస్ ఫేమ్… పర్లేదు, బాగానే చేశాడు… మిగతా వాళ్లు కూడా వోకే… స్ట్రెయిట్‌గా కథలోకి వెళ్లాడు దర్శకుడు… అక్కడక్కడా కొన్ని లాగ్ సీన్స్ తప్ప మిగతాదంతా బాగానే తీశాడు… దర్శకుడిలో స్టఫ్ ఉంది, కాస్త వర్క్ చేస్తే ఓ సీరియస్ ఫిలిమే అయి ఉండేదేమో…
వోకే, కొత్త మొహాలతో ఈ ఔట్ పుట్ తీసుకురావడం ఆషామాషీ ఏం కాదు… సింక్ సౌండ్ బాగానే కుదిరింది… టెక్నికల్‌గా సినిమా వోకే… ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే తప్పులేదు… కానీ మరీ ఓ షార్ట్ ఫిలిమ్‌కు సరిపడే కథను ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ చేశారనే అభిప్రాయమైతే కలుగుతుంది… సో, థియేటర్లలోకన్నా ఓటీటీలో ఎక్కువ క్లిక్కయ్యే చాన్స్ ఉంది…!! పర్లేదు బ్రదర్, సినిమా ఓ మోస్తరుగా బాగానే ఉంది, మీ కుటుంబమూ యాక్సెప్ట్ చేస్తుంది, మొహానికి ఆ మాస్క్ తీసెయ్..,.!!
Share this Article