Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పంద్రాగస్టు వేళ పఠించాల్సిన కథ… భారతీయతను ఆత్మనిండా నింపుకున్న విదేశీ వనిత…

August 15, 2023 by M S R

(రమణ కొంటికర్ల)… ఆమె పుట్టుక స్విట్జర్లాండైనా… ఆమె ఆత్మ మాత్రం భారత్. త్రివిధ దళాల్లో సైనికులకిచ్చే అత్యున్నత పురస్కారమైన పరమ్ వీర్ చక్ర రూపకర్త కూడా హృదయమంతా భారతీయతను నింపుకున్న ఆ స్విస్ దేశస్థురాలేనన్నది బహుశా చాలా తక్కువ మందికి తెలిసిన విషయమేమో..?! ఆమే… సావిత్రిభాయ్ ఖనోల్కర్ గా తన పేరు మార్చుకున్న ఈవ్ వొన్నే మడే డి మారోస్.

స్విట్జర్లాండ్‌లోని న్యూచాటెల్‌లో జన్మించిన ఈవ్ వొన్నే మడే డి మారోస్.. 19 ఏళ్ల యుక్తవయస్సులోనే భారత్ ను సందర్శించింది. ఆ తర్వాత భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, భిన్నకులమతాల వ్యవస్థల్లో కనిపించే జీవ వైవిధ్యం ఆమెను అమితంగా ఆకర్షించాయి. అదే అదనుగా ఆమె భారతీయ మూలాలపై దృష్టి సారించింది. ఎంతగా అంటే ఇక్కడ భారతీయులమని చెప్పుకునే ఎందరికంటేనో కూడా.. ఆమె ఇక్కడి కళలు, సంగీతం, నృత్యం, భాషాశాస్త్రం, ఆధ్యాత్మికత, పురాణాలు, పురాతన గ్రంథాలు, సాంస్కృతిక సంపదపై అపార జ్ఞానాన్ని సముపార్జించింది.

అలా ఆమె భారత్ లో పర్యటిస్తున్న క్రమంలోనే.. యుకెలోని రాయల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ సైనికాధికారైన మహారాష్ట్రీయన్ విక్రమ్ ఖనోల్కర్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆయన్నే వివాహమాడి.. 1932లో ఈవ్ వొన్నే మడే డి మారోస్ కాస్తా తన పేరును సావిత్రీభాయి ఖనోల్కర్ గా మార్చేసుకుంది.

Ads

బ్రిటీష్ కబంధ హస్తాల నుంచి భారత్ కు విముక్తి లభించి స్వాతంత్ర్యం అనుభవించేందుకు సిద్ధమవుతున్న రోజులవి. బ్రిటీష్ పాలనా పద్ధతులు, నియమాలు, నిబంధనల వంటివాటిని పూర్తిగా తుడిచిపెట్టి… భారత్ తన సొంత అస్తిత్వం కోసం సిద్ధమవుతున్న తరుణాన ప్రణాళికలు రచిస్తున్న కాలమది. అలాంటి సమయంలో అప్పుడు భారతసైన్య సహాయక జనరల్ గా ఉన్న మేజర్ జనరల్ హీరా లాల్ అటల్‌కు ఆ బాధ్యతలను అప్పగించినప్పుడు… స్వదేశీ కాకున్నా.. భారత్ పై సావిత్రీభాయి ఖనోల్కర్ కున్న లోతైన జ్ఞానం హీరాలాల్ ను అమితంగా ఆకట్టుకుంది. దాంతో స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారత్ ను కొత్తగా రూపొందించే ప్రణాళికా బృందంలో… ఈవ్ వొన్నే మడే డి మారోస్ భాగస్వామురాలైంది.

ఈక్రమంలోనే సైనికులు ప్రదర్శించే శౌర్యానికిచ్చే పురస్కార పతకం తయారీకి బీజం పడింది. దేశ సరిహద్దుల్లో కంటిమీద రెప్ప వాల్చకుండా… ఎందరో గుండెలమీద చేయి వేసుకుని నిద్రించేలా జాతి కోసం పోరాడే సైనికులకిచ్చే పురస్కారమంటే మాటలా…? అది వారి జీవిత సాఫల్య కృషికి ఓ గుర్తింపుగా వారు భావించే ఓ అద్భుతమైన గౌరవ చిహ్నం. అలా పరమవీర చక్ర పురస్కార చిహ్నాన్ని డిజైన్ చేసిన ఘనతలో ఈవ్ వొన్నే మడే డి మారోస్ ది ప్రధానపాత్రైంది. అందుకు ఆమెకు వ్యూహంలోనూ, ధైర్యంలోనూ యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తయ్యాడు. అందుకే పరమ్ వీర్ చక్ర పురస్కార చిహ్నంపై… సాక్షాత్తూ భవానీ మాతే ఆయనకిచ్చినట్టు పురాణాలు పేర్కొనే రెండువైపులా కొస్సెటిదనంతో కనిపించే వజ్రాయుధంగా పిల్చే ఆ కత్తి ఆకారాన్ని ముద్రించారట.

వృత్తాకార కాంస్య రూపంలో కనిపించే ఈ పతకం.. ముందువైపున భారతదేశ చిహ్నం.. దాని చుట్టూ నాలుగు వజ్ర నమూనాలు కనిపిస్తాయి. దధీచి అనే రుషి తన శరీర ఎముకలను వజ్రాయుధంగా రూపొందించడానికి త్యాగం చేయడంతో తయారైన వజ్ర నమూనా అదని పురాణాలు చెప్పే మాట. వెనుకవైపున परमवीर चक्र అని హిందీలో.. అలాగే ఆంగ్లంలోనూ రెండు కమలాల మధ్య లిఖితమై ఉంటుంది. ఊదా రంగు రిబ్బనుతో మెడలో వేయడానికనుగుణంగా ఈ కాంస్య పురస్కారాన్ని రూపొందించారు.

అలా 1950లో మొట్టమొదటిసారి జరుపుకున్న గణతంత్ర దినోత్సవాన… సావిత్రి ఖనోల్కర్ అల్లుడైన సురేంద్రనాథ్ శర్మ సోదరుడు మేజర్ సోమనాథ్ శర్మ 1947లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అలా నాటి సోమ్ నాథ్ శర్మ నుంచి మేజర్ విక్రమ్ బాత్రా వరకూ ఆ పతకాన్నందుకున్నవారు 21 మంది కాగా.. 14 మందికి మరణానంతరమందించగా…మరో 16 మంది భారత్ -పాక్ యుద్ధాలలో పాల్గొన్న సైనికులకు వారి ధైర్యసాహసాలకు గుర్తింపుగా అందజేశారు.

అంతేకాదు, యుద్ధ సమయాల్లో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో సైనిక కుటుంబాలతో పాటు.. దేశ విభజన సమయంలో బాధితులైన వారికి ఆమె చేసిన సామాజిక సేవ కూడా ఎప్పటికీ మరువలేనిది. తన భర్త విక్రమ్ మరణానంతరం రామకృష్ణ మఠం కేంద్రంగా ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక బాటలో తన జీవితాన్ని గడిపారు. అంతేకాదు సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఓ పుస్తకాన్నీ రాశారు. ఇదండీ భారతీయ మూలాలను ఇష్టపడిన ఓ విదేశీ వనిత.. ఆమె చేతిలో రూపుదిద్దుకున్న పరమ్ వీర్ చక్ర పతకం కథ!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions